Trump Foreign Students Visa Cancel| అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశ వ్యతిరేక విధానాలను సమర్థించేవారు ఎవ్వరూ తమ దేశంలో ఉండొద్దని, తక్షణం వెళ్లిపోవాలని ఆదేశిస్తూ వందలాది మంది విదేశీ విద్యార్థుల వీసాలను అమెరికా ప్రభుత్వం హఠాత్తుగా రద్దు చేసింది. ఈ నిర్ణయం కారణంగా అక్కడి విద్యార్థుల్లో ఆందోళనకు గురవుతున్నారు.
వీసా రద్దయిన నేపథ్యంలో కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) యాప్‌లో నమోదుచేసుకుని స్వీయ బహిష్కరణ ద్వారా అమెరికాను వదిలివెళ్లాలని ఆయా విద్యార్థులకు ఈ–మెయిళ్లు, టెక్ట్స్ సందేశాలు పంపబడినట్లు సమాచారం. ఈ బహిష్కరణ సందేశాలను అందుకున్న వారిలో భారతీయ విద్యార్థులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయంతో అమెరికాలో విద్యనభ్యసిస్తున్న లక్షలాది భారతీయ విద్యార్థులు తమ భవిష్యత్ ఏమిటో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. గాజా యుద్ధంలో హమాస్‌కు, పాలస్తీనియన్లకు మద్దతు పలకడం, ఇజ్రాయెల్‌ను విమర్శించడం, యుద్ధం విషయంలో ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపడుతూ సంబంధిత సోషల్ మీడియా పోస్టులు చేయడం, అలాంటి పోస్టులను లైక్ చేయడం, షేర్ చేయడం వంటి చర్యలకు పాల్పడిన వారి వీసాలను రద్దు చేశామని యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ (డీఓఎస్) ప్రకటించింది. ఈ మేరకు ఎఫ్-1 వీసా రద్దు చేసినట్లు సంబంధిత విద్యార్థులకు ఈ–మెయిల్స్ పంపించామని వెల్లడించింది.
Also Read: సుంకాలపై అమెరికాను బుజ్జగిస్తున్న భారత్.. యుస్ వ్యవసాయ ఉత్పత్తులపై టారిఫ్లు తగ్గింపు
ఈమెయిల్‌లో ప్రభుత్వం ఇలా పేర్కొంది.. “అమెరికా శరణార్థి, జాతీయత చట్టంలోని సెక్షన్ 221(ఐ) ప్రకారం మీ ఎఫ్-1 వీసా గడువును తక్షణం ముగిస్తున్నాం. అమెరికాను వీడటానికి ముందు కచ్చితంగా అమెరికా ఎంబసీ/కాన్సులేట్‌లో మీ పాస్‌పోర్ట్‌ను చూపించండి. వాళ్లు మీ వీసాను స్వయంగా రద్దు చేస్తారు. ఆ తర్వాత సీబీపీ యాప్ సాయంతో స్వీయ బహిష్కరణ విధానాన్ని వాడుకుని అమెరికాను వీడండి. అలా వెళ్లకపోతే మేమే మిమ్మల్ని బలవంతంగా బహిష్కరిస్తాం. మేము పంపించిన తర్వాత మీ స్వదేశానికి పంపకపోవచ్చు. మా వెసలబాటును బట్టి మాకు అనువైన మరేదైనా దేశానికి తరలించే వీలుంది.”
2023–24 సంవత్సరానికి విదేశీ విద్యార్థులకు సంబంధించిన ‘ఓపెన్ డోర్స్’ నివేదిక ప్రకారం అమెరికాలో 11 లక్షల మంది విదేశీ విద్యార్థులు ఉన్నారు. వారిలో 3.31 లక్షల మంది భారతీయ విద్యార్థులే. ఈ నిర్ణయం ఈ విద్యార్థుల భవిష్యత్తుపై గంభీరమైన ప్రభావాన్ని చూపనుందని అంచనా వేయబడుతోంది.
ట్రంప్ ప్రభుత్వం పాలస్తీనా అనుకూలంగా నిరసనలు చేసిన విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంది. వీరిలో కొందరు ప్రముఖలు..
అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం పాలస్తీనా అనుకూలంగా నిరసనల్లో పాల్గొన్న వందలాది విద్యార్థుల వీసాలను రద్దు చేసింది. వీరిలో కొందరిని నిర్బంధించడం లేదా బలవంతంగా స్వదేశాలకు పంపించడం జరుగుతోంది. వారిలో
రుమేసా ఒజ్‌టుర్క్ (తుర్కీ) – హమాస్‌కు మద్దతుగా కార్యకలాపాల్లో పాల్గొన్నారనే ఆరోపణలపై బోస్టన్‌లో నిర్బంధం.
మహ్మూద్ ఖలీల్ (పాలస్తీనా) – ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్నందుకు గ్రీన్ కార్డ్ రద్దు.
యున్‌సియో చుంగ్ (దక్షిణ కొరియా) – పాలస్తీనా అనుకూల నిరసనల్లో పాల్గొనడం వల్ల బహిష్కరణకు గురి.
బాదర్ ఖాన్ సురి (భారత్) – హమాస్ సిద్ధాంతాలపై సోషల్ మీడియాలో పోస్టులు చేసిందని ఆరోపణ.
లెకా కొర్డియా (పాలస్తీనా) – వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అమెరికాలో ఉన్నందుకు బహిష్కరణ.
రంజనీ శ్రీనివాసన్ (భారత్) – హింసను ప్రోత్సహించిందని ఆరోపణలపై వీసా రద్దు.
అలిరెజా డొరౌడి (ఇరాన్) – జాతీయ భద్రతకు ప్రమాదమని ఆరోపణలపై నిర్బంధం.
డాక్టర్ రషా అలావీహ్ (లెబనాన్) – హెజ్‌బొల్లాకు మద్దతు ఇచ్చిందని ఆరోపణ.
మొమొడౌ తాల్ (యూకే/గాంబియా) – పాలస్తీనా అనుకూల నిరసనల్లో పాల్గొనడం వల్ల వీసా రద్దు.
ఇందులో కొందరు కోర్టులో సవాల్ చేయగా, మరికొందరిని బలవంతంగా స్వదేశాలకు పంపించారు.