Brazil Suspends ‘X’| ప్రముఖ బిలియనీర్ ఎలన్ మస్క్ కు చెందిన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘ఎక్స్’ (ట్విట్టర్) బ్రెజిల్ దేశం నిషేధించింది. శుక్రవారం ఆగస్టు 30న బ్రెజిల్ దేశ సుప్రీం కోర్టు.. నిబంధనలను ఉల్లంఘించిన్నందుకు సోషల్ మీడియా ‘ఎక్స్ ‘ పై నిషేధం విధిస్తూ తీర్పు వెలువరించింది.
గత కొన్ని వారాలుగా బ్రెజిల్ దేశ సుప్రీం కోర్టు న్యాయమూర్తి, ఇతర ప్రభుత్వాధికారులు.. ఎక్స్ మధ్య వివాదం ముదురుతూ వచ్చిన తరుణంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి అలెగ్జాండర్ డి మోరేస్ (Alexandre de Moraes) ఈ తీర్పును ఇవ్వడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బ్రెజిల్ లో భావ వ్యక్తికరణ (free speech), తప్పుడు సమాచారం(misinformation), అతివాద రాజకీయ పార్టీల సోషల్ మీడియా అకౌంట్ల నిర్వహణ (management of far-right accounts) అంశాలపై ఎక్స్, బ్రెజిల్ ప్రభుత్వం మధ్య రెండు నెలల క్రితం వివాదం తలెత్తింది. ఈ సమస్యను తేల్చుకోవడానికి ఇరు పక్షాలు న్యాయస్థానానికి చేరాయి.
అయితే ఎక్స్ కంపెనీ మహిళా లాయర్ ని సుప్రీం కోర్టు న్యాయమూర్తి అలెగ్జాండర్ బెదిరిస్తున్నాడని ఆమె ఈ కేసు నుంచి తప్పుకుంది. ఎక్స్ లాయర్ బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ చేశారని, ఆమెకు జైలు శిక్ష పడే అవకాశముందని స్థానిక మీడియా తెలిపింది. దీంతో ఎక్స్ తరుపున బ్రెజిల్ లో కేసు వాదించే లాయర్ కరువయ్యారు.
నిజానికి ట్విట్టర్ కంపెనీని ఎలన్ మస్క్ హస్తగతం చేసుకున్నప్పటి నుంచీ ఈ సమస్యలు మొదలయ్యాయి. బ్రెజిల్ లోని కొంతమంది యూజర్ల అకౌంట్లన బ్లాక్ చేయమని ప్రభుత్వం అడిగినా మస్క్ అంగీకరించకపోవడంతో మూల కారణం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న సామాజిక కార్యకర్తలు, అతివాద రాజకీయ పార్టీల ఎక్స్ అకౌంట్లను నిలిపివేయాలని బ్రెజిల్ ప్రభుత్వం చెప్పినా ఎక్స్ అందుకు అంగీకరించలేదు.
దీంతో ఎక్స్ పై దేశ ద్రోహం, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రోత్సహిస్తోందని ఆరోపణలతో సుప్రీం కోర్టులో కేసు విచారణ జరుగుతోంది. అయితే కేసు మధ్యలో నెల రోజుల క్రితం ఎక్స్ లాయర్ తప్పుకోవడంతో ఎక్స్ తరపున పోరాడేందుకు సమయానికి ఎక్స్ కు లాయర్ లభించలేదు. దీంతో సుప్రీం కోర్టు న్యాయమూర్తి రెండు రోజుల క్రితం ఎక్స్ 24 గంటల డెడ్ లైన్ విధించారు. ఎక్స్ తరపున కేసు వాదించేందుకు లాయర్ ని ఏర్పాటు చేసుకోవాలని. శుక్రవారం ఆ గడువు ముగిసిపోవడంతో ఎక్స్ కంపెనీ సుప్రీం కోర్టు లో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని కారణం చూపుతూ.. న్యాయమూర్తి అలెగ్జాండర్ ఎక్స్ కంపెనీ కార్యకలాపాలపై నిషేధం విధించారు.
”బ్రెజిల్ దేశ సార్వభౌమత్వం పట్లు, దేశ న్యాయపాలన పట్ల ఎలన్ మస్క్ చాలా అగౌరవంగా వ్యవహరించారు. ఆయన చట్టాలకు అతీతం కాదు. ఈ కోర్టు ఎక్స్ కంపెనీపై నిషేధం విధిస్తోంది. ఎవరైనా విపిఎన్ ఉపయోగించి దేశంలో ఎక్స్ లో పోస్ట్ చేస్తే.. వారికి ఒకరోజుకు 8900 డాలర్లు ఫైన్ విధించాలి. టెలికామ్ రెగులేటర్ 24 గంటలలోపు ఎక్స్ నిషేధాన్ని అమలు చేయాలి.” అని సుప్రీం కోర్టు న్యాయమూర్తి అలెగ్జాండర్ డి మోరేస్ తన తీర్పులో చెప్పారు. అయితే ఈ నిషేధం ఎంతకాలం ఉంటుందో.. తీర్పుపై తదుపరి రివ్యూ ఎప్పుడు చేపడతారు అనే విషయాలు తెలుపలేదు.
ఈ నిషేధంతో బ్రెజిల్ లోని 4 కోట్ల మంది యూజర్లకు ఇబ్బందులు తప్పువు. గతంలో కూడా వాట్సాప్, టెలిగ్రామ్ లాంటి ఇన్స్‌టెంట్ మెసేజింగ్ యాప్ లు కూడా నిషేధానికి గురయ్యాయి. సోషల్ మీడియాను బ్రెజిల్ ప్రభుత్వం కట్టడి చేస్తోందనే ఆరోపణలకు ఎక్స్ నిషేధంతో బలంచేకూరుతోంది.
Also Read: జియో సినిమా లో హాట్ స్టార్ విలీనం పూర్తి.. ఆమోదించిన సిసిఐ