Brazil BRICS Trump Tariff | బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సు ఈసారి బ్రెజిల్‌లోని రియో డి జనీరో నగరంలో జరుగనుంది. జులై 6, 7 తేదీల్లో ఈ సదస్సు నిర్వహించబడుతుందని బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరో వియేరా ప్రకటించారు. బ్రిక్స్ దేశాలలో అభివృద్ధి, పరస్పర సహకారం, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం కోసం ఈ సదస్సులో అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోబడతాయని ఆయన తెలిపారు.
గత సంవత్సరం అక్టోబర్‌లో రష్యాలోని కజాన్ నగరంలో ఈ సదస్సు జరిగింది. ఆ సమావేశానికి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో సహా అనేక దేశాల నాయకులు హాజరయ్యారు. ఆ సమావేశంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, మధ్యప్రాచ్య పరిస్థితులు, ఉగ్రవాదం వంటి అంశాలపై చర్చలు జరిగాయి. అలాగే.. భారత్ – చైనా మధ్య సరిహద్దు వివాదంపై కీలకమైన చర్యలు తీసుకోబడ్డాయి.
బ్రిక్స్ దేశాలు ఉమ్మడి కరెన్సీని రూపొందించడంపై దృష్టి పెట్టాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆ సదస్సులో సూచించారు. ప్రస్తుతం.. ఈ దేశాల కూటమి డిజిటల్ కరెన్సీని ఉపయోగించడంపై భారత్‌తో కలిసి రష్యా పని చేస్తోందని తెలిపారు. ఈ ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా పరిగణించారు. డాలర్‌కు ప్రత్యామ్నాయంగా మరో కరెన్సీని ఉపయోగిస్తే, ఆ దేశాలపై 100 శాతం సుంకాలు విధిస్తామని ట్రంప్ ఇటీవలే హెచ్చరించారు.
భారత ప్రధాని మోదీ ఇటీవల అమెరికా పర్యటన సమయంలో ట్రంప్ ఈ హెచ్చరికలు చేశారు. డాలర్‌తో ఆటలాడాలని ప్రయత్నిస్తే.. బ్రిక్స్ దేశాల కూటమిపై 100% టారిఫ్‌లు విధిస్తామని ట్రంప్ మళ్లీ పునరుద్ఘాటించారు. డాలర్‌ను వేరే కరెన్సీతో భర్తీ చేయాలని ప్రయత్నిస్తే.. బ్రిక్స్ దేశాలతో అమెరికా ఇకపై ఎలాంటి వాణిజ్య సంబంధాలు కూడా నిర్వహించదని స్పష్టం చేశారు.
Also Read: అమెరికా వీసా రూల్స్‌లో మార్పులు.. కఠినతరం చేసిన ట్రంప్ ప్రభుత్వం!
ప్రధాని నరేంద్ర మోదీతో భేటీకి రెండు గంటల ముందే ట్రంప్ ఈ విషయంలో సంచలన ప్రకటన చేశారు. తాను మొదటిసారి 100% టారిఫ్‌ల హెచ్చరికలు చేసినప్పుడే బ్రిక్స్ కూటమి మృతప్రాయంగా మారిపోయిందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ కూటమి ఏర్పాటులోనే దురుద్దేశాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. “బ్రిక్స్ కూటమి కొనసాగాలని దాని సభ్య దేశాలు కూడా కోరుకోవడం లేదు. బ్రిక్స్ గురించి మాట్లాడేందుకు కూడా భయపడుతున్నాయి” అని ట్రంప్ అన్నారు.
“డాలర్‌తో ఆటలాడాలని ప్రయత్నిస్తే, మీపై 100% టారిఫ్‌లు తప్పవు. అప్పుడు మీరే అలా చేయొద్దని వేడుకుంటారు” అని ట్రంప్ హెచ్చరించారు. బ్రిక్స్ కూటమిని రద్దు చేయాలనుకుంటున్నారా లేక దానిలో భాగం కావాలనుకుంటున్నారా అన్న విలేకరుల ప్రశ్నకు బదులుగా ట్రంప్ ఈ విధంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత అధ్యక్షులు జో బైడెన్, బరాక్ ఒబామా ఈ విషయంలో కఠినంగా వ్యవహరించలేకపోయారని ఆయన ఆక్షేపించారు.
2009లో ప్రారంభమైన బ్రిక్స్ కూటమిలో భారత్‌తో పాటు చైనా, బ్రెజిల్, రష్యా, దక్షిణ ఆఫ్రికా, సౌదీ అరేబియా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇరాన్ సభ్య దేశాలుగా ఉన్నాయి. ఈ సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. బ్రిక్స్ దేశాలు డాలర్‌కు బదులుగా తమ సొంత కరెన్సీలలో వాణిజ్య లావాదేవీలు చేయాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ 2023లో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ప్రతిపాదించారు. మరుసటి సంవత్సరం బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో కూడా ఇదే అంశం ప్రాముఖ్యం సంతరించుకుంది. ప్రపంచ వాణిజ్యం అమెరికా పెత్తనం తగ్గించాలనే బ్రిక్స్ దేశాలైన రష్యా, చైనా అడుగులు వేస్తున్నాయి. కానీ భారత్, చైనా దేశాల మధ్య సరిహద్దు వివాదాల కారణంగా బ్రిక్స్ కరెన్సీ నిర్ణయం వాయిదా పడుతూ వస్తోంది.