Big Stories

Challenges-Cop28 : సవాళ్ల నడుమ పర్యావరణ సదస్సు

Share this post with your friends

Challenges-Cop28 : క్లిష్ట పరిస్థితుల్లోకి భూగోళం జారిపోతున్న తరుణంలో మరోమారు పర్యావరణ సదస్సు జరగబోతోంది. ఈ నెల 30 నుంచి వచ్చే నెల 12 వరకు దుబాయ్‌లో భాగస్వామ్య పక్షాలు భేటీ కానున్నాయి. 1992 నాటి ఐక్యరాజ్యసమితి పర్యావరణ ఒప్పందం(UNFCCC)పై సంతకాలు చేసిన దేశాలను భాగస్వామ్యపక్షాలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకు 166 దేశాలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. కాప్-28 అనేది పర్యావరణంపై ఐక్యరాజ్యసమితి 28వ వార్షిక సమావేశం.
ఈ సదస్సు జరగనున్న తరుణంలోనే భూగోళం మునుపెన్నడూ లేనంతగా వేడిమిని చవిచూస్తోంది.

పారిశ్రామిక విప్లవం ముందు నాటి సగటు కంటే 1.5 డిగ్రీల సెల్సియస్‌కు మించి ఉష్ణోగ్రతలను(గ్లోబల్ వార్మింగ్) పెరగనివ్వరాదన్నది పారిస్ ఒప్పందం లక్ష్యం. ఆ ఒప్పందం నీరుగారేందుకు మరో ఆరేళ్ల దూరంలోనే ఉన్నాం. ఆలోగా గ్రీన్ హౌస్ వాయువుల కాలుష్యాన్ని నియంత్రించకుంటే కష్టాల ఊబిలోకి కూరుకున్నట్టే. 2015 నాటి పారిస్ ఒప్పందం నేపథ్యంలో నిర్దేశించుకున్న లక్ష్యాలకు ఎంత దూరంలో ఉన్నాం? ఏ ఏ సవాళ్లను ఎదుర్కోబోతున్నాం? అన్నది ఓ సారి సమీక్షించుకుంటే..

భూతాపం అంచుల్లో..

భూతాపం పెరగడానికి ప్రధాన కారణం మానవ కార్యలాపాలే. పారిశ్రామిక విప్లవం కారణంగా 19వ శతాబ్దం నుంచి బొగ్గు, చమురు, గ్యాస్ వంటి శిలాజ ఇంధనాల వాడకం బాగా పెరిగింది. ఫలితంగా కార్బన్-డై-ఆక్సైడ్ వాయువులు అధికమై భూగోళం వేడెక్కడం ఆరంభమైంది. అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో పర్యావరణ మార్పులు అనివార్యమయ్యాయి. 1970 తర్వాత భూతాపం పెరుగుతూ 1.3 డిగ్రీల సెల్సియస్‌కు చేరింది. 2 వేల సంవత్సరాల ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే.. గత 50 ఏళ్లలోనే అత్యధికంగా పెరిగాయి.ఈ లెక్కన మరో ఆరేళ్లలోనే 1.5 డిగ్రీల లక్ష్మణరేఖను దాటేస్తామనే ఆందోళన వ్యక్తమవుతోంది. అంటే మనం ఇప్పటికే మృత్యు అంచులకు చేరుకున్నట్టే.

విపత్తులతో ఎంతో నష్టం

భూఉష్ణోగ్రతల పెరుగుదలతో పర్యావరణ మార్పులు జరిగి.. చివరకు ప్రకృతి విపత్తులకు దారితీస్తోంది. తుఫాన్లు, కార్చిచ్చులు, కరువులు వీటిలో భాగమే. గత ఐదు దశాబ్దాల కాలంలో 12 వేల విపత్తులు మానవాళిని కబళించాయి. దాదాపు 4.3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక నష్టం సంభవించింది. 20 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మరణాల్లో 90 శాతం వర్ధమాన దేశాల్లోనే నమోదయ్యాయి. సంపన్న దేశాలతో పోలిస్తే అభివృద్ధి చెందుతున్న దేశాలు వెలువరుస్తున్న గ్రీన్‌హౌస్ వాయువులు చాలా తక్కువ. అయినా పర్యావరణ మార్పుల ప్రభావాన్ని వర్ధమాన దేశాలు ఎక్కువగా చవిచూస్తున్నాయి.

సముద్రనీటిమట్టాలు పైపైకి..

భూతాపం వల్ల మంచుఫలకాలు కరిగిపోయి.. సముద్ర నీటిమట్టాలు పెరుగుతున్నాయి. అంతే కాదు.. జలాలు వేడెక్కి వ్యాకోచించడం కూడా సముద్ర మట్టాల పెరుగుదలకు ఓ కారణమే. ఏటా 4.4 మిల్లీమీటర్ల మేర ఇవి సముద్రమట్టం పెరుగుతోంది. చూసేందుకు ఇవి చిన్న అంకెల్లా కనిపిస్తాయి కానీ.. చేసే చేటు అంతా ఇంతా కాదు. ఏటా 1.2 ట్రిలియన్ టన్నుల మేర మంచు కరిగిపోతోంది. 1990 తర్వాత 57 శాతం గ్లేసియర్లు మాయమయ్యాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఈ శతాబ్దం చివరి నాటికి సముద్రమట్టాలు 3 అడుగుల మేర పెరుగుతాయని అంచనా. ఫలితంగా తీర ప్రాంతాలు, చిన్నచిన్న దీవులు మునిగిపోవడం ఖాయం.

కర్బన ఉద్గారాల కట్టడే మార్గం

భూతాపాన్ని 1.5 డిగ్రీల సెల్సియస్‌కు మించకుండా చూడాలంటే కర్బన ఉద్గారాలను కట్టడి చేయడమొక్కటే తక్షణ కర్తవ్యం. 2030 నాటికి గ్రీన్ హౌస్ వాయువులను 43 మేరకు, 2035 నాటికి 60 శాతం మేర తగ్గించగలిగితేనే ఫలితం ఉంటుంది. దాంతో 2050 నాటికి నెట్ జీరో సాధించే అవకాశాలు ఉంటాయి.భూతాపాన్ని 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయడానికి 50% మాత్రమే చాన్స్ ఉన్నట్టు ఐక్యరాజ్యసమితి నివేదించింది.

ఇంధన సబ్సిడీలు ఇంతింతై..

బొగ్గు, చమురు, గ్యాస్ వంటి శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించాలన్న లక్ష్యం మాటలకే పరిమితమైంది. నానాటికీ పెరుగుతున్న ఇంధన సబ్సిడీలే దీనికి నిదర్శనం. నిరుడు శిలాజ ఇంధనాలపై సబ్సిడీల కోసం వెచ్చించిన మొత్తం రికార్డు స్థాయిలో 7 ట్రిలియన్ డాలర్లకు చేరింది. 2020తో పోలిస్తే ఇది 2 ట్రిలియన్ డాలర్లు అధికం. మరోవైపు పలు దేశాలు ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులను శిలాజ ఇంధనాల ఉత్పత్తికి మరలిస్తున్నాయి. 2030 నాటికి ఆ ఉత్పత్తిని రెట్టింపు చేసే యోచనలో ప్రభుత్వాలు ఉన్నాయి.

పచ్చదనం కనుమరుగు

కాప్-26 సందర్భంగా అడవుల నరికివేతకు 2030 కల్లా ఫుల్‌స్టాప్ పెట్టాలని నిర్ణయించారు. భూఅటవీ విస్తీర్ణంలో 90 శాతం కలిగిన 145 దేశాలు గ్లాస్గో ఫారెస్ట్ డిక్లరేషన్‌పై సంతకాలు చేశాయి. అయితే ఆ లక్ష్యానికి ఇంకా సుదూరంలోనే ఉన్నాం. నిరుడు 66 వేల చదరపు కిలోమీటర్ల మేర పచ్చదనం కనుమరుగైంది. వెస్ట్ వర్జీనియా లేదా లిథువేనియా విస్తీర్ణానికి సమానమైన అడవులను కోల్పాయామన్నమాట. అడవుల నరికివేతతో పెద్ద ఎత్తున కార్బన్-డై-ఆక్సైడ్ వాతావరణంలోకి చేరుతోంది. చెట్లను కాపాడగలిగితే ఆ వాయువులను పీల్చుకుని.. ఆక్సిజన్‌ను విడుదల చేసేవి. కానీ అడవుల నరికివేతతో 2000 సంవత్సరం తర్వాత కర్బన ఉద్గారాల కష్టాలు రెట్టింపు అయినట్టు అంచనా.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Latest News