Earthquake In Bangkok: ఆకాశం విరిగి మీద పడితే..! ఉన్నట్టుండి కాళ్లకింద భూమి కంపిస్తే..! భవనాలు గాల్లో ఊగితే..! ఊహించుకోడానికే భయంగా ఉంది కదా..! మయన్మార్, థాయ్‌లాండ్‌లో ఇలాంటి అనుభవమే ఎదురైంది. భారీ భూకంపాలతో రెండు దేశాలు చిగురుటాకుల వణికిపోయాయి. ప్రాణభయంతో జనం పరుగులు తీశారు. ఇళ్లు, వాకిలి వదిలేసి, పరుగులందుకున్నారు. ఎటు వెళ్లాలో తెలియదు. ఎక్కడ తలదాచుకోవాలో అర్థం కాలేదు. కళ్ల ముందు కూలిపోతున్న భవనాలను దాటుకుంటూ.. ణాలను అరచేతిలో పెట్టుకొని భయంతో పరుగులు తీశారు.
ముందుగా మయన్మార్‌లో భారీ భూకంపం వచ్చింది. ఆ షాక్ నుంచి తేరుకోక ముందే మరోసారి భూమి కంపించింది. మొదటిది రిక్టార్ స్కేలుపై 7.7 గా నమోదు కాగా, రెండో భూకంపం 6.8 తీవ్రత రికార్డయ్యింది. పక్కనే ఉన్న థాయ్‌లాండ్‌కు సైతం ఈ ప్రకంపణలు వ్యాపించాయి. జస్ట్ 12 నిమిషాల వ్యవధిలో ఈ రెండు భూకంపాలు వచ్చాయి.
థాయ్‌లాండ్ కంటే మయన్మార్‌లో భూకంప తీవ్రత ఎక్కువగా ఉంది. స్కై స్క్రాపర్స్ పేకమేడల్లా కుప్పకూలాయి. అందరు చూస్తుండగానే నేలకూలాయి. ఎయిర్‌పోర్టు కూడా దెబ్బతిన్నది. దాంతో విమాన సర్వీసులపై ఎఫెక్ట్ పడింది. బ్రిడ్జీలు సైతం పడిపోయాయి. వందల సంఖ్యలో ఇళ్లు, ఆఫీసులు ధ్వంసమయ్యాయి. ఎక్కడివారు అక్కడే చిక్కుకుపోయారు.
కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. జనజీవనం మొత్తం స్తంభించిపోయింది. వందలాది మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్స్.. సహాయక చర్యలు చేపట్టాయి. యుద్ధప్రతిపాదికన రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. గాయపడ్డవారిని స్థానిక ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఇప్పటికే మయన్మార్ ప్రభుత్వం.. ఎమర్జెన్సీ విధించింది.
భూకంపం తీవ్రతకు మయన్మార్ రాజధాని నేపిడాలో వెయ్యి పడకల ఆసుపత్రి కుప్పకూలింది. మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అత్యధికంగా క్షతగాత్రులు ఇక్కడే ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దింతో.. ఈ ప్రాంతంలో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. మరోవైపు థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో నిర్మాణంలో ఉన్న ఎత్తైన భవనం పేకమేడలా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. 90మంది గల్లంతైనట్లు ఆ దేశ రక్షణ మంత్రి తెలిపారు.
భూకంపంతో థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనం కూలిన ఘటనలో సుమారు 90మంది గలంతయ్యారు. ఇప్పటి వరకు ముగ్గురు మృతి చెందినట్టు అధికారికంగా ప్రకటించారు. రెస్క్యూ టీం ఏడుగురికి ప్రాణాలతో కాపాడింది. కళ్ల ముందే పేకమేడలా కూలిన భవనం ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరో చోట భారీ భవంతిపైన ఉన్న స్విమ్మింగ్ పూల్ నుంచి నీరు కిందకు జారింది. ఈ దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. థాయ్ లాండ్ ప్రధానమంత్రి షినవత్ర దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు.
Also Read: మయన్మార్, బ్యాంకాక్ లో భారీ భూకంపం, 15 మంది మృతి, వందల మందికి గాయాలు
భూకంపం ధాటికి పలు భవనాలు ఊగిపోయాయి. కొన్ని భవనాలు నేలమట్టం అయ్యాయి. వాటిలో ఎంతమంది చనిపోయారన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. బ్యాంకాక్‌లో ఏ వీధి చూసినా కూలిన భవంతుల శిథిలాలే కనిపిస్తున్నాయి. భవనాల కింద చిక్కుకుపోయిన వారి కోసం బంధువులు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. తమ వారిని కాపాడాలని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
భూకంపం తర్వాత ఎవరూ ఇళ్లలో ఉండటానికి ధైర్యం చాలక రోడ్లపై మీదే పడిగాపులు కాస్తున్నారు. చిన్నారులు ఆకలితో అలమటిస్తున్నారు. వృద్ధులు, మహిళలు అంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భూకంప బాధితులతో అటు ఆస్పత్రులు నిండిపోయాయి.