China Tariff Trump | అగ్రరాజ్యం అమెరికా ప్రపంచంలో వాణిజ్య యుద్ధం మొదలుపెట్టింది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. చైనాపై విధించే సుంకాలను 10 శాతం నుంచి 20 శాతానికి పెంచుతూ ప్రకటించారు. ఈ నిర్ణయానికి ప్రతిస్పందనగా, చైనా కూడా వేగంగా ప్రతీకార చర్యలు తీసుకుంది. అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై సుంకాలను 10 నుంచి 15 శాతానికి పెంచుతూ వెంటనే ప్రకటించేసింది.
చైనా తీసుకున్న ఈ నిర్ణయం, సుమారు 25 సంస్థలపై ప్రభావం చూపనుంది. అమెరికా నుంచి దిగుమతి అయ్యే వ్యవసాయం, ఆహార ఉత్పత్తులకు సంబంధించిన వస్తువులపై చైనా సుంకాలను పెంచింది. ఈ సుంకాలు మార్చి 10 నుంచి అమల్లోకి రానున్నాయని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రకటించింది.
Also Read: రష్యాకు ట్రంప్ రహస్య గూఢచారి – కేజీబీ మాజీ ఛీప్ ఇంకా ఏం చెప్పారంటే.?
అమెరికా నుంచి దిగుమతి అయ్యే చికెన్, గోధుమ, మొక్కజొన్న, పత్తిపై అదనంగా 15 శాతం సుంకాన్ని విధించనున్నట్లు చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే.. జొన్న, పంది మాంసం, సోయాబీన్స్, గొడ్డు మాంసం, జల ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు, పాల దిగుమతులపై అదనంగా 10 శాతం సుంకాన్ని విధించనున్నట్లు ప్రకటనలో పేర్కొంది. ఈ ప్రకటనలో.. చైనా తన చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాలను దృఢంగా కాపాడుకోవడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.
చైనాపై ట్రంప్ సుంకాలు
చైనా ఉత్పత్తులపై ఇప్పటికే ఉన్న 10 శాతం సుంకాన్ని 20 శాతానికి పెంచుతూ, ట్రంప్ ఈ నిర్ణయానికి సంబంధించిన ఉత్తర్వులపై సంతకం చేశారు. అక్రమ వలసలు, ఫెంటనిల్ లాంటి మాదకద్రవ్యాల అక్రమ రవాణాను ఆపడంలో చైనా విఫలమైందని ఆరోపిస్తూ.. ఈ సమస్యలను నిర్మూలించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు.
అమెరికా విధించిన ఈ సుంకాలు.. స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, వీడియోగేమ్ కన్సోల్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, స్పీకర్లు మరియు బ్లూటూత్ పరికరాల వంటి ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై వర్తిస్తాయి. చైనా కూడా అమెరికా దిగుమతులపై సుంకాలు ప్రకటించడంతో.. ఇప్పుడు ట్రంప్ ఈ విషయంలో వెనుకడుగు వేస్తారా లేక సుంకాల విషయంలో తగ్గేదేలే అన్నట్లు ముందుకు సాగుతారా అనేది చూడాల్సిన అంశంగా మిగిలింది.
మరోవైపు కెనడా, మెక్సికో దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 25 శాతం సుంకాల విధానంలో ఎలాంటి మార్పు లేదని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ సుంకాలు మార్చి 4 నుంచి అమల్లోకి వస్తాయని ఆయన తెలిపారు. దీనికి ప్రతిస్పందనగా.. కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో కూడా అమెరికా ఉత్పత్తులపై సుంకాలు విధించారు. అమెరికా నుంచి దిగుమతి అయ్యే ఆల్కహాల్, పండ్లు సహా 107 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ట్రూడో ప్రకటించారు. ఈ సుంకాలు కూడా మంగళవారం నుంచే అమల్లోకి వచ్చాయి. ట్రంప్ సుంకాల దెబ్బకు అమెరికా మార్కెట్లు కుదేలయ్యాయి. ఈ ప్రభావం ఆసియా-పసిఫిక్, ఆస్ట్రేలియా మార్కెట్లపైనా పడింది.
అమెరికాను దెబ్బకొట్టేందుకు యురోప్ యూనియన్‌తో చైనా దోస్తీ
ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే విషయంలో అమెరికా మరియు యురోప్ యూనియన్ (EU) దేశాల మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఈ పరిస్థితిని అదునుగా భావించిన చైనా, యురోప్ యూనియన్‌తో తన సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. అమెరికా తీసుకుంటున్న ఏకపక్ష విధానాలకు వ్యతిరేకంగా యురోప్ యూనియన్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని చైనా పార్లమెంటు (NPC) ప్రతినిధి లౌ కిన్‌జియాన్ మంగళవారం పేర్కొన్నారు.
“గత 50 ఏళ్లుగా చైనా మరియు యురోప్ మధ్య ఎటువంటి ఘర్షణలు లేవు. ఇరు వర్గాలు అనేక అంశాల్లో భాగస్వాములుగా కొనసాగుతున్నాయి. చైనా ఉత్పత్తులకు మరియు ఇక్కడ రూపొందించే AI-అనుకూల ఇ-వాహనాల బ్యాటరీలకు యురోప్ దేశాలు లాభదాయకమైన మార్కెట్‌గా ఉన్నాయి. కాబట్టి ఆ దేశాలతో సంబంధాలు మరింత పెంచుకోవడానికి ఆసక్తితో ఉన్నాం” అని లౌ కిన్‌జియాన్ పేర్కొన్నారు. చైనా-యురోప్ సంబంధాలు ఏ మూడో పక్షాన్ని లక్ష్యంగా చేసుకోవని, వాటిపై ఆధారపడి ఉండవని పరోక్షంగా అమెరికా, యురోప్ దేశాల సంబంధాలను ఉద్దేశించి అన్నారు.
ఇటీవల.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మధ్య మీడియా ఎదుటే తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలను చైనా ప్రభుత్వం ఆధ్వర్యంలోని మీడియా సంస్థలు విపరీతంగా ప్రసారం చేశాయి. ఉక్రెయిన్ యుద్ధం ముగింపు విషయంలో ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య సాన్నిహిత్యం పెరుగుతోందని, దీనిపై చైనా ఆందోళన చెందుతోందని అంతర్జాతీయ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. అందుకే అమెరికాతో జరుపుతున్న చర్చల గురించి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు వివరించడానికి రష్యా ప్రెసిడెంట్ పుతిన్ తన ఉన్నత భద్రతా అధికారి సెర్గీ షోయిగును బీజింగ్‌కు పంపినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో యురోప్ యూనియన్‌తో చైనా సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది.