Chinese Govt : అత్యధిక జనాభా కలిగి ఉన్న దేశాలేవి అంటే ఠక్కున గుర్తువచ్చేవి.. చైనా, భారత్. ఈ రెండు ఆసియా దేశాల్లోని జనాభా దాదాపు 34%. అయితే.. చైనా చాన్నాళ్లుగా జనాభా నియంత్రణ పద్ధతుల్ని కఠినంగా అమలు చేసింది. ఫలితంగా.. భారత్ అత్యధిక జనాభా కలిగిన దేశంగా మారగా, చైనా రెండో స్థానానికి చేరింది. కానీ.. ఇప్పుడు చైనాలో పరిస్థితులు మారిపోయాయి. ఇన్నాళ్లు పిల్లల్ని కనడాన్ని నిరోధించిన అక్కడి ప్రభుత్వం.. ఇప్పుడు రాయితీలు ఇచ్చి మరీ పిల్లల్ని కనాలంటూ ప్రోత్సహిస్తోంది. ఎక్కువ మంది పిల్లల్ని కనండి అంటూ ప్రజలకు విన్నవిస్తోంది. దేశ జనాభాలో అసమతౌల్యం కారణంగా.. దేశ ఆర్థికాభివృద్ధిపై ప్రభావం పడుతుందని భయపడుతున్న డ్రాగన్.. పిల్లల్ని కనాలంటూ యువ దంపతులకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహిస్తోంది.
ఓ నివేదిక ప్రకారం.. చైనాలోని అతిపెద్ద నగరమైన షాంఘైలో 2023 నాటికి సంతానోత్పత్తి రేటు దారుణంగా 0.6 శాతానికి పడిపోయింది. మొత్తంగా చైనాలో సంతానోత్పత్తి రేటు 2022 నాటికి 1.09 % శాతానికే పరిమితమవ్వడం అక్కడి అధికారులకు ఆందోళన కలిగిస్తోంది. వాస్తవానికి చైనా ప్రస్తుత జనాభా నిష్పత్తి అలానే కొనసాగాలి అంటే సంతానోత్పత్తి రేటు 2.1 శాతంగా ఉండాలి. సంతానోత్పత్తి రేటు అంటే ఓ మహిళ తన జీవితకాలంలో కనే బిడ్డల సంఖ్య. క్రమంగా ఈ రేటు చైనాలో దారుణంగా పడిపోతుండడంతో అక్కడి ప్రభుత్వం కంగారు పడిపోతోంది. “అయితే ఒకరు.. లేదంటే అసలు వద్దు” అంటూ జనాభా నియంత్రణకు కఠినంగా అమలు చేసిన ప్రభుత్వం.. కాదని ఎక్కువ మంది పిల్లల్ని కనే వారిపై జరిమానాలు విధించింది. ప్రభుత్వాలు అందించే రాయితీలు, ఇతర సౌకర్యాల్లో కోత విధించడంతో పాటు అధిక పన్నులు విధించి ప్రజల్ని నిరోధించింది. క్రమంగా ఈ విధానం అక్కడి జననాల రేటు, సంతానోత్పత్తి రేటుపై ప్రభావం చూపింది.
చైనా విధానాలతో అక్కడి జనాభా నిష్పత్తిలో దారుణమైన వ్యత్యాసాలు వచ్చాయి. క్రమంగా వృద్ధుల సంఖ్య పెరిగిపోతుండడం, యువత జనాభా నిష్పత్తి తగ్గిపోయింది. యువత సంఖ్య జనాభాలో భారీగా తగ్గిపోవడంతో.. అక్కడి కార్మిక శక్తిపై ప్రభావం పడింది. ఫలితంగా పారిశ్రామిక, ఆర్థిక రంగాల పై వ్యతిరేక ప్రభావం పడింది. సాధారణంగా.. తల్లిదండ్రులు ఇద్దరికీ, ఇద్దరు సంతానం ఉంటే మరణాల రేటు, జననాల రేటు సమపాళ్లల్లో ఉన్నట్లు చెబుతుంటారు. కానీ.. చైనాలో ఇద్దరికి, ఒకరే సంతానం ఉండడంతో తరాలు గడుస్తున్న కొద్ది వృధ్దుల సంఖ్య పెరిగిపోతూ, యువత సంఖ్య తగ్గిపోయింది.
జనాభా నిష్పత్తిలో మార్పులతో ఆందోళన చెందిన అక్కడి ప్రభుత్వం.. ఇన్నాళ్లు అనుసరిచిన విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తోంది. ఇదే యంత్రాంగం 2020 వరకు జనాభాను కంట్రోల్ చేసేందుకు ప్రణాళికలు రూపొందించి అమలు చేయగా, ఇప్పుడు అదే యంత్రాంగం జనాభాను పెంచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు క్షేత్ర స్థాయిలోకి వెళ్లి గర్భిణీ స్త్రీ, కొత్తగా పెళ్లైన వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. చైనా అధికారిక మీడియా కథనాల ప్రకారం.. స్థానిక అధికారులు, వైద్య సిబ్బంది క్షేత్ర స్థాయిలోకి చేరుకుని ఎక్కువ మంది పిల్లల్ని కనేలా అవగాహన కల్పిస్తున్నారు. కొత్తగా పెళ్లైన, మొదటిసారి గర్భం ధరించిన స్త్రీలకు ప్రత్యేక కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఉత్తమ దాంపత్య జీవితానికి కావాల్సిన సలహాలు, సూచనలు అందిస్తున్నారు. ఏ సమయంలో భార్యాభర్తలు కలిస్తే మంచిదో వివరిస్తూ, పిల్లల్ని కనేందుకు ఉత్తమ పద్దతుల్ని తెలియజేస్తున్నారు. ఒకే బిడ్డతో ఆగిపోకుండా ఎక్కువ మందిని కనేలా వారిని మానసికంగా సిద్ధం చేస్తున్నాట్లు అక్కడి మీడియా తెలిపింది.
Also Read : అమెరికా వైట్ హౌస్‌లో దీపావళి వేడుకలు.. ఇండియన్స్‌కు బైడెన్ దావత్
అయితే ఈ ప్రయత్నాలపై అక్కడి మహిళల్లో మిశ్రమ స్పందనలు వినిపిస్తున్నాయి. కొందరేమో.. ఇద్దరు, అంతకంటే ఎక్కువ మంది పిల్లల్ని కనాలి అంటే ఎదురయ్యే ఆర్థిక కష్టాల గురించి చింతిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు ఒకే సంతానానికి అలవాటు పడిన సమాజం, ఇప్పుడు ఇద్దరు, ఎక్కువ మందిని ఎలా పోషించాలి అనే ఆలోచనలో పడినట్లు అక్కడి పరిస్థితులు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఇదే సమయంలో గతంలో ప్రభుత్వం ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నారన్న కారణంగా విధించిన జరిమానాలను తిరిగి తమకు ఇచ్చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తాము అప్పుడు చేసిన పనే.. ఇప్పుడు ప్రభుత్వం చేయాలని సూచిస్తున్న కారణంగా తాము కట్టిన డబ్బుల్ని తిరిగి ఇవ్వాలంటున్నారు. గతంలో ప్రభుత్వం ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలున్న ఒక్కో కుటుంబంపై రూ.38 లక్షల జరిమానా విధించింది.