Mark Zuckerberg Death Penalty | మెటా సీఈఓ మార్క్ జకర్‌బర్గ్ (Mark Zuckerberg) తనకు మరణశిక్ష విధించాలని ఒక దేశంలో కోర్టు కేసు విచారణ జరుగుతోందని ఆందోళనకర వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌లో తనకు మరణశిక్ష విధించాలని కోరుతూ ఎవరో దావా వేసిన విషయాన్ని వెల్లడించారు. ఈ దావాకు కారణం.. ఫేస్‌బుక్‌లో ఎవరో దేవుడిని అవమానించే చిత్రాలను పోస్ట్ చేయడమే. ఇటీవల జో రోగన్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న సందర్భంగా జకర్‌బర్గ్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. “వివిధ దేశాల్లో మనం అంగీకరించని చట్టాలు ఉన్నాయి. పాకిస్తాన్‌లో నాకు మరణశిక్ష విధించాలని ఎవరో దావా వేశారు. ఇది ఎక్కడికి వెళ్తుందో తెలియదు. కానీ నేను ఆ దేశానికి వెళ్లాలనుకోవడం లేదు కాబట్టి ప్రస్తుతానికి ఆందోళన చెందనవసరం లేదు” అని అన్నారు.
“భావ ప్రకటన స్వేచ్ఛతో పాటు, వివిధ దేశాలలో వారి సాంస్కృతిక విలువలు, నిబంధనలు ఉన్నాయి. దీని వల్ల మా యాప్‌లోని కంటెంట్‌ను అణచివేయాల్సి వస్తోంది. కొన్ని దేశాల ప్రభుత్వాలు మమ్మల్ని జైలులో పెట్టేంత శక్తివంతమైన నిబంధనలు రూపొందించాయి. విదేశాలలో ఉన్న అమెరికన్ టెక్ కంపెనీలను రక్షించడంలో అమెరికా ప్రభుత్వం సహాయం చేయాలని నేను కోరుతున్నాను.” అని జుకర్ బర్గ్ ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read: ట్రంప్ బాటలో యుకె.. బ్రిటన్‌లో భారతీయ రెస్టారెంట్లపై దాడులు.. టార్గెట్ వారే!
పాకిస్తాన్ ప్రభుత్వం.. గత సంవత్సరం ప్రారంభంలో, జాతీయ భద్రతా కారణాలతో ఫేస్‌బుక్, ఎక్స్ (ట్విటర్), ఇతర సామాజిక మాధ్యమాలపై తాత్కాలిక నిషేధం విధించింది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వంటి ఉగ్రవాద సంస్థలు తమ దేశ వ్యతిరేక కార్యకలాపాలను వ్యాప్తి చేయడానికి ఈ సోషల్ మీడియా మాధ్యమాలను ఉపయోగిస్తున్నట్లు పాకిస్తాన్ ఆరోపించింది. అయితే ఈ నిషేధం కొంతకాలం తరువాత తొలగిస్తూ.. పాక్ ప్రభుత్వం ప్రకటించింది.
పాకిస్తాన్ లో మస్క్‌కూ సమస్యలు
ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్‌ఎక్స్‌కు చెందిన శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవ స్టార్‌లింక్, పాకిస్తాన్‌లో తన సేవలను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తోంది. కానీ, ఇటీవల మస్క్ పాకిస్తాన్‌పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని పాకిస్తాన్ డిమాండ్ చేస్తోంది. మస్క్, బ్రిటన్‌లోని “గ్రూమింగ్ గ్యాంగ్స్” అనే లైంగిక వేధింపుల గ్యాంగ్‌లకు పాకిస్థానీ మూలాలు ఉన్నాయని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను పాకిస్తాన్ చట్టసభ్యులు ఖండించారు మరియు మస్క్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
గ్రూమింగ్ గ్యాంగ్స్ అనేది బ్రిటన్‌లో పిల్లలు మరియు యువతను లక్ష్యంగా చేసుకుని లైంగిక వేధింపులు చేసే సమూహాలు. ఈ గ్యాంగ్స్‌లో పాకిస్థానీ మూలాలు ఉన్న వ్యక్తులు ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి. మస్క్ ఈ అంశంపై వ్యాఖ్యానించడం పాకిస్తాన్‌కు ఆగ్రహాన్ని రేకెత్తించింది. స్టార్‌లింక్ పాకిస్తాన్‌లో తన సేవలను ప్రారంభించడానికి అనుమతి కోసం దరఖాస్తు చేసినప్పటికీ, ఈ వివాదం వారి ప్రవేశానికి అడ్డంకిగా మారింది.
పాకిస్తాన్ అధికారులు మస్క్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు, అయితే ఇది అనుమతికి ముందస్తు షరతు కాదని వారు స్పష్టం చేశారు. ఈ వివాదం స్టార్‌లింక్ యొక్క పాకిస్తాన్ ప్రవేశాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలి.