BigTV English

Caribbean Islands : మాయగాళ్ల మహా స్వర్గం.. కరీబియన్‌

Caribbean Islands : మాయగాళ్ల మహా స్వర్గం.. కరీబియన్‌
Caribbean Islands

Caribbean Islands : ప్రపంచంలో ఎక్కడ ఆర్థిక నేరాలు జరిగినా.. ఆ నేరగాళ్లు చట్టం బారిన పడకుండా తప్పించుకునేందుకు కరీబియన్ దీవులు స్వర్గధామంగా మారాయి. ఐపీఎల్‌ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న లలిత్‌ మోదీ అక్కడికే చేరగా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును రూ.13,500 కోట్ల మేర మోసం చేసిన కేసులో నిందితుడైన మెహుల్‌ ఛోక్సీ అక్కడికి వెళ్లే క్రమంలోనే పట్టుబడ్డాడు. ఇంతకీ ఆ ద్వీపాల ప్రత్యేకత ఏంటి? ఆర్థిక నేరగాళ్లకు పూలపాన్పులా ఆ దీవులు ఎందుకు తయారయ్యాయో తెలుసుకుందాం.


కరీబియన్‌ దీవుల్లో ఆంటిగ్వా, బార్బడోస్‌, డొమినికా, గ్రెనడా, సెయింట్‌ కిట్స్‌, సెయింట్‌ లూసియా తదితర చిన్న చిన్న దేశాలున్నాయి. ద్వితీయ పౌరసత్వం కావాలకున్న విదేశీయులకు ఈ దేశాలు ఎర్ర తివాచీ పరిచి మరీ స్వాగతం పలుకుతున్నాయి. ఆ దేశాల్లో కొంత మొత్తంలో పెట్టుబడి పెడితే చాలు.. ఎవరికైనా అక్కడి పౌరసత్వం లభిస్తుంది. ఒకసారి అక్కడి పౌరసత్వం వచ్చాక.. ఇంగ్లాండ్‌, యూరోపియన్‌ యూనియన్‌ దేశాలతో సహా.. సుమారు 140 దేశాల్లో ఎలాంటి వీసా లేకుండానే ప్రయాణించే వెసలుబాటునూ ఆ దేశాలు కల్పిస్తున్నాయి. దీంతో భారత్‌తో సహా పలు దేశాల్లో ఆర్థిక నేరాలకు పాల్పడిన నేరగాళ్లంతా కొంత మొత్తంలో అక్కడ పెట్టుబడులు పెట్టి ఆ దేశ పౌరసత్వం పొందుతున్నారు. ఈ నేరగాళ్లు ముందుస్తు వ్యూహంతో, నేరం బయట పడకముందే పెట్టేబేడా సర్దుకుని అక్కడికి ఎగిరిపోతున్నారు. వారికి అక్కడ లభిస్తున్న స్థానిక పౌరసత్వం ఉన్న కారణంగా వారికి రాజ్యాంగ పరమైన రక్షణ ఉంటుంది. భారతదేశ చట్టాలు అక్కడ పని చేయకపోవడం వల్ల వారిని పట్టుకోవడం అధికారులకు పెద్ద తలనొప్పి వ్యవహారంగా మారుతోంది.

కరీబియన్‌ దేశాలు అనుసరిస్తున్న పెట్టుబడులకు పౌరసత్వం విధానం కింద 2014 నుంచి ఇప్పటి వరకు 30 మంది భారతీయులు ఆంటిగ్వా పౌరసత్వం పొందేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. అందులో 2017, జనవరి 1 నుంచి జూన్‌ 30 మధ్య కాలంలో 2 లక్షల అమెరికన్ డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన ఏడుగురికి పౌరసత్వం ఇచ్చినట్లు ఆంటిగ్వా ప్రకటించింది. ఈ పౌరసత్వ వ్యవహార పర్యవేక్షణకు ఆ దేశం ఒక మంత్రిత్వశాఖనే నిర్వహిస్తోంది. ఆంటిగ్వా జులై 2013లో ప్రారంభించిన ‘పెట్టుబడులకు పౌరసత్వం’ పథకానికి డిసెంబర్‌ 31, 2019 వరకు వివిధ దేశాలకు చెందిన 2,240 దరఖాస్తులు వచ్చాయి. వీరిలో అనేకమందికి ఆ దేశం పౌరసత్వం ఇచ్చింది.


కరీబియన్‌ దీవుల్లోని మరో దేశమైన సెయింట్‌ కిట్స్‌ 1983లో ఇంగ్లాండ్ నుంచి స్వాతంత్యం పొందింది. ఇది 1984లోనే ఈ పెయిడ్‌ సిటిజన్‌షిప్‌‌ను తీసుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 26 దేశాల్లో వీసాలు లేకుండా ప్రయాణించే వెసులు బాటు కూడా లభించటంతో పలువురు వాణిజ్యవేత్తలు పెట్టుబడులు పెట్టి అక్కడి పౌరసత్వం తీసుకున్నారు. పౌరసత్వం మాత్రమే కాకుండా ఇక్కడ పెట్టుబడులు పెట్టేవారికి ప్రత్యక్ష పన్ను, మూలధన లాభాలపై పన్ను, డివిడెండ్లపై పన్ను లేకపోవడంతో చాలామంది ఇక్కడ పెట్టుబడులకు ముందుకొచ్చారు.

కరీబియన్‌ దేశాల్లోని డొమినికా, సెయింట్‌ లూసియా పౌరసత్వం కావాలనుకుంటే.. ఓ వ్యక్తి లక్ష డాలర్లు పెట్టుబడి పెడితే చాలు. ఆ వ్యక్తితోపాటు భార్యకు కూడా పౌరసత్వం కావాలంటే సెయింట్‌ లూసియాలో 1.65 లక్షల డాలర్లు, డొమినికాలో అయితే 1.75 లక్షల డాలర్లు పెట్టుబడి పెట్టాలి.

ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా.. చైనాలో వ్యాపారం చేయాలనుకుంటే నేరుగా చైనా పౌరసత్వం అవసరం లేదు. ముందుగా 2 లక్షల డాలర్లు పెట్టుబడి పెట్టి కరీబియన్‌ దేశమైన గ్రెనడా పౌరసత్వం తీసుకుని ఆ పాస్‌పోర్ట్‌తో చైనా, మరికొన్ని యూరప్‌ దేశాలకు ఎంచక్కా వీసా లేకుండా వెళ్లిపోవచ్చు.

ఈ వెసులుబాటునే ఆసరాగా చేసుకొని మహా మహా మాయగాళ్లంతా కరీబియన్‌ దీవులనే అడ్డాగా మార్చుకుంటున్నారు. తమ సొంత దేశాల్లో దోచుకున్న డబ్బులో కొంత పెట్టుబడి పెట్టి, అక్కడి పౌరసత్వం తీసుకుంటున్నారు. అలా ఆర్థిక నేరగాళ్లు భారత్‌ కళ్లు గప్పి తప్పించుకు తిరుగుతున్నారు

Related News

Karachi city: జలదిగ్బంధంలో కరాచీ సిటీ.. వెంటాడుతున్న వర్షాలు, నిలిచిన విద్యుత్, ఆపై అంధకారం

America Tariffs: రష్యాపై ఒత్తిడికోసమే భారత్ పై సుంకాల మోత.. అసలు విషయం ఒప్పుకున్న అమెరికా

Spain Wildfires: స్పెయిన్‌లో కార్చిచ్చు.. 20 ప్రాంతాలకు విస్తరిస్తున్న మంటలు.. ఇదిగో వీడియో..

Afghanistan: బస్సులో చెలరేగిన మంటలు.. 71 మంది సజీవదహనం!

Russia Ukraine War: ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆపేస్తా! జెలెన్‌స్కీతో ట్రంప్ సంచలన భేటీ..

Congo Massacre: కాంగోలో దారుణం.. వెంటాడి మరీ 52 మందిని చంపేశారు

Big Stories

×