South Korea Impeached President | దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ (Yoon Suk Yeol) అనేక వివాదాల్లో తలమునకలై ఉన్నారు. ఆయనపై అభిశంసన తీర్మానం లాంఛనంగా ప్రారంభమైనప్పటికీ, ఈ ప్రక్రియ కొనసాగుతున్న క్రమంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. 2025 సంవత్సరానికి గాను ఆయనకు ఇచ్చే వార్షిక వేతనం 3 శాతాన్ని పెంచుతున్నట్లు దక్షిణ కొరియా ప్రభుత్వం ప్రకటించింది.
దక్షిణ కొరియా సిబ్బంది నిర్వహణ శాఖ ప్రకారం, ప్రభుత్వ అధికారుల ప్రామాణిక నియమాల కింద, అధ్యక్షుడి జీతం పెరిగే అంశం అధికారికంగా వెల్లడైంది. ఆయనపై అభిశంసన విచారణ ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతోంది. యూన్ సుక్ యోల్.. ఆయన ప్రభుత్వ బాధ్యతలు నిర్వహించకున్నా, ఆయనకు నిబంధనల ప్రకారం జీతం అందుతూనే ఉంటుంది. అయితే ప్రెసిడెంట్ యూన్ నెల జీతం 254.9 మిలియన్ వోన్ అంటే లక్షా 79 వేల అమెరికన్ డాలర్లు ఉండగా 3 శాతం పెరుగుదలతో ఇప్పుడు ఆయన నెల జీతం 262 మిలియన్లు.
డిసెంబర్ 2024 నుంచి అభిశంసనకు గురై అధికారానికి దూరమైన సౌత్ కొరియా అధ్యక్షుడు తనపై అభిశంసన విచారణ కొనసాగేంతవరకు సగం జీతం అంటే 130 మిలియన్ వోన్ అందుకుంటారు. అయితే ఆయన అభిశంసన విచారణలో ఉండగా.. ఆయనకు మరో 6 నెలల వరక మాత్రమే జీతం అందుతుంది.
Also Read: గ్రీన్‌లాండ్ కొనుగోలు చేస్తానన్న ట్రంప్.. ఎంత ధరవుతుందో తెలుసా?
అంతే కాదు, అభిశంసనకు గురైన ప్రధాన మంత్రి హన్ డక్-సూ జీతం కూడా 3 శాతం పెరిగింది. ‘‘నో వర్క్, నో పే’’ (No Work, No Pay) అనే నిబంధన ప్రకారం, ఇవి ఇద్దరికీ పూర్తి జీతం ఇవ్వడం నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందని తెలిసింది. అయితే, అభిశంసనకు గురైన ప్రభుత్వ అధికారులకు జీతాలు చెల్లించే అంశంపై జీతాలు నిలిపివేయాలనే స్పష్టమైన నిబంధనలు లేవు.
ఇదిలా ఉండగా, దక్షిణ కొరియాలో ప్రస్తుతం రాజకీయ సంక్షోభం నెలకొంది. అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ దేశంలో మార్షల్ లా విధించాలన్న నిర్ణయం తీసుకోవడంతో విపక్షాలు తీవ్ర వ్యతిరేకత ప్రదర్శిస్తూ, జాతీయ అసెంబ్లీలో (పార్లమెంట్) అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాయి. అయితే, ఈ అభిశంసన తీర్మానంలో ఓడిపోయిన యూన్ అధికారానికి దూరమయ్యారు. అయితే ఆయన స్థానంలో తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్న ప్రధాన మంత్రి హన్ డక్-సూ కూడా అభిశంసనకు గురైన ప్రెసిడెంట్ యూన్ పై కోర్టులో విచారణ చేసేందుకు న్యాయమూర్తలను నియమించడానికి నిరాకరించారు. దీంతో ఆయనను కూడా ప్రతిపక్షపార్టీల నాయకులు గద్దె దించాయి.
ఇప్పుడు, రాజ్యాంగ న్యాయస్థానం యూన్ సుక్ యోల్ పై అభిశంసన విచారణ చేశాక ఆయనను కొనసాగించాలా లేక అధికారాన్ని దుర్వినియోగం చేసినందకు శిక్షించాలా? అన్న విషయంపై 180 రోజులలోగా తీర్పు ఇవ్వాల్సి ఉంది. ఒకవేళ న్యాయస్థానం ఆయనను అధ్యక్ష పదవిలో నుంచి తొలగించాలని నిర్ణయిస్తే, 60 రోజుల్లోగా అధ్యక్ష ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది.