అమెరికా ఎన్నికల వేళ డొనాల్డ్ ట్రంప్ కి ఆర్థికంగానే కాకుండా ఇతరత్రా ఫుల్ సపోర్ట్ ఇచ్చారు ఎలన్ మస్క్. అనుకున్నట్టుగానే ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అయిన తర్వాత మస్క్ కి మంచి పోస్టింగ్ ఇచ్చారు. డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ(DOGE) అనే పేరుతో ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి, దాని బాధ్యతలు మస్క్ కి అప్పగించారు. అయితే అంతలోనే వారిద్దరి స్నేహం చెడింది. తాజాగా మస్క్ ఆ పదవికి గుడ్ బై చెప్పేశారు. మస్క్ కి వీడ్కోలు తెలిపేందుకు ట్రంప్ ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. మస్క్ సేవలను కొనియాడారు. అదే సమయంలో ఆయన ఎక్కడికీ పోరని, తమతోనే ఉంటూ, తమకు విలువైన సలహాలిస్తారని చెప్పుకొచ్చారు ట్రంప్.
"I am having a Press Conference tomorrow at 1:30 P.M. EST, with @ElonMusk, at the Oval Office. This will be his last day, but not really, because he will, always, be with us, helping all the way. Elon is terrific! See you tomorrow at the White House." –President Donald J. Trump… pic.twitter.com/7qF1SC1KJb
— The White House (@WhiteHouse) May 30, 2025
మస్క్ ఎగ్జిట్ కి కారణం ఏంటి..?
మస్క్, ట్రంప్ దాదాపు ఒకే రకమైన ఆలోచనా విధానాలు కలవారు. పరిపాలనలో ట్రంప్ ఎలాంటి సంచలన నిర్ణయాలు తీసుకుంటారో, వ్యాపార నిర్వహణలో మస్క్ అంతకంటే ఎక్కువ సంచలన నిర్ణయాలతో అందరికీ షాకులిచ్చేవారు. అలాంటి వారిద్దరికీ స్నేహం కుదిరింది. కానీ అది మూణ్ణాళ్ల ముచ్చటే అయింది. ఇంతకీ డోజ్ నుంచి ట్రంప్ ఎగ్జిట్ కి కారణం ఏంటనే విషయంపై తీవ్ర చర్చ జరుగుతోంది. “బిగ్ బ్యూటిఫుల్ బిల్” విషయంలో మస్క్ అసంతృప్తితో ఉన్నారని, అందుకే ఆ పదవినుంచి వైదొలగారని తెలుస్తోంది. అయితే ఈ బిల్లుపై ట్రంప్ అభిప్రాయం మాత్రం భిన్నంగా ఉంది. ఇందులో కొన్ని విషయాలు తనకు నచ్చకపోయినా, మిగతా విషయాలు బాగున్నాయని ఆయన అన్నారు. అదే బిల్లుని ట్రంప్ పొగడటం, మస్క్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో.. అదే ఆయన రాజీనామాకి కారణం అని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.
ఇంతకీ మస్క్ ఏం చేసేవారు..?
డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ(DOGE) అనే విభాగం.. అమెరికా ప్రభుత్వ ఖర్చుని వీలైనంత మేర తగ్గించేందుకు ఏర్పాటైంది. దీనికి అధిపతిగా ఉన్న మస్క్ కీలక సంస్కరణలు తెచ్చారు. వీటి వల్ల వేల మంది ఫెడరల్ ఉద్యోగులకు ప్రభుత్వం ఉద్వాసన పలికింది. ప్రభుత్వ సంస్థలు కొన్నిటిని రద్దు చేశారు. మస్క్ నిర్ణయాలు తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నాయి. కోర్టు కేసులు వీటికి అదనం. దీంతో DOGE లక్ష్యం నెరవేరలేదు. మొదట్లో అమెరికా ప్రభుత్వ వ్యయాన్ని 2 లక్షల కోట్ల డాలర్ల మేరకు తగ్గిస్తానని మస్క్ లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలతో తన టార్గెట్ ని లక్ష కోట్ల డాలర్లకు, ఆ తర్వాత 1500 కోట్ల డాలర్లకు తగ్గించుకున్నారు మస్క్. అది సాధించే క్రమంలో ఇప్పుడు ఆయనే DOGE కి రాజీనామా చేయడం విశేషం.
As my scheduled time as a Special Government Employee comes to an end, I would like to thank President @realDonaldTrump for the opportunity to reduce wasteful spending.
The @DOGE mission will only strengthen over time as it becomes a way of life throughout the government.
— Elon Musk (@elonmusk) May 29, 2025
ప్రభుత్వ ప్రత్యేక ఉద్యోగిగా తన పదవీకాలం పూర్తయిందని, ప్రభుత్వ వృథా వ్యయాన్ని తగ్గించేందుకు తనకు అవకాశమిచ్చిన ట్రంప్ కి కృతజ్ఞతలు అని మస్క్ తెలిపారు. తాను లేకపోయినా DOGE చేపట్టిన మిషన్ కాలక్రమంలో సక్సెస్ అవుతుందన్నారు మస్క్. ఇక ట్రంప్ కూడా తన ప్రియ మిత్రుడి నిర్ణయంపై ఆసక్తికరంగా స్పందించారు. ఎలన్ మస్క్ ఎక్కడికీ వెళ్లడంలేదని, అతను ఎల్లప్పుడు తమతోనే ఉంటారని, తమకు సహాయం చేస్తుంటారని చెప్పుకొచ్చారు.
మరోవైపు మస్క్ DOGE నుంచి బయటకు రావడానికి మరో కారణం ఉందంటున్నారు. ఇటీవల స్పేస్ ఎక్స్ కంపెనీ చేపట్టిన ప్రయోగాలు వరుసగా విఫలం అవుతున్నాయి. అంటే కంపెనీ అధినేతగా మస్క్ మరింత ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. అందుకే ఆయన ఇతరత్రా పనుల్ని పక్కనపెట్టి పూర్తి స్థాయిలో కంపెనీ వ్యవహారాలను పర్యవేక్షించాలనుకుంటున్నారని, అందుకే DOGE నుంచి బయకొచ్చారని చెబుతున్నారు.