Elon Musk, Vivek Ramaswamy: అగ్రరాజ్యం అమెరికా కాబోయే కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రెసిడెంట్ పదవి చేపట్టక ముందే తన మంత్రివర్గాన్ని సిద్ధం చేసుకునే పనిలో పడ్డాడు. ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ తగిన పదువులు కేటాయిస్తున్నట్లు రోజూ ప్రకటనలు చేస్తున్నాడు. ఈ క్రమంలో ట్రంప్ కోసం ఎన్నికల్లో అందరికంటే ఎక్కువగా శ్రమించిన బిలియనీర్ వ్యాపారవేత్త ఎలన్ మస్క్ కు కీలక బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ప్రకటించాడు. అమెరికాలో ఇద్దరు ప్రముఖ వ్యాపారవేత్తలు అయిన ఎలన్ మస్క్, వివేక్ రామస్వామికి ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ’ నాయకత్వ’ బాధ్యతలు అప్పగించాడు ట్రంప్.
సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘ట్రూత్’ లో ట్రంప్ దీనికి సంబంధించి ప్రకటన జారీ చేశారు. “ప్రభుత్వం చేస్తున్న అనవసర ఖర్చులు తగ్గించడానికి, ఫెడెరల్ ఏజెన్సీలలో సమూల మార్పులు చేయడానికి, ప్రభుత్వ బ్యూరోక్రసీని నిర్వీర్యం చేయడానికి డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీని కొత్తగా సృష్టించడం జరిగింది. ఈ డిపార్ట్‌మెంట్‌కు ది గ్రేట్ ఎలన్ మస్క్, అమెరికా దేశభక్తుడు వివేక్ రామస్వామి కలిసి నేతృత్వం వహిస్తారు.” అని ప్రకటనలో ట్రంప్ పేర్కొన్నారు.
Also Read: Elon Musk US Elections Fraud: ఎలన్ మస్క్‌పై ఫ్రాడ్ కేసు.. రోజూ మిలయన్ డాలర్లు ఇస్తానని మోసం!
ట్రంప్ నకు చెందిన రిపబ్లికన్ పార్టీ సభ్యులు కూడా ఈ డిపార్ట్‌మెంట్ గురించి ధృవీకరించారు. ఈ కొత్త డిపార్ట్ మెంట్ వల్ల ప్రభుత్వానికి అదనంగా వాణిజ్య దృకపథం తోడవుతుందని అభిప్రాయపడ్డారు. అయితే ఈ కొత్త డిపార్ట్‌మెంట్ ప్రభుత్వ పనితీరులో జోక్యం చేసుకోకుండా బయటి నుంచే సలహాలు సూచనలు ఇస్తూ ఉంటుంది. పైగా ట్రంప్ చేసిన ప్రకటన ప్రకారం అమెరికా 250వ స్వాతంత్ర్యం వార్షికోత్సవం వరకు అంటే జూలై 4, 2026 వరకు ఈ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎఫీషియెన్సీ ప్రభుత్వం చేయాల్సిన మార్పుల గురించి, ప్రభుత్వం వ్యయం తగ్గించడంపై ఒక ప్రణాళిక రూపొందిస్తుంది. దీని వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ బలం చేకూరుతుందని, అమెరికా ప్రజలకు 250వ స్వాతంత్ర్య వార్షికోత్సవానికి తమ ప్రభుత్వం ఇచ్చే కానుక అని ట్రంప్ అభివర్ణించారు.
ప్రభుత్వ ఉన్నతాధికారులకు ఇది షాక్ లాంటిదే: ఎలన్ మస్క్
కాబోయే అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనపై ఎలన్ మస్క్ స్పందించారు. ఆయన ట్విట్టర్ ఎక్స్ లో ఈ అంశంపై కామెంట్ చేస్తూ.. “ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్న అధికారులకు, ప్రభుత్వ విభాగాలకు ఈ షాక్ లాంటిదే. ఈ పార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ తీసుకునే నిర్ణయాలు, దాని పనితీరు పారదర్శకంగా ఉంటాయని, అందుకోసం తీసుకునే నిర్ణయాల గురించి ఆన్ లైన్ లో ప్రకటిస్తూ ఉంటామని తెలిపారు. ప్రజల నుంచి పన్నుల ద్వారా అర్జించిన ధనాన్ని విలాసాల కోసం ఖర్చు పెట్టే వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని మస్క్ చెప్పారు.
ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత ట్రంప్ చేసిన ప్రసంగంలో ఎలన్ మస్క్ పై ప్రశంసల వర్షం కురిపించారు. మస్క్ అమెరికాలో ఒక కొత్త స్టార్ గా ఆవిర్భవించారని పొగిడారు. ట్రంప్ కోసం ఎన్నికల్లో మస్క్ వేల కోట్ల డాలర్లు ఖర్చు పెట్టడంతో పాటు ట్విట్టర్ ఎక్స్ లో ట్రంప్ గెలుపు కోసం దూకుడుగా ప్రచారం చేశారు. ఇప్పుడు ట్రంప్ గెలుపుతో కొత్త ప్రభుత్వం మస్క్ కీలక పాత్ర పోషించబోతున్నట్లు స్పష్టం అయింది. ఇటీవలే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ట్రంప్ ఫోన్ ద్వారా చర్చలు జరిపారని, ఆ చర్చల్లో ఎలన్ మస్క్ కూడా పాల్గొన్నారని సమాచారం.
మరోవైపు ట్రంప్ నకు ప్రైమరీ ఎన్నికల్లో సొంత పార్టీ నుంచే గట్టిపోటీనిచ్చిన వివేక్ రామస్వామికి కూడా డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీలో సమాన బాధ్యతలు అప్పగించడం విశేషం. ప్రైమరీ ఎన్నికల్లో ట్రంప్ ను గట్టిగా వ్యతిరేకించిన రామస్వామి ఇప్పుడు ఆయనకు బాసటగా నిలువనున్నారు.