BigTV English

Europe Assemble Ukraine War: ట్రంప్ కాదన్నా మేమున్నాం.. ఉక్రెయిన్‌ కోసం ముందుకొచ్చిన యూరోప్ దేశాలు..

Europe Assemble Ukraine War: ట్రంప్ కాదన్నా మేమున్నాం.. ఉక్రెయిన్‌ కోసం ముందుకొచ్చిన యూరోప్ దేశాలు..

Europe Assemble Ukraine War| ఇటీవల అగ్రరాజ్యం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదొమిర్ జెలెన్‌స్కీ మధ్య జరిగిన వాగ్వాదం తరువాత యూరోప్ దేశాలు ఉక్రెయిన్ కు మద్దతుగా నిలబడ్డాయి. యురోప్ భద్రత, ఉక్రయిన్ యద్ధం ముగింపు కోసం లండన్ నగరంలో ఆదివారం ప్రధాన యూరోప్ దేశాల అధినేతలు సమావేశమయ్యారు. రష్యాతో శాంతి చర్చల ప్రక్రియను యురోప్ దేశాలు తమ చేతుల్లో తీసుకోవాలనే ఈ సమావేశం ఉద్దేశం.


ఈ సమావేశంలో.. యురోప్‌ భద్రత కోసం కలిసి పనిచేద్దామని, తరచుగా తలెత్తే ఇలాంటి సందర్భాలపై గట్టిగా స్పందించాల్సిన అవసరముందని బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ పిలుపునిచ్చారు. ఉక్రెయిన్‌కు మంచి జరిగే ఒప్పందం ద్వారానే ప్రతి దేశం భద్రత ఆధారపడి ఉందని, ఇతర దేశాలకు కూడా ఇదే ముఖ్యమని ప్రధాని స్టార్మర్ స్పష్టం చేశారు.

ఉక్రెయిన్‌కు అన్ని విధాలా బాసటగా..
అమెరికాలో ట్రంప్‌, జెలెన్‌స్కీ మధ్య శాంతి చర్చలు విఫలమైన నేపథ్యంలో స్టార్మర్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌తోపాటు జర్మనీ, డెన్మార్క్, ఇటలీ, నెదర్లాండ్స్, నార్వే, పోలండ్, స్పెయిన్, కెనడా, ఫిన్లాండ్, స్వీడన్, చెక్‌ రిపబ్లిక్, రొమేనియా తదితర దేశాధినేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. నాటో సెక్రటరీ జనరల్, యూరోపియన్‌ కౌన్సిల్‌, యూరోపియన్‌ కమిషన్, అధ్యక్షులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. వారంతా ఉక్రెయిన్‌కు మద్దతు తెలిపారు. రష్యాతో జరుగుతున్న యుద్ధంలో కాల్పుల విరమణ కోసం యురోప్‌ దళాలను ఉక్రెయిన్‌కు పంపించే అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది.


Also Read: జెలెన్‌స్కీ యుద్ధాన్నే కోరుకుంటున్నారు.. వైట్ హౌస్ వాగ్వాదం వైరల్ వీడియో

రష్యాను నమ్మలేం..
యురోప్‌ దేశాల సమావేశానికి ముందే జెలెన్‌స్కీతో మెక్రాన్, స్టార్మర్ భేటీ అయ్యారు. రష్యాతో కాల్పుల విరమణ ఒప్పంద ప్రణాళికపై కలిసి పని చేయాలని నిర్ణయించారు. ఆ ప్రణాళికను అమెరికాతో చర్చించాలని భావించారు. ‘ఫ్రాన్స్, బ్రిటన్ మరి కొన్ని యురోప్ దేశాలు కలిసి యుద్ధాన్ని ఆపే ప్రణాళికపై పని చేస్తాయి. ఆ తర్వాత అమెరికాతో ఆ ప్రణాళికపై చర్చిస్తాం’ అని స్టార్మర్‌ తెలిపారు. తాను రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను నమ్మలేనని, ట్రంప్‌పై నమ్మకముందని బ్రిటన్ ప్రధాని పేర్కొన్నారు.

అమెరికా నుంచి భద్రతపై హామీ గురించి తీవ్రంగా చర్చిస్తున్నామని కూడా స్టార్మర్‌ వెల్లడించారు. ‘యుద్ధాన్ని ముగించేందుకు ఒకవేళ ఒప్పందం కుదిరినా భద్రతకు హామీ ఉండాల్సిందే. లేదంటే పుతిన్‌ మళ్లీ దాడి చేసే అవకాశముంది. గతంలోనూ ఇలాగే జరిగింది. అదే నిజమైన ప్రమాదం. అందుకే ఒప్పందం అనేది జరిగితే అది శాశ్వతంగా ఉండాలి. కాల్పుల విరమణ గురించి తాత్కాలిక ఒప్పందాలతో లాభం లేదు’ అని స్టార్మర్‌ స్పష్టం చేశారు.

శాంతి ఒప్పందం విజయవంతంగా కుదుర్చుకోవడానికి మూడు అంశాలు అవసరమని స్టార్మర్‌ తెలిపారు. అందులో మొదటిది ఉక్రెయిన్‌ బలంగా ఉండటానికి ఆ దేశానికి ఆయుధాలను అందించడం, రెండోది భద్రతకు హామీ ఇచ్చేలా యురోప్‌ బలగాల మోహరింపు, మూడోది పుతిన్‌ హామీలను మీరకుండా రష్యాను అమెరికా నిలువరించడం అవసరమని అభిప్రాయపడ్డారు. వీటి కోసమే తాను పని చేస్తున్నానని తెలిపారు.

ఉక్రెయిన్ కు బ్రిటన్ 3.1 బిలియన్‌ డాలర్ల రుణ సాయం
ట్రంప్‌తో వివాదం తరువాత బ్రిటన్‌ పర్యటనకు వెళ్లిన ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి కొంత ఊరట లభించింది. ఆ దేశ ప్రధాన మంత్రి కీర్‌ స్టార్మర్‌తో భేటీ సందర్భంగా 3.1 బిలియన్‌ డాలర్ల విలువైన రుణ ఒప్పందంపై ఇరు దేశాధినేతలు సంతకాలు చేశారు. ఈ నిధులను ఉక్రెయిన్‌ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసుకోవడానికి ఉపయోగించనున్నట్లు జెలెన్‌స్కీ తెలిపారు.

‘యూకే ప్రధాని స్టార్మర్‌తో ఉక్రెయిన్‌ సహా యురోప్‌ మొత్తం ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించా. ఉక్రెయిన్ బలోపేతం కావడంతోపాటు యుద్ధాన్ని ముగించేందుకు తీసుకోవాల్సిన చర్యలు మా మధ్య చర్చకు వచ్చాయి. మా రక్షణ సామర్థ్యాలను ఈ రుణ ఒప్పందం బలపరుస్తుంది. బ్రిటన్ లాంటి వ్యూహాత్మక భాగస్వామి లభించడం మా అదృష్టం’ అని జెలెన్‌స్కీ పేర్కొన్నారు.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×