Flydubai Co-Pilot: దుబాయ్ నుండి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్ఛార్‌పై దాడి చేసిన ఒమానీ కో-పైలట్‌ను హమామ్ అల్హమామిగా అధికారులు గుర్తించారు. అతడికి ఉగ్రవాద భావజాలం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో దుబాయ్ ప్రభుత్వం విస్తృత స్థాయి దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ క్రమంలో కో-పైలెట్ గురించి సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఉగ్రవాద అనుకూల భావజలం ఉందన్న ఆరోపణలతో ఒమన్ లో అతడిని గతంలోనే విమానాలు నడపకుండా నిషేధించినట్లు తెలుస్తోంది.
ఒమన్‌లో విమానాలు నడపకుండా నిరోధించబడిన తర్వాత అల్హమామి ఆ దేశాన్ని వదిలి వెళ్లాడని పలు జాతీయ, అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడించాయి. అతను ఎక్కువ కాలం ఒమన్ వెలుపల, ముఖ్యంగా సిరియాలో గడిపాడని సమాచారం. అక్కడ ఉన్న సమయంలోనే అతను తీవ్రవాద భావజాలానికి ప్రభావితమయ్యాడని ఆ తర్వాత ఐక్య అరబ్ ఎమిరేట్స్ (యుఎఈ)కు చేరుకున్నాడని కథనాలు స్పష్టం చేస్తున్నాయి.
అల్హమామికి ఉన్న తీవ్రవాద ఆలోచనల కారణంగా ఒమన్ జాతీయ క్యారియర్ అయిన ‘ఒమాన్ ఎయిర్’లో అతని శిక్షణ పాత్ర నుండి గతేడాదే తొలగించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఒక ప్రాంతీయ దౌత్య వర్గం సైతం ధ్రువీకరించింది. అయితే శిక్షణ బాధ్యతల నుండి తప్పించినప్పటికీ ఎయిర్‌లైన్‌లో అతనికి మరొక విధమైన హోదాను కేటాయించినట్లు సమాచారం.
ఈ ఘటనపై జరుగుతున్న తనిఖీల్లో అల్హమామి వద్ద అనేక సంచలనాత్మక ఆధారాలు లభించాయి. అతని వస్తువులను తనిఖీ చేయగా ‘ఫ్రీ పాలస్తీనా’ పేరుతో కరపత్రాలు లభ్యమైనట్లు ఇజ్రాయెల్ మీడియా తెలిపింది. అతడు తరచూ పాలస్తీనాకు మద్దతుగా ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసేవాడని దర్యాప్తు అధికారులు తెలిపారు. ఇస్లామిక్ రాడికలైజేషన్, ఉగ్రవాద కోణంలో ఈ ఆధారాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
ఒమన్ పౌరుడైన అల్హమామికి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు వెళ్లే విమానంలో సేవలు అందించేందుకు ఎలా అనుమతి లభించిందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఒమన్ దేశానికి ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలు లేవు. ఈ నేపథ్యంలో అల్హమామికి విమాన సిబ్బందిలో ఎలా చోటు దక్కిందనే అంశంపై ఇజ్రాయెల్ నిఘా సంస్థలైన షిన్ బెట్, మోసాద్, ఇజ్రాయెల్ మిలిటరీ, రవాణా మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా విచారణ జరుపుతున్నాయి.
అల్హమామి యూఎఈలో జన్మించిన ఒమన్ పౌరుడు. అతని తండ్రి ఒమన్ వాసి కాగా.. తల్లి సిరియన్ మూలాలు ఉన్న మహిళ. అతనికి రెండో పౌరసత్వం ఏదీ లేదని తెలుస్తోంది. ఫ్లైదుబాయ్‌లో చేరడానికి ముందు అతను మొరాకోకు చెందిన ‘రాయల్ ఎయిర్ మొరాక్’లో పనిచేశాడు. ఈ క్రమంలోనే గడచిన ఎనిమిది నెలలుగా ఫ్లైదుబాయ్‌లో సేవలు అందిస్తున్నాడు.
సౌదీ అరేబియాలోని తబుక్‌లో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయిన తర్వాత అల్హమామిని సౌదీ అధికారులు యూఏఈకి అప్పగించారు. ప్రస్తుతం యుఏఈలోనే అతనిపై ఉగ్రవాద నిరోధక చట్టాల కింద విచారణ కొనసాగుతోంది.
Also Read: ఆంధ్రా వాళ్ల హోటళ్లు కేటీఆర్‌కి ఎలా వచ్చాయి? రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్!
సెప్టెంబర్ 30న దుబాయ్ నుండి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ అల్హమామి ఒక్కసారిగా కెప్టెన్ స్మిత్ మచ్ఛార్‌పై కాక్‌పిట్‌లోనే దాడికి పాల్పడ్డాడు. విమానాన్ని కూల్చివేసే ఉద్దేశంతోనే ఈ దాడి జరిగినట్లు భావిస్తున్నారు. ఈ ఆకస్మిక దాడి కారణంగా విమానం కేవలం రెండు నిమిషాల వ్యవధిలోనే సుమారు 16,000 అడుగుల కిందకు పడిపోయింది. తీవ్ర గాయాలైనప్పటికీ కెప్టెన్ స్మిత్ ధైర్యంతో పోరాడి కాక్‌పిట్ తలుపు తెరిచారు. వెంటనే ఇతర విమాన సిబ్బంది, ప్రయాణికులు కాక్‌పిట్‌లోకి ప్రవేశించి అల్హమామిని బంధించారు. దీంతో విమానాన్ని అదుపులోకి తెచ్చుకోవడం సాధ్యమైంది.
Also Read: మాపై దాడికి తెగిస్తే అణ్వాయుధాలే.. నాటో దేశాలకు పుతిన్ ఘాటు వార్నింగ్!