France Heatwave: భయంకరమైన వేసవి తాపానికి ఐరోపా దేశం ఫ్రాన్స్ అల్లాడిపోతోంది. దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీనికి తోడు విద్యుత్ కోతలు వారికి గుదిబండలా మారాయి. దీంతో భానుడి భగభగలకు తట్టుకోలేక ఉపశమనం కోసం నదులు, చెరువులు, సముద్ర తీరాలకు వెళ్లిన వారిలో సుమారు 40 మంది నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు.
ఫ్రాన్స్ వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలో గత కొన్ని రోజులుగా ఎండ తీవ్రత ఊహించని స్థాయికి చేరుకుంది. మంగళవారం ఫ్రాన్స్ లోని ఓ పట్టణంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు మెటియో ఫ్రాన్స్ వాతావరణ విభాగం తెలిపింది. మరికొన్ని ప్రాంతాల్లోనూ గతంలో లేని విధంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపింది. మునుపెన్నడూ లేని విధంగా ఫ్రాన్స్ లోని 58 డిపార్ట్ మెంట్లు (జిల్లాలు) బుధవారం నాటికి రెడ్ అలర్ట్ పరిధిలోకి వచ్చినట్లు మెటియో ఫ్రాన్స్ తెలిపింది.
వడగాలులపై అత్యవసర సమావేశానికి ముందు ఫ్రాన్స్ ప్రధాని సెబాస్టియన్ లెకోర్ను మాట్లాడారు. జూన్ 18 నుంచి ఇప్పటివరకూ నీట మునిగి 40 మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిలో ఎక్కువ మంది యువకులే అని పేర్కొన్నారు. అయితే వీరంతా అప్రమత్తత లోపించడం, నీటి లోతును సరిగ్గా అంచనా వేయలేకపోవడం, వేడి వాతావరణం వల్ల ఒక్కసారిగా చల్లని నీటిలోకి దూకినప్పుడు గుండెపై పడే ఒత్తిడి (హైడ్రోక్యూషన్) కారణంగా చనిపోయినట్లు వైద్య వర్గాలు ప్రాథమికంగా అంచనా వేశాయి. అయితే వేడి నుంచి ఉపశమనం పొందాలన్న కోరికను తాను అర్థం చేసుకోగలనని.. కానీ ప్రమాదకర ప్రాంతాల్లో ఈత కొట్టవద్దని ఫ్రాన్స్ క్రీడా మంత్రి మెరీనా ఫెరారీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ ఘోర ప్రమాదాల నేపథ్యంలో ఫ్రాన్స్ ప్రభుత్వం, రక్షణ బృందాలు అప్రమత్తమయ్యాయి. అనధికారిక ప్రాంతాలు, లైఫ్ గార్డులు లేని చోట్ల ఈతకు వెళ్లవద్దని అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం వేళల్లో బయటకు రావద్దని, వృద్ధులు, పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. నగరాల్లోని పార్కులు, పబ్లిక్ ఫౌంటెన్ల వద్ద ప్రజల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read: ఇయర్‌బడ్స్ vs ఇయర్‌ఫోన్స్ vs హెడ్‌ఫోన్స్.. ఈ మూడింట్లో ఏది బెస్ట్?
ఓమేగా బ్లాక్ అని పిలవబడుతున్న వాతావరణ మార్పు కారణంగా ఈ వడగాలులు వీస్తున్నాయి. వాతావరణ పటంలో ‘ఆల్ఫా’ (Omega – Ω) అక్షరం ఆకారంలో పీడన వ్యవస్థ ఏర్పడటం వల్ల ఈ తీవ్రమైన హీట్‌వేవ్ ఏర్పడుతుందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. 2003 ఆగస్టు నెలలో 16 రోజుల పాటు కొనసాగి.. ఐరోపా వ్యాప్తంగా దాదాపు 80 వేల మందిని బలిగొన్న హీట్ వేవ్ పరిస్థితులను ప్రస్తుత వాతావరణం తలపిస్తోందని మెటియో ఫ్రాన్స్ తెలిపింది. ప్రస్తుత వడగాల్పులు ఎంతకాలం కొనసాగుతాయన్న దానిపై క్లారిటీ లేదని చెప్పుకొచ్చింది. మరోవైపు ఇటలీ, బ్రిటన్ లోనూ ఇంచి మించు ఇదే రకమైన పరిస్థితులు ఉన్నాయి. తీవ్రమైన వడగాల్పుల నేపథ్యంలో ఇటలీలోని 15 నగరాలకు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
Also Read: హార్డ్ వర్క్ వద్దు.. స్మార్ట్ వర్క్ ముద్దు.. ఈ యాప్స్‌తో ఆఫీసు వర్క్ సూపర్ ఈజీ!