Kingfisher Vijay Mallya| భారతదేశంలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ దివాలా తీయడానికి ఆ సమయంలో దేశ ఆర్థిక మంత్రి పదవిలో ఉన్న ప్రణబ్ ముఖర్జీ కారణమని కింగ్‌ఫిషర్ యజమాని విజయ్ మాల్యా షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో బ్యాంకులకు రూ. 9,000 కోట్లకు పైగా అప్పులు ఎగవేత చేసి మనీలాండరింగ్ ఆరోపణలతో దేశం విడిచి పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా తాజాగా ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వూలో పాల్గొన్నాడు. రాజ్ షమానీ అనే ఇన్‌ఫ్లుయెన్సర్‌తో నాలుగు గంటలపాటు పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో విజయ మాల్యా తనపై ఉన్న కేసులు, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ పతనం, భారత్ విడిచి వెళ్లడం వంటి అంశాలపై మాట్లాడారు.
దేశం వదిలి వెళ్లిపోయాను.. కానీ దొంగను కాను
పాడ్‌కాస్ట్‌లో మాల్యా మాట్లాడుతూ.. “2016 మార్చి తర్వాత భారత్‌కు తిరిగి రాలేదు కాబట్టి నన్ను పరారీలో ఉన్నవాడు అనొచ్చు. కానీ నేను పారిపోలేదు. ముందుగా నిర్ణయించిన పర్యటనలో భాగంగానే విదేశాలకు వెళ్లాను. నాకు సరైన కారణాల వల్ల తిరిగి రాలేదు. మీరు నన్ను పరారీ అని పిలవాలనుకుంటే పిలవండి. కానీ ‘దొంగ’ అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది? దొంగతనం ఎక్కడ జరిగింది?” అని ప్రశ్నించారు.
భారతదేశం వదిలి వెళ్లిపోయాక 2016 నుంచి బ్రిటన్ దేశంలో ఉన్న మాల్యా, భారత్‌లో న్యాయమైన విచారణ జరుగుతుందన్న హామీ లేకపోవడం వల్ల తిరిగి రాలేదని చెప్పారు. “నాకు న్యాయమైన విచారణ, గౌరవప్రదమైన ఉనికి ఉంటుందని హామీ ఇస్తే, తిరిగి రావడం గురించి ఆలోచిస్తాను,” అని అన్నారు. యూకే హైకోర్ట్ తీర్పును ప్రస్తావిస్తూ.. భారతీయ జైళ్ల పరిస్థితులు యూరోపియన్ మానవ హక్కుల చట్టాన్ని ఉల్లంఘిస్తాయని, అందుకే తనను అప్పగించలేమని వాదించారు.
కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ పతనం గురించి మాట్లాడుతూ.. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం ప్రధాన కారణమని చెప్పారు. “లెమాన్ బ్రదర్స్ సంక్షోభం గురించి తెలుసు కదా? అది భారతదేశం లోనూ ప్రభావం చూపింది. అన్ని రంగాలు దెబ్బతిన్నాయి, డబ్బు ప్రవాహం ఆగిపోయింది, రూపాయి విలువ పడిపోయింది,” అని వివరించారు. అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీని కలిశాను. నష్టాల కారణంగా విమానాల సంఖ్య తగ్గించి, ఉద్యోగులను తొలగించాలనుకుంటున్నట్లు చెప్పగా.. “కార్యకలాపాలు తగ్గించవద్దు, బ్యాంకులు సహాయం చేస్తాయి,” అని సలహా ఇచ్చారని మాల్యా తెలిపారు.
Also Read: ఎంపీ మహువా కొత్త జీవితం.. సీక్రెట్‌గా పెద్దాయనతో పెళ్లి
మాల్యా కేసులో న్యాయపరమైన సమస్యలు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో లండన్ హైకోర్టులో రూ. 11,101 కోట్ల రుణం సంబంధించి మాల్యా అప్పీల్ కోల్పోయారు. ఫిబ్రవరిలో కర్ణాటక హైకోర్టులో.. బ్యాంకులు రూ. 6,200 కోట్లకు బదులు రూ. 14,000 కోట్లు రాబట్టాయని వాదించారు. కోర్టు బ్యాంకులకు నోటీసులు జారీ చేసింది. 2012లో కింగ్‌ఫిషర్ కార్యకలాపాలు నిలిచినప్పటికీ, భారత అధికారులు మాల్యాను విచారణ కోసం తీసుకొచ్చే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.