Germany Car Attack: జర్మనీ క్రిస్మస్ మార్కెట్ లో శుక్రవారం ఒక వ్యక్తి ఉద్దేశ పూర్వకంగానే కారు వేగంగా నడుపుతూ జనం మధ్యలో దూసుకెళ్లాడు. శుక్రవారం సాయంత్రం మాగ్డేబర్గ్ నగరంలో జరిగిన ఈ ఘటనలో ఒక పిల్లాడు సహా ఇద్దరు మరణించారు. 68 మంది గాయపడ్డారు. కారు అనూహ్యంగా రావడంతో జనం ఆందోళనతో అరుపులు వేస్తూ పరుగులు తీశారని సిఎన్ఎన్ రిపోర్ట్.
జర్మనీలోని సాక్సానీ అన్హాల్డ్ రాష్ట్ర అధ్యక్షుడు రెయినర్ హెసెలాఫ్ ఈ ఘటనపై స్పందించారు. “మాగ్డేబర్గ్ క్రిస్మస్ మార్కెట్లో జరిగిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. చనిపోయిన వారిలో ఒక పిల్లాడు కూడా ఉన్నాడు. 68 మంది గాయపడ్డారు. వీరిలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 53 మందికి స్వల్ప గాయాలయ్యాయి. 100 మంది ఫైర్ పైటర్లు, 50 మంది సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని వైద్య సాయం అందిస్తున్నారు. తీవ్రంగ గాయపడిన వారికి ఆస్పత్రికి తరలిస్తున్నారు.” అని చెప్పారు.
జర్మనీ ఇంటీరియర్ మినిస్టర్ నాన్సీ ఫెయిసర్ కూడా ఘటన పై స్పందిస్తూ.. “మాగ్డేబర్డ్ నగరంలో జరిగిన ఘటన చాలా షాకింగ్ గా ఉంది. చనిపోయిన వారి కుటుంబాల పట్ల నా సానుభూతి ఉంది. ఎమర్జెన్సీ సహాయక సిబ్బంది ఇప్పటికే గాయపడిన వారికి కాపాడి ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిని కాపాడడానికి అన్ని విధాల చర్యలు చేపట్టాం. ఈ దుఖ సమయంలో బాధితులకు, వారి కుటుంబాలకు ప్రభుత్వం తోడుగా నిలబడుతుంది.” అని ఆమె ఎక్స్ లో రాశారు.
Also Read: 2025 ప్రపంచంలో మృత్యు తాండవం.. సిరియా పతనమే పునాది.. బాబా వంగా జోస్యం
కారు దాడి చేసిన వ్యక్తి పోలీసులు అరెస్టు చేశారు. అతను ఒంటరిగా ఈ దాడి చేయలేదని ఇతరులు కూడా ఈ కుట్రలో ఉన్నారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. “నిందితుడిని అదుపులోకి తీసుకున్నాం. ఇక ఏ ప్రమాదం లేదు. అధికారులు ఈ దాడి వెనుక ఎవరు ఉన్నారనే కోణంలో విచారణ చేస్తున్నారు.” అని మాగ్డేబర్గ్ నగర మేయర్ టీవీ ఛానెల్ ప్రకటనలో చెప్పారు.
క్రిస్మస్ పండుగ సందర్భంగా స్థానికులు షాపింగ్ చేస్తుండగా.. కారు దాడి ఘటన జరిగింది. శుక్రవారం సాయంత్రం 7 గంటలకు (స్థానిక సమయం) జరిగిన ఈ ప్రమాదంలో సౌదీ అరేబియా కి చెందిన ఒక 50 ఏళ్ల డాక్టర్ ని పోలీసులు అరెస్టు చేశారు. ఆ డాక్టర్ 2006 నుంచి జర్మనీలో నివసిస్తున్నాడని సమాచారం. ఘటనా స్థలానికి 40 కిలోమీటర్ల దూరంలో నిందితుడు ఆస్పత్రిలో ఉద్యోగం చేస్తున్నాడని తెలిసింది.
నిందితుడి గురించి విచారణలో అతనికి ఎవరు ఈ ఘటన కోసం సహకరించారో తెలియలేదని సాక్సానీ అన్హాల్డ్ గవర్నర్ రెయినర్ హెసెలాఫ్ తెలిపారు. అయితే భద్రతా చర్యలు పెంచడం జరిగిందని ప్రజలు క్రిస్మస్ పండుగ సమయంలో ఆందోళన చెందకుండా సంతోషంగా సంబరాలు చేసుకోవాలని ఆయన కోరారు.