Harvard University Hongkong| అమెరికాలో యూనివర్సిటీలపై ట్రంప్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో.. హాంగ్ కాంగ్‌లోని ఒక విశ్వవిద్యాలయం.. హార్వర్డ్ యూనివర్సిటీలోని విదేశీ విద్యార్థులకు ఎటువంటి షరతులు లేకుండా అడ్మిషన్ ఇస్తామని ప్రకటించింది. న్యూస్‌వీక్ వార్తాసంస్థ రిపోర్ట్ ప్రకారం.. హార్వర్డ్ లో తదుపరి విద్యా సంవత్సరం చేరలేని, కొనసాగించలేని విద్యార్థుల కోసం హాంగ్ కాంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (HKUST) సహాయం చేస్తామని తెలిపింది. ఈ యూనివర్సిటీ త్వరిత ఎంట్రెన్స్ టెస్ట్, ప్రవేశ ప్రక్రియ, క్రెడిట్ బదిలీలు, వీసా సహాయం, వసతి సౌకర్యాలు వంటి సహాయాన్ని విద్యార్థులకు అందిస్తామని పేర్కొంది.
హాంగ్ కాంగ్ యూనివర్సిటీ ప్రొవోస్ట్ (యూనివర్సిటీ చీఫ్) గుయో యికే మాట్లాడుతూ.. “వైవిధ్యం.. క్రియేటివిటీ, పురోగతిని పెంపొందిస్తుంది. హార్వర్డ్ విద్యార్థులను మా క్యాంపస్‌లోకి స్వాగతించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. వారు తమ రంగాల్లో రాణించడానికి అవసరమైన వనరులు ఉత్సాహభరితమైన వాతావరణాన్ని అందిస్తాము,” అని న్యూస్‌వీక్‌కు తెలిపారు.
యూనివర్సిటీ విద్యార్థుల పట్ల అమెరికా ప్రభుత్వం తీరు పై చైనా విమర్శలు చేసిన వెంటనే హాంగ్ కాంగ్ యూనివర్సిటీ ఈ ఆఫర్ ప్రకటించడం గమనార్హం. అమెరికా హార్వర్డ్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థుల ప్రవేశాన్ని, విద్యార్థి మార్పిడి కార్యక్రమాలపై ట్రంప్ ప్రభుత్వం తాత్కాలికంగా నిషేధం విధించింది. న్యూస్‌వీక్ ప్రకారం, ప్రస్తుతం హార్వర్డ్ లోని మొత్తం విదేశీ విద్యార్థుల్లో 1,000 కంటే ఎక్కువ సంఖ్యలో చైనీస్ విద్యార్థులు చదువుతున్నారు.
అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ హార్వర్డ్‌పై గురువారం చైనాపై తీవ్ర ఆరోపణలు చేసింది. హార్వర్డ్ క్యాంపస్‌లో “అమెరికా వ్యతిరేక, ఉగ్రవాద సమర్థకులు” యూదు విద్యార్థులను వేధించడం, దాడి చేయడానికి అనుమతించిందని, అలాగే చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీతో సమన్వయం చేస్తూ, గత సంవత్సరం చైనీస్ పారామిలిటరీ గ్రూప్ సభ్యులకు శిక్షణ ఇచ్చిందని ఆరోపించింది.
దీనికి సమాధానంగా.. హార్వర్డ్ యూనివర్సిటీ అమెరికా ప్రభుత్వ నిర్ణయం చట్టవిరుద్ధంగా ఉందని అని అభివర్ణించింది. హార్వర్డ్ ప్రతినిధి జాసన్ న్యూటన్ ఒక ప్రకటనలో, “140 కంటే ఎక్కువ దేశాల నుండి వచ్చే అంతర్జాతీయ విద్యార్థులు స్కాలర్‌లను హోస్ట్ చేయడానికి హార్వర్డ్ పూర్తిగా కట్టుబడి ఉంది. విదేశీ విద్యార్థులు ఈ విశ్వవిద్యాలయాన్ని, ఈ దేశాన్ని అపారంగా సుసంపన్నం చేస్తారు,” అని తెలిపారు. అమెరికా ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దు చేయడానికి హార్వర్డ్ ట్రంప్ పరిపాలనపై న్యాయపోరాటం చేస్తోంది. “మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాము, మా విద్యార్థులకు, స్కాలర్‌లకు సాధ్యమైన అన్ని విధాలుగా అండగా నిలబడతాము.” అని యూనివర్సిటీ తెలిపింది. ఈ క్రమంలో మసాచుసేట్స్ రాష్ట్ర కోర్టు హార్వర్డ్ యూనివర్శిటీపై విధించిన ఆంక్షలు, నిషేధాలు చెల్లవని చెబుతూ.. ట్రంప్ ప్రభుత్వానికి షాకిచ్చింది. అమెరికా ప్రభుత్వ ఆదేశాలను తాత్కాలికంగా నిలుపుదల చేసింది.
Also Read: హార్వర్డ్ యూనివర్సిటీపై ట్రంప్ ఆంక్షలు .. భారతీయ విద్యార్థుల చదువులు ఆగిపోతాయా?
ఇదిలా ఉండగా, విమర్శకులు సైతం ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఈ నిర్ణయం.. విదేశీ ప్రతిభావంతులైన విద్యార్థులను అమెరికాలో చదువుకోవడానికి రాకుండా నిరుత్సాహపరుస్తుందని హెచ్చరించారు. అందుకే హార్వర్డ్ యూనివర్సిటీలో నిషేధాలు కొనసాగితే.. తర్జాతీయ విద్యార్థులు చైనా, హాంగ్ కాంగ్ ఇతర దేశాలలోని ఉన్నత సంస్థలను ఎంచుకోవచ్చని సూచిస్తున్నారు.