Pakistan train hijack Balochistan|బలోచిస్తాన్ ప్రత్యేక దేశం కోసం సాయుధ పోరాటం చేస్తున్న బలోచ్ మిలిటెంట్లు ..బలోచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ) పాకిస్తాన్‌లో ప్రయాణికుల రైలును మంగళవారం హైజాక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మొత్తం ట్రైన్ లో దాదాపు 500 మంది ప్రయణిస్తుండగా.. మిలిటెంట్లు 182 మందిని బందీలుగా చేసుకున్నారు. దీంతో పాకిస్తాన్ సైన్యం రంగంలోకి దిగింది. పాక్ సైనికులు, బలోచ్ మిలిటెంట్ల మధ్య జరిగిన పోరాటంలో 27 మంది ఉగ్రవాదులు చనిపోయారని.. మరోవైపు 30 మంది సైనికులు మరణించారని సమాచారం. అయితే ఆపరేషన్ లో ఇప్పటివరకు బలోచ్ ఉగ్రవాదుల చెర నుంచి 155 మందిని భద్రతా సిబ్బంది రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు.
బలోచిస్తాన్ ప్రావిన్సులోని పర్వత ప్రాంతమైన క్వెట్టా నుంచి ఖైబర్ పఖ్తుంఖ్వా (Khyber Pakhtunkhwa) ప్రావిన్సులోని పెషావర్‌కు ప్రయాణించే జాఫర్ ఎక్స్‌ప్రెస్ (Jaffar Express) మంగళవారం ఉదయం 9 గంటలకు బయలుదేరింది. మొత్తం 500 మంది ప్రయాణిస్తున్న ఈ రైలుపై మిలిటెంట్లు దాడి చేశారు. రైలు మార్గంలో 17 సొరంగాలు ఉండగా.. 8వ సొరంగం వద్ద మిలిటెంట్లు ట్రాక్‌ను పేల్చి జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను తమ నియంత్రణలోకి తీసుకున్నారు. బలోచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ) ఈ దాడి తామే చేశామని ప్రకటించింది. వెంటనే పాక్ ప్రభుత్వం.. ట్రైన్ హైజాక్ అయిన చోటుకి భద్రతా బలగాలను పంపించి ప్రయాణికులను రక్షించేందుకు ఆపరేషన్ చేపట్టింది.
Also Read: అమెరికాలో పాకిస్తాన్ రాయబారికి అవమానం.. వీసా ఉన్నా విమానాశ్రయంలో అనుమతి నిరాకరణ
ఇందులో భాగంగా, ఉగ్రవాదులపై కాల్పులు జరిపి 155 మందిని రక్షించామని భద్రతా వర్గాలు వెల్లడించాయి. రక్షించిన వారిలో 58 మంది పురుషులు, 31 మంది మహిళలు, 15 మంది చిన్నారులు ఉన్నారని తెలిపారు. వీరందరినీ మరో రైలు ద్వారా సమీప ప్రాంతమైన కాచీలోని మాచ్‌కి తరలించినట్లు పేర్కొన్నారు. ఇక 27 మంది మిలిటెంట్లను మట్టుపెట్టామని, అనేకమంది గాయపడ్డారని తెలిపారు. మిగిలినవారందరినీ రక్షించేందుకు ఆపరేషన్ కొనసాగుతుందని, రైలులో పలువురు ప్రభుత్వాధికారులు కూడా ఉన్నట్లు స్థానిక అధికారి తెలిపారు. పెషావర్, క్వెట్టా రైల్వే స్టేషన్‌లలో పాక్ రైల్వే ఎమర్జెన్సీ డెస్క్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. మిలిటెంట్లు రైలును హైజాక్ చేసిన సమయంలో తీవ్రమైన కాల్పులు, పేలుడు సంభవించాయని స్థానిక మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.
చిన్నారులను రక్షణ కవచాలుగా..
ఈ దాడి తమ పనే అని వేర్పాటువాద మిలిటెంట్ గ్రూపు బలోచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ) సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించింది. ప్రభుత్వం తమపై ఏదైనా మిలిటరీ ఆపరేషన్‌కు ప్రయత్నిస్తే, భద్రతాదళాలు వెనక్కు తగ్గకపోతే అందరినీ చంపేస్తామని మిలిటెంట్లు బెదిరించారు. మహిళలు, చిన్నారులను విడిచిపెట్టినట్లు బలోచ్ మిలిటెంట్లు చెబుతున్నప్పటికీ.. వారిని రక్షణ కవచాలుగా వాడుకుంటున్నట్లు పాక్ సైనికాధికారులు తెలిపారు. రక్షణ కోసం మరో రైలును అక్కడకు పంపించామని వివరించాయి. పాక్‌లోని బలోచిస్తాన్‌కు ఇరాన్, అఫ్ఘనిస్తాన్ సరిహద్దులు ఉన్నాయి. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చైనా – పాకిస్తాన్ ఆర్థిక నడవా (సిపెక్) బలోచిస్తాన్ మీదుగా వెళ్తుండటం ఈ దాడులకు ప్రధాన కారణం. ఆర్థిక వృద్ధికి సిపెక్ తోడ్పడుతుందని పాకిస్తాన్ ప్రభుత్వం ఆశిస్తుండగా, తమ ప్రాంత వనరులను కొల్లగొట్టడానికి ఇదొక ఎత్తుగడ అని, దీనివల్ల ఎలాంటి ప్రయోజనం లేదని స్థానికులు భావిస్తున్నారు.
బలోచిస్తాన్ ప్రత్యేక దేశం ఏర్పాటే లక్ష్యం
పాకిస్తాన్‌లోని దాదాపు 44 శాతం భూభాగం ఉన్న బలోచిస్తాన్ ప్రావిన్సులో చమురు, బొగ్గు, బంగారం, రాగి, సహజ వాయువు తదితర వనరులు పుష్కలంగా ఉన్నాయి. వీటి ఆదాయం పాక్ ఖజానా నింపుతోంది. కోటిన్నర జనాభా ఉన్న బలోచిస్తాన్ రాష్ట్రంలో మాత్రం పేదరికం అధిక స్థాయిలో ఉంది. 1947 నాటికి ఈ ప్రాంతం పలువురు స్థానిక పాలకుల అధీనంలో ఉండేది. వీరిలో శక్తిమంతుడైన అహ్మద్ యార్ ఖాన్ స్వతంత్ర బలోచ్ రాష్ట్రం కావాలని పట్టుబట్టారు. అలా చేస్తే బలోచిస్తాన్‌లో సోవియట్ యూనియన్ (రష్యా) తిష్ఠ వేస్తుందని బ్రిటిషర్లు ఆందోళన చెందారు. పాకిస్తాన్ సైన్యం బలోచ్ భూభాగంలోకి ప్రవేశించి ఒత్తిడి తీసుకురావడంతో 1948 మార్చి 27న అహ్మద్ యార్ ఖాన్ విలీనపత్రంపై బలవంతంగా సంతకం చేయాల్సి వచ్చింది. ఈ ప్రాంతంలో ఆ నాడు నుంచీ రగులుతున్న అసంతృప్తి నేటికీ చల్లారలేదు. ఈ నేపథ్యంలో ప్రత్యేక బలోచిస్తాన్ దేశం కోసం ‘బలోచ్ లిబరేషన్ ఆర్మీ’ (బీఎల్‌ఏ) 2000 సంవత్సరంలో పుట్టింది . సహజ వనరులను కాపాడుకొని, గ్రేటర్ బలోచిస్తాన్ ఏర్పాటు చేసుకోవడమన్నదే వీరి లక్ష్యం. గత అయిదేళ్లుగా ఈ పోరాటం తన పంథా మార్చుకొని మిలిటెన్సీ బాట పట్టింది. అయితే ఇన్నేళ్లుగా లేని ఒక అనూహ్య మార్పు జరిగింది. బలోచిస్తాన్ ప్రత్యేక దేశం కొన్ని వేర్వేరు దళాలు పోరాటం సాగిస్తున్నాయి. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఇవన్నీ ఏకమయ్యాయి. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వానికి బలోచ్ మిలిటెంట్లు పెద్ద సమస్యగా మారారు. ఇప్పటికే బిఎల్ఏ ఒక ఉగ్రసంస్థ అని పాకిస్తాన్ ప్రభుత్వంతో పాటు బ్రిటన్ కూడా ప్రకటిచింది.