USA Indian Students | డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి అధికారం చేపట్టాక.. అక్కడ చదువుకుంటున్న విదేశీ విద్యార్థులకు కష్టాలు చట్టుముట్టాయి. ముఖ్యంగా భారతీయ విద్యార్థులు ఆర్థిక సమస్యలతో విలవిల్లాడిపోతున్నారు. ఒకవైపు రూపాయి మారకం విలువ కంటే అమెరికా డాలర్ విలువ పెరిగిపోతోంది. మరోవైపు క్యాంపస్ బయట పార్ట్-టైమ్ ఉద్యోగాలు చేయడానికి వీల్లేదని ట్రంప్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇవి చాలదన్నట్లు ఇమ్మిగ్రేషన్ అధికారులు అక్రమ వలసదారులను గుర్తించేందుకు సోదాలు చేస్తున్నారు. దీంతో ఎక్కువ సంఖ్యలో వీసా గడువు ముగిసిన విద్యార్థులతో పాటు వీసా కలిగిన విద్యార్థులు కూడా తమపై నిఘా పెట్టారని భావించి పార్ట్-టైమ్ ఉద్యోగాలు మానేస్తున్నారు. ఫలితంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆర్థిక ఒత్తిడికి గురవుతున్నారు.
అమెరికాలో స్టూడెంట్ వీసా నిబంధనలు ఎలా ఉన్నాయి?
ఎఫ్-1 వీసాతో అమెరికాలో చదువుకునే విద్యార్థులు వారానికి 20 గంటల వరకు క్యాంపస్ లోపల మాత్రమే పార్ట్-టైమ్ ఉద్యోగాలు చేసుకోవచ్చు. వేసవి సెలవులు లేదా సెమిస్టర్ విరామ సమయంలో వారానికి 40 గంటలు పని చేయవచ్చు. కానీ క్యాంపస్ బయట పార్ట్-టైమ్ ఉద్యోగాలు చేయడానికి అనుమతి లేదు. అయితే, క్యాంపస్ లోపల ఉద్యోగాలు అందరికీ దొరకవు. ఈ కారణంగా, చాలా మంది విద్యార్థులు క్యాంపస్ బయట పార్ట్-టైమ్ ఉద్యోగాలు చేస్తున్నారు. స్థానికులు గంటకు 20-30 డాలర్లు పొందుతుంటే, భారతీయ విద్యార్థులు గంటకు 6 నుంచి 10 డాలర్లకు పని చేస్తున్నారు. ఈ ఆదాయంతో విద్యార్థులు తమ జీవన వ్యయం, ఫీజులను భరిస్తూ, తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గించుకుంటున్నారు.
Also Read: దెబ్బకు దెబ్బ.. కెనెడాపై సుంకాలు విధించిన ట్రంప్.. కౌంటర్ ఇచ్చిన ట్రూడో
కానీ ఇప్పుడు ఇమ్మిగ్రేషన్ అధికారులు క్యాంపస్ బయట పార్ట్-టైమ్ ఉద్యోగాలు చేసే విద్యార్థులపై కఠినంగా చర్యలు తీసుకుంటున్నారు. వీరిని పట్టుకుంటే, వీసా రద్దు చేసి స్వదేశానికి పంపిస్తారని ప్రకటించారు. ఇలాంటి పరిస్థితి ఎదురైతే, భవిష్యత్తులో అమెరికాకు వెళ్లడం కష్టమవుతుందని భయపడుతున్న విద్యార్థులు పార్ట్-టైమ్ ఉద్యోగాలు మానేస్తున్నారు. కొన్ని నెలల తర్వాత పరిస్థితి మెరుగుపడుతుందని ఆశిస్తున్నారు. అప్పటివరకు, నెలవారీ రూమ్ అద్దె, భోజనం, ఇతర ఖర్చులకు భారతదేశంలోని తల్లిదండ్రుల నుంచి డబ్బు అడుగుతున్నారు. ప్రాంతాలను బట్టి, విద్యార్థులకు నెలకు రూ.50,000 నుండి రూ.80,000 వరకు జీవన వ్యయం ఖర్చవుతోంది.
అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య
అమెరికా ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ‘ఓపెన్ డోర్’ నివేదిక ప్రకారం, 2023-24లో అమెరికాలోని అంతర్జాతీయ విద్యార్థుల్లో భారతీయులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. అమెరికాలో 11.26 లక్షల మంది విదేశీ విద్యార్థులు ఉండగా, అందులో భారతీయ విద్యార్థులు 3.30 లక్షల మంది ఉన్నారు. అంటే, ప్రతి 100 మంది అంతర్జాతీయ విద్యార్థుల్లో దాదాపు 30 మంది భారతీయులు. వీరిలో తెలుగు రాష్ట్రాల వారు 56% మంది ఉన్నారు.
ఏప్రిల్ వరకు కష్టాలు తప్పవు?
వరల్డ్ వైడ్ ఎడ్యు కన్సల్టెంట్స్ ఎండీ వీఆర్ ఉడుముల అభిప్రాయం ప్రకారం, “ఒక హోటల్లో 10 మంది సిబ్బంది ఉంటే, అందులో ఏడు-ఎనిమిది మంది భారతీయ విద్యార్థులు పార్ట్-టైమ్ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇప్పుడు వారందరూ ఉద్యోగాలు మానేస్తే, వ్యాపారాలు దెబ్బతింటాయి. ఈ పరిస్థితిలో, ఏప్రిల్ వరకు మాత్రమే పార్ట్-టైమ్ ఉద్యోగాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించవచ్చు. ఆ తర్వాత పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది.”
ఆందోళన చెందతున్న విద్యార్థులు
“ఎంఎస్ పూర్తయిన తర్వాత ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నా. ట్రంప్ వచ్చాక ఉద్యోగాలు పెరుగుతాయని భావించాం. కానీ ఇప్పుడు పార్ట్-టైమ్ ఉద్యోగాలు కూడా లేకుండా చేశారు. కన్సల్టెన్సీలో ఉద్యోగం చేస్తున్నట్లు చూపుతూ వీసా గడువు పెంచుకుంటున్నా. ఇప్పుడు బంధువుల ఇంట్లో ఉంటూ, ఖర్చులు భరించలేక కష్టపడుతున్నాను.”
– కాలిఫోర్నియాలో ఉన్న మియాపూర్ యువకుడు
“క్యాంపస్ బయట పార్ట్-టైమ్ ఉద్యోగాలు చేసే విద్యార్థులపై ఇమ్మిగ్రేషన్ అధికారులు నిఘా పెట్టారు. పట్టుబడితే స్వదేశానికి పంపిస్తారు. అందుకే ఉద్యోగం మానేస్తున్నా. ఇక మీరే నెలవారీ ఖర్చులకు పంపించాలి.”
– టెక్సాస్లో ఎంఎస్ చదువుతున్న కూకట్పల్లి విద్యార్థి
“మా ఇద్దరు కుమారులు అమెరికాలో ఉన్నారు. పెద్దవాడు హెచ్-1బీ ద్వారా ఉద్యోగం చేస్తున్నాడు. ఇప్పుడు అతని వీసా రెన్యువల్ కాలేదు. చిన్నవాడు ఇటీవల ఎంఎస్ పూర్తిచేశాడు. ఓపీటీ ద్వారా కూడా ఉద్యోగం లేకపోవడంతో పార్ట్-టైమ్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇప్పుడు అది కూడా మానేశాడు.”
– సిరిసిల్ల ఉపాధ్యాయుడు
ఈ పరిస్థితి భారతీయ విద్యార్థులకు మాత్రమే కాకుండా, అమెరికా ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతోంది. విద్యార్థులు పార్ట్-టైమ్ ఉద్యోగాలు మానేస్తున్నందున, హోటళ్లు, రెస్టారెంట్లు సిబ్బంది లేక ఇబ్బందుల్లో ఉన్నాయి. ఈ పరిస్థితి ఏప్రిల్ వరకు కొనసాగుతుందని, ఆ తర్వాత మెరుగుపడే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ట్రంప్ 90 రోజుల సమీక్ష నిర్వహించేందుకు కఠినంగా వ్యవహరిస్తున్నారు.