India China Flights: ట్రంప్ టారిఫ్ వ్యవహారం భారత్-చైనాలను దగ్గర చేసిందా? ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయా? ఆగష్టు చివరలో పీఎం నరేంద్రమోదీ చైనాకు వెళ్తున్నారా? ఇరుదేశాల అధినేతలు తమ సమస్యలపై చర్చించనున్నారా? ఆ తర్వాత ఇరుదేశాల మధ్య విమాన సర్వీసులు మొదలవుతాయా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత భారత్-చైనా మధ్య నేరుగా విమాన సర్వీసులు మళ్లీ మొదలుకానున్నాయి. సెప్టెంబర్ నుంచి ఆ దేశాల మధ్య విమాన సర్వీసులను పునరుద్ధరించే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది. ఎయిర్ ఇండియా, ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థలు చైనాలో సర్వీసులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలని మోదీ ప్రభుత్వం సూచించినట్టు రాసుకొచ్చింది.
సరిగ్గా ఐదేళ్ల కిందట కొవిడ్, గల్వాన్ లోయలో భారత్ -చైనా సైనికుల ఘర్షణలతో సంబంధాలు క్షీణించాయి. ఆ సమయంలో రెండు దేశాల మధ్య విమాన సర్వీసులు రద్దయ్యాయి. చైనా దూకుడుకు కళ్లెం వేయాలని నిర్ణయించిన భారత్, డ్రాగన్ దేశానికి సంబంధించిన పలు యాప్‌లపై నిషేధం విధించింది. జరిగిన పరిణామాల నేపథ్యంలో చైనా దిగుమతులపై కఠిన ఆంక్షలు విధించింది భారత్.
అంతేకాదు చైనా నుంచి పెట్టుబడులపై కేంద్రం సుముఖత చూపలేదు. జరిగిన.. జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించే దిశగా చర్యలు మొదలయ్యాయి. దీనికితోడు ట్రంప్ టారిఫ్ ట్రేడ్ వార్ ఇరుదేశాల మధ్య సానుకూల పవనాలు వీస్తున్నాయి.
ALSO READ: ఆ వ్యాధితో బాధపడుతున్న ట్రంప్.. అందుకేనా తేడాగా
ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడటంతో ఆర్థిక, వాణిజ్య సంబంధాలు మెరుగుపడతాయని భావిస్తున్నారు. చైనా పెట్టుబడుదారులు ఇండియాలో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు. గత నెల చైనా పౌరులకు పర్యాటక వీసాల జారీని తిరిగి ప్రారంభిస్తున్నట్లు భారత్ ప్రకటించింది.
దాదాపు ఏడేళ్ల తర్వాత ప్రధాని మోడీ చైనాకు వెళ్తున్నారు. ఆగస్టు 29న జపాన్‌కు వెళ్తారు ప్రధాని మోదీ. ఆ దేశ పర్యటన ముగించుకున్న తర్వాత ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ ఒకటి వరకు జరగనున్న SCO శిఖరాగ్ర సమావేశానికి చైనాలోని టియాంజిన్ సిటీకి వెళ్లనున్నారు.
ఈ నేపథ్యంలో చైనా అధ్యక్షుడు-భారత్ ప్రధాని మధ్య చర్చలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. అంతేకాదు అమెరికాను ఎదుర్కొనే భారత్-చైనాకు సరైన అవకాశం దక్కిందని అంటున్నాయి అంతర్జాతీయ విశ్లేషకులు.