Operation Brahma: భూకంపాలతో అతలాకుతలం అవుతున్న మయన్మార్ దేశాన్ని తన వంతు సాయం చేసేందుకు భారత ప్రభుత్వం ముందుకొచ్చింది. వరుస భూకంపాలతో విలవిల్లాడుతోన్న మయన్మార్ కు భారీ ఎత్తున సహాయ సహకారాలు చేసేందుకు రెడీ అయ్యింది. ఇందు కోసం చేసే సహాయక చర్యలకు గానూ మోదీ ప్రభుత్వం ఆపరేషన్ బ్రహ్మ అని నామకరణం చేసింది.
మయన్మార్‌కు 15 టన్నుల సహాయ సామగ్రి..
ఇవాళ ఉదయం 15 టన్నుల సహాయ సామగ్రిని పంపినట్టు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ చెప్పారు. కాసేపట్లో మరో 2 వాయు సేన విమానాల్లో సహాయ సామాగ్రి తరలించనున్నారు. మయన్మార్ దేశ రాజధానికి 80 మందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందం తరలించారు. భూకంప శిథిలాల్లో చిక్కుకున్నవారిని రక్షించడంలో భారత్ NDRF బృందాలు సహాయం చేయనున్నాయి. మయన్మార్ దేశానికి భారత్ పంపిన సహాయ సామగ్రిలో దుప్పట్లు, ఆహార పదార్థాలు, వాటర్ ప్యూరిఫైయర్స్, హైజీన్ కిట్స్, టెంట్లు, స్లీపింగ్ బ్యాగులు, సోలార్ ల్యాంప్స్, జనరేటర్ సెట్లు, తదితర వంటి కీలకమైన రోజువారీ అవసరాలతో కూడిన సహాయ సామగ్రి ఉంది. వీటిని బాధిత మయన్మార్ దేశానికి తరలించేందుకు ఐఏఎఫ్‌సీ 130 జే విమానం బయలుదేరి వెళ్లినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
మృతుల సంఖ్య 10వేలు దాటే అవకాశం..
మయన్మార్ దేశంలో రిక్టర్ స్ కేల్ పై భూకంప తీవ్రత 7.7 నమోదైన విషయం తెలిసిందే. భూకంపం ధాటికి మయన్మార్ చిగురుటాకులా వణికిపోతుంది. ఇప్పటి వరకు వెయ్యి మందికి పైగా మరణించారని.. 2000కు పైగా గాయపడ్డారు. అయితే మయన్మార్ మృతుల సంఖ్య 10 వేలు దాటే అవకాశం ఉందని అమెరికా ఏజెన్సీ అంచనా వేసింది. ఇప్పటికే మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండడం మయన్మార్ దేశాన్ని ఆందోళన కలిగిస్తోంది.
భూకంప తీవ్రతకు చాలా ప్రాంతాల్లో పెద్ద పెద్ద భవనాలు నేలమట్టం కాగా.. ఆ శిథిలాల కింద వేల మంది చిక్కుకోవడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందంటున్నారు. మృతదేహాలను వెలికితీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మయన్మార్ దేశ రాజధాని న్యేఫిడాలో వెయ్యి పడకల ఆస్పత్రి, మాండలే నగరంలో ఐకానిక్ వంతెనతో పాటుగా పలు ప్రాంతాల్లో ఉన్న ఎత్తైన ఆలయాలు, గోపురాలు భూకంప తీవ్రతకు నేలమట్టం అయ్యాయి. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం: ప్రధాని మోదీ
థాయ్‌లాండ్, మయన్మార్ విధ్వంసకరమైన భూకంపం సంభవించడంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ రెండు దేశాలకు ఎలాంటి సాయమైనా చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు భారత అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చామని అన్నారు. థాయ్‌లాండ్, మయన్మార్ ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతూ ఉండాలని విదేశీ వ్యవహారాల శాఖను కోరామని ప్రధాని వెల్లడించారు. రెండు దేశాల్లోనూ భూకంపం తర్వాత పరిస్థితి గురించి ఆందోళన చెందుతున్నానని చెప్పారు. ప్రతి ఒక్కరి క్షేమం, రక్షణ గురించి ప్రార్థిస్తున్నానని చెప్పుకొచ్చారు.
భారత పౌరులు ఈ నంబర్ కు సంప్రదించండి..
యాంగోన్‌లోని భారత రాయబార కార్యాలయం ఈ రోజు మయన్మార్ అధికారులతో కలిసి సాయం చేసేందుకు సమన్వయం చేస్తున్నట్లు తెలిపింది. యాంగోన్ లోని భారత రాయబార కార్యాలయం ఈ విధంగా ట్వీట్ చేసింది. ‘మయన్మార్ లో భూకంపం సంభవించిన తర్వాత భారతదేశం నుంచి వచ్చిన సహాయ సామాగ్రిని త్వరితగతిన అందజేయడానికి మేము మయన్మార్ అధికారులతో కలిసి పని చేస్తున్నాం. మేము భారతీయ పౌరులతో కూడా నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాము. శిథిలాల మధ్య చిక్కుకున్న భారతీయులు ఎవరైనా ఉంటే +95-95419602 నంబర్ సంప్రందించాలి’ అని ఎక్స్ లో పోస్ట్ చేసింది.