Iran and Hezbollah attack on Israel imminent Blinken tells G7: Report: ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య గత కొంతకాలంగా ఉద్రిక్తతలు పెరుగుతూనే ఉన్నాయి. రాజీపడే ధోరణే కనిపించడం లేదు. ఎప్పుడు ఏ దేశం దాడులు చేస్తుందో తెలియని పరిస్థితి. ఇద్దరి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతూనే ఉంది. అయితే ఇజ్రాయెల్ దేశ రక్షణ కోసం భారీగా నిధులు సమకూరుస్తోంది. ఈ విషయంలో ఇరాన్ దేశం కన్నా రెండింతలు ఎక్కువే. ఇక ఇజ్రాయెల్ లో సైనిక యుద్ధ విమానాలు మూడువందల నలభై దాకా ఉన్నట్లు సమాచారం. అలాగే సుదూర ప్రాంతాల నుంచి లక్ష్యాలను ఛేదించే ఎఫ్ 15, 35 వంటి శత్రుదుర్భేద్య అధునాతన విమానాలు ఉన్నాయి.
తగ్గేదే లేదంటున్న ఇరాన్
ఇరాన్ దేశానికి కూడా ఇంచుమించు ఇజ్రాయెల్ తో సమానమైన 320 యుద్ధ విమానాలు ఉన్నట్లు సమాచారం. అయితే ఇజ్రాయెల్ దేశానికి ఉన్న అత్యాధునిక విమానాలు మాత్రం లేవు. ఇంకా ఇరాన్ లో 1960 మోడల్ కు చెందిన జెట్స్ లాంటి యుద్ధ విమానాలు మాత్రమే ఉన్నాయని తెలుస్తోంది. ఇరాన్ కు రెండు వేల కిలోమీటర్లకు పైగా దూర ప్రాంతంలోఇజ్రాయెల్ దేశం ఉంది. జనాభా పరంగా చూసుకుంటే ఇజ్రాయెల్ కన్నా ఇరాన్ లో జనాభాయే ఎక్కువ. ఇక ఇజ్రాయెల్ లో లక్షా డెబ్బైవేలు సైనిక బలం ఉంది. ఇరాన్లో దాదాపు ఆరు లక్షల మంది సైనిక బలం ఉన్నట్లు సమాచారం.
అమెరికా కీలక సమాచారం
ఇలాంటి పరిస్థితిలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఓ కీలక సమాచారం బహిర్గతం చేశారు. ఏక్షణమైనా ఇరాన్ రహస్య యుద్ధ విమానాలు ఇజ్రాయెల్ పై దాడులు జరపొచ్చని..ఆ దేశాన్ని అప్రమత్తంగా ఉండాలని..అందుకు సంబంధించి తమ వద్ద పక్కా సమాచారం ఉందని అంటున్నారు. అయితే ఇరాన్ దాడి చేసేదాకా తాము చేతులు కట్టుకుని కూర్చోబోమని అంతకన్నా ముందుగానే తామే ఇరాన్ పై దాడి చేస్తామని ఇజ్రాయెల్ మీడియాలో వార్తా కథనాలు వస్తున్నాయి.
ఇటీవల ఇజ్రాయెల్ అధినేత బెంజమిన్ నెతన్యాహు ఓ కీలక సమావేశం నిర్వహించారు. ఇరాన్ దాడులను ఎలా ఎదుర్కోవాలో తమ సైనికులను ఎలా సంసిద్ధం చేయాలో ఆ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.