Iran Mohammed Bagheri| పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ రగులుతున్నాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ శుక్రవారం తెల్లవారుజామున వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇరాన్ సైనిక దళాల చీఫ్ మొహమ్మద్ బాఘెరీ మరణించినట్లు ఇరాన్‌కు చెందిన ఫార్స్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వ మీడియా సంస్థ ఐఆర్ఎన్ కూడా ధ్రువీకరించింది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ కు చెందిన అగ్ర న్యూక్లియర్ శాస్త్రవేత్తలు, సైనిక సీనియర్ జనరల్స్, రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) చీఫ్ హొస్సేన్ సలామీ కూడా మరణించారు.
ఇరాన్ మిలిటరీలో అత్యున్నత పదవిలో ఉన్న మొహమ్మద్ బాఘెరీ టెహ్రాన్‌లో 1958–1960 మధ్య జన్మించారు. ఆయన ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC)లో సీనియర్ అధికారిగా ఉన్నారు. 2016 నుంచి ఇరాన్ సైనిక దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా, అంటే దేశంలో అత్యున్నత సైనిక పదవిలో ఉన్నారు. సైనిక గూఢచర్య నిపుణుడైన బాఘెరీ 1980లో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్‌లో చేరి.. ఇరాన్-ఇరాక్ యుద్ధం (1980–1988)లో పోరాడారు. ఆయన పొలిటికల్ జియోగ్రఫీలో పీహెచ్‌డీ పట్టా పొందారు. ఇరాన్‌లోని సుప్రీం నేషనల్ డిఫెన్స్ యూనివర్సిటీలో బోధించేవారు. 2022–2023లో మహ్సా అమినీ నిరసనల సమయంలో మానవ హక్కుల ఉల్లంఘనల ఆరోపణలతో అమెరికా, కెనడా, యూకే, యూరోపియన్ యూనియన్ ఆయనపై ఆంక్షలు విధించాయి.
ప్రతీకారం తీర్చుకుంటాం
ఇజ్రాయెల్ చేసిన దాడులకు తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని.. కోలుకోలేని దెబ్బకొడతామని ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ ప్రకటించారు. టెల్ అవీవ్‌కు తీవ్ర శిక్ష విధిస్తామని హెచ్చరించారు. ఇజ్రాయెల్ మొదట టెహ్రాన్‌పై దాడులు చేసి, ఆ తర్వాత శుక్రవారం ఉదయం రెండో దశ దాడులు ప్రారంభించింది. ఇరాన్‌లోని న్యూక్లియర్ ప్లాంట్, సైనిక స్థావరాలు లక్ష్యంగా ఉన్నాయి. ఇప్పటివరకు ఐదు విడతలుగా దాడులు జరిగాయి.
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్‌లోని నతంజ్ అణుశుద్ధి కేంద్రం ధ్వంసమైనట్లు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) ప్రకటించింది. ఐఎఈఏ (IAEA) చీఫ్ గ్రోసీ ఎక్స్‌లో ఇలా పోస్ట్ చేశారు. “ఈ పరిణామాలు ఆందోళనకరంగా ఉన్నాయి. ఇరాన్‌లో పరిస్థితిని గమనిస్తున్నాం. రేడియేషన్ లీకేజీపై సమాచారం కోసం ఇరాన్ అధికారులతో సంప్రదిస్తున్నాం” అని పేర్కొన్నారు.
ఇరాన్ గుండెలపై తన్నాం
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఈ దాడులను ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’గా పేర్కొన్నారు. “ఇరాన్ అణు కార్యక్రమానికి గుండె లాంటి నతంజ్ కేంద్రాన్ని ధ్వంసం చేశాం. ఇరాన్ దశాబ్దాలుగా ఇజ్రాయెల్‌ను నాశనం చేస్తామని బెదిరిస్తోంది. వారు అణ్వాయుధాలు తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల ఇరాన్ పెద్ద మొత్తంలో శుద్ధి చేసిన యురేనియం ఉత్పత్తి చేసింది, దాంతో 9 అణుబాంబులు తయారు చేయొచ్చు” అని నెతన్యాహు తెలిపారు.
“ఇరాన్ ఇటీవల దూకుడు చర్యలు పెంచింది. ఇప్పుడు ఆపకపోతే, త్వరలోనే అణ్వాయుధాలు తయారు చేస్తుంది. ఇది ఇజ్రాయెల్ ఉనికికి పెను ముప్పు. నాజీ హోలోకాస్ట్ నుంచి మేం పాఠాలు నేర్చుకున్నాం. మళ్లీ బాధితులుగా ఉండాలనుకోవడం లేదు. ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమంపై దెబ్బ కొట్టాం. నతంజ్ కేంద్రం, అణు శాస్త్రవేత్తలు, బాలిస్టిక్ క్షిపణి కేంద్రాలను టార్గెట్ చేసుకునే దాడులు చేశాం” అని నెతన్యాహు స్పష్టం చేశారు. ఇరాన్ గతంలో తమపై దాడులకు ప్రయత్నించిందని, ఇప్పుడు కొత్త పథకం సిద్ధం చేస్తోందని నెతన్యాహు ఆరోపించారు. “మా పోరాటం ఇరాన్ ప్రభుత్వంపైనే, ప్రజలపై కాదు” అని తెలిపారు.
మాకు మరో మార్గం లేదు: ఇజ్రాయెల్ అధికారి
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ చీఫ్ జమీర్ మాట్లాడుతూ.. “మాకు మరో మార్గం లేదు. ఇరాన్ ముప్పును ఎదుర్కొనేందుకు ఈ దాడులు చేశాము. మా అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి పోరాడుతాం” అని చెప్పారు. ఈ దాడుల కారణంగా ఇరాన్ గగనతలాన్ని మూసివేసి, విమాన రాకపోకలను నిలిపివేసింది. టెహ్రాన్‌లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు.
Also Read: బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ తయారీలో లోపాలు.. 2024లోనే హెచ్చరించిన ఇంజినీర్
భారతీయులకు ఎంబసీ హెచ్చరిక
ఇరాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్‌లోని భారత ఎంబసీలు భారతీయులకు అడ్వైజరీ జారీ చేశాయి. అనవసర ప్రయాణాలు చేయవద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించాయి. స్థానిక అధికారుల సూచనలు పాటించాలని, ఎంబసీ సోషల్ మీడియా ద్వారా సమాచారం తెలుసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని కోరాయి.