Iran Hijab Protest| ఇరాన్ దేశంలో మహిళలు బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా హిజాబ్ లేదా బుర్కా ధరించాలి. కానీ ఈ నియమాన్ని పాటించేందుకు కొంత మంది మహిళలు నిరాకరిస్తున్నారు. గత కొంత కాలంగా ఇరాన్ దేశంలో హిజాబ్ ను వ్యతిరేకించే మహిళల సంఖ్య ఎక్కువవుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం అలాంటి మహిళల కోసం ప్రత్యేక ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వం ప్రకటన ప్రకారం.. ఈ ఆస్పత్రుల్లో హిజాబ్ ను వ్యతిరేకించే మహిళలకు మానసిక చికిత్సతో పాటు హిజాబ్ ప్రాముఖ్యత, శాస్త్రీయంగా దాని లాభాల గురించి కౌన్సెలింగ్ ఇస్తారు. కానీ నిజానికి హిజాబ్ కు వ్యతిరేకంగా నిరసనలు చేసే మహిళలను బంధించే పిచ్చాస్పుత్రులివి అని మానవ హక్కుల సంఘాలు విమర్శలు చేస్తున్నాయి.
ఇరాన్ ప్రభుత్వంలో మహిళా, కుటుంబ మంత్రిత్వశాఖ ఛీప్ మెహ్రీ తాలేబి దరేస్తానీ ఈ విషయంపై స్పందిస్తూ.. “ప్రభుత్వం హిజాబ్ ని వ్యతిరేకించే మహిళల కోసం కొత్త ఆస్పత్రిని ఏర్పాటు చేసింది. ఈ ఆస్పత్రిలో హిజాబ్ ధరించడానికి ఇష్టపడని వారికి మానసిక చికిత్స అందిచడం జరుగుతుంది. ముఖ్యంగా టీనేజ్ అమ్మాయిలు, యువతులు, మహిళలకు ఇస్లాం నియమాలు పాటించడం ఎంత అవసరమో వారికి తెలియజేయడం జరుగుతుంది.: అని తెలిపారు.
ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే ఈ మహిళ, కుటుంబ మంత్రిత్వశాఖ ప్రత్యక్షంగా ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ పర్యవేక్షణలో నడుస్తోంది. ఈ మంత్రిత్వశాఖ ఇరాన్ సమాజంలో ఇస్లాం పద్థతులను, నియమాలను కఠినంగా అమలుపరుస్తుంది. ఇందులో భాగంగానే మహిళల వేషధారణపై ఇప్పుడు నిఘా పెంచింది.
హిజాబ్ పట్ల తీవ్ర వ్యతిరేకత
రెండు వారాల క్రితం ఇరాన్ రాజధాని టెహ్రాన్ లోని ఇస్లామిక్ యూనివర్సిటీలో చదువుకునే ఒక మహిళా విద్యార్థి హిజాబ్ ధరించడానికి నిరాకరించింది. దీంతో ఆమెకు యూనివర్సిటీలో అనుమతించలేదు. ఆ తరువాత హిజాబ్ కు వ్యతిరేకంగా యూనివర్సిటీ ఎంట్రెన్స్ వద్ద ఆమె అర్ధనగ్న ప్రదర్శన చేసింది. సివిల్ డ్రెస్సులో ఇరాన్ మోరల్ పోలీసులు అక్కడికి చేరుకొని ఆమెను అక్కడి నుంచి ఒక కారులో తీసుకెళ్లారు. ఆ తరువాత నుంచి ఆమె ఆచూకీ ఎవరికీ తెలియలేదు. ఈ ఘటన జరిగి రెండు వారలైంది. ఆమెను ఒక మెంటల్ ఆస్పత్రిలోకి తీసుకెళ్లారని ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో తాజాగా హిజాబ్ ను వ్యతిరేకించే మహిళల కోసం మానసిక చికిత్స అందించడానికి ఒక ఆస్పత్రి గురించి ప్రభుత్వం ప్రకటించడం యూనివర్సిటీ వద్ద నిరసన చేసిన మహిళ నిజంగానే పిచ్చాసుపత్రికి తీసుకెళ్లబడిందనే విషయం స్పష్టమైంది.
Also Read: హిందువుల భద్రత కోసం 70000 డాలర్లు డిమాండ్ చేసిన కెనడా పోలీసులు
దీనిపై రాజధాని టెహ్రాన్ నగరంలో నివసించే ఒక మహిళ మండిపడింది. ‘వుమన్, లైఫ్, ఫ్రీడం’ అనే మహిళా హక్కుల గ్రూపునకు చెందిన ఆమె మాట్లాడుతూ.. “మహిళలకు స్వాతంత్ర్యం లేదా? వారి ఇష్టానుసారం జీవించే హక్కు వారికి లేదా?.. ఈ కొత్త ఆస్పత్రి ఒక జైలు లాంటిది. అక్కడ ఎలాంటి చికిత్స అందించరు. కఠినంగా, క్రూరంగా శిక్షలు మాత్రమే ఉంటాయి. ఇక్కడ మేమంతా సరైన సంపాదన లేక కుటుంబ పోషణ భారమవుతోందని ఎన్నో కష్టాలు పడుతున్నాం. ప్రభుత్వం మా ఇళ్లకు సరిగా కరెంటు సరఫరా కూడా చేయలేకబోతోంది. కానీ ఇవ్వన్నీ వారికి పట్టవు. కానీ మా ముఖం దాచుకోవాలని మాత్రం ఆదేశిస్తోంది. ఈ నియమాలకు వ్యతిరేకంగా నిరసన చేయాల్సిన సమయం ఇదే. లేకపోతే అందరినీ జైళ్లలో బంధిస్తారు.” అని ది గార్డియన్ పత్రికతో చెప్పింది.
ఇరాన్ లోని మానవ హక్కుల లాయర్, హొస్సెయిన్ రయీసీ.. ఇరాన్ ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఈ హిజాబ్ నియయాలు ఇస్లాంలో లేవని.. ఇరాన్ చట్టాలలో దీని గురించి ప్రస్తాన లేదని తెలిపారు.
ఇరాన్ మానవ హక్కుల కార్యకర్తలు ప్రభుత్వం కొత్తగా హిజాబ్ క్లినిక్ ఏర్పాటు చేయడంపై మండిపడ్డాయి. మహిళలను మానసికంగా హింసించడానికే ఈ హిజాబ్ క్లినిక్ ని ఇరాన్ శాసకులు నడుపుతున్నారని అన్నారు.
లండన్ లో నివసించే సీమా సబేట్ అనే ఇరాన్ జర్నలిస్ట్ ది గార్డియన్ పత్రికతో మాట్లాడుతూ.. “మహిళలకు మానసిక చికిత్స పేరుతో జైలులో బంధించడం చాలా క్రూరమైన చర్య. సమాజంలో మహిళలను అణచివేసే ఉద్దేశంతోనే ఈ హిజాబ్ క్లినిక్ ని ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది చాలా సిగ్గుపడాల్సిన చర్య ” అని అన్నారు. ఇరాన్ లో ఇస్లాం నియమాలకు వ్యతిరేకంగా గతంలో పోరాటం చేసిన సీమా సబేట్ పై హత్యాయత్నం కూడా జరిగింది. దీంతో ఆమె ఇరాన్ వదిలి లండన్ వలస వెళ్లారు.
ఇరాన్ లో హిజాబ్ కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న సినిమా కళాకారులు.. అఫ్సానెహ్ బాయెగాన్, అజాదెహ్ సమాది, లేలా బోలాకాత్.. వీరందరికీ కోర్టు నుంచి నోటీసులు అందాయి. అందరూ హిజాబ్ క్లినిక్ కు వారానికి ఒకసారి వచ్చి చికిత్స తీసుకోవాలని ఆ నోటీసులో కోర్టు ఆదేశాలు జారీ చేసింది. చికిత్స పూర్తి చేసి హిజాబ్ క్లినిక్ నుంచి సర్టిఫికేట్ కూడా తీసుకొని కోర్టులో సమర్పించాలని కూడా ఆ నోటిసుల్లో కోర్టు పేర్కొంది.
సెప్టెంబర్ 2022లో హిజాబ్‌ను వ్యతిరేకించిన మహ్సా అమిని అనే యువతిని పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఆ తరువాత ఆమె పోలీస్ కస్టడీలో చనిపోయినట్లు తెలిసింది.