Missile City : అమెరికా, టెహ్రాన్ మధ్య ఉద్రిక్తతలు ఎక్కువవుతున్న తరుణంలో ఇరాన్ తమ అణు కేంద్రాలపై సైనిక దాడిని ప్రారంభించడంలో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుకు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహాయం చేయవచ్చని ఇరాన్ అధికారులు ఆందోళన చెందుతున్నారు.
ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో, అమెరికా-ఇరాన్ సంబంధాలు గణనీయంగా క్షీణించాయి, ట్రంప్ అణు ఒప్పందం నుండి వైదొలిగి ఇరాన్‌పై కఠినమైన ఆంక్షలు విధించారు. నెతన్యాహుతో సమన్వయంతో ట్రంప్ సైనిక చర్యకు దారితీసే చర్యలు తీసుకోవచ్చని, ఇరాన్ అణు మౌలిక సదుపాయాలు, ఇతర కీలక ప్రదేశాలను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని ఇరాన్ అధికారులు భయపడుతున్నారు. అలాంటి ముప్పును ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగానే ఉన్నామంటూ.. తమ ఆయుధ సంపత్తిని ప్రదర్శించింది ఇరాన్.
Iran is responding to external threats by releasing a new video showcasing one of its underground missile tunnel systems, packed with missile engines, mobile launchers, and a range of advanced weaponry. The footage prominently features the Paveh cruise missile, the Ghadr-380… pic.twitter.com/ILsdlrPtQy
— Basha باشا (@BashaReport) March 25, 2025
రివల్యూషనరీ గార్డ్ కమాండర్ జనరల్ హోస్సేన్ సలామీ సైనిక విన్యాసాల సందర్భంగా రహస్య స్థావరాన్ని సందర్శించినట్లు ఆ దేశం ప్రకటించింది. ఈ మేరకు 85 సెకన్లతో ఓ వీడియోను విడుదల చేయగా.. అందులో ఇరాన్ సొరంగంలో నిర్మించిన తన ఆయుధాగారాన్ని ప్రపంచానికి చూపించింది. ఇందులో.. దీర్ఘ-శ్రేణి క్షిపణులతో సహా అన్ని రకాల ఆయుధాలను నిల్వ చేసేందుకు వీలు కల్పించే భూగర్భ సొరంగాన్ని చూపించారు. నిఘా వర్గాల సమాచారం మేరకు ఈ స్థావరం పెర్షియన్ గల్ఫ్‌లో ఎక్కడో 500 మీటర్ల భూగర్భంలో ఉందని అనుమానిస్తున్నారు. క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించినా.. ఈ స్థావరాన్ని చేరుకోవడం కానీ, దీన్ని చేధించడం కానీ వీలవదని అంటున్నారు.
సొరంగాన్ని పేల్చేయొచ్చు
అమెరికా, ఇజ్రాయెల్ వద్ద ఉన్న ఆయుధాలతో పోల్చితే.. ఇరాన్ 500 మీటర్ల లోతులో నిర్మించుకున్న క్షిపణి స్థావరం మరీ దుర్భేధ్యమైనది ఏం కాదని నిపుణులు అంటున్నారు. అయితే.. యుద్ధాల్లో వినియోగించే మెజార్టీ ఆయుధాలకు అందకుండా.. ఇరాన్ జాగ్రత్తపడిందని నిపుణులు అంటున్నారు. ఈ స్థావరాన్ని వైమానిక దాడులు లేదా సాధారణ యుద్ధాల్లో వినియోగించే విధ్వసక కలిగించే క్రూయిజ్ క్షిపణులు వంటి సాధారణ ఆయుధాల నుంచి కొంత రక్షణను అందిస్తుందని, అంత మాత్రన దీనిని ఎవరూ చేధించలేదనుకోవడం అమాయకత్వమే అవుతుందని అంటున్నారు. ఇలాంటి లోతైన, దృఢమైన నిర్మాణాల్ని సైతం సులువుగా చేధించే, నాశనం చేసే ఆయుధాలు ఆమెరికా, ఇజ్రాయిల్ వంటి ఇరాన్ శత్రు దేశాల దగ్గర ఉన్నాయని చెబుతున్నారు. ఈ రెండు దేశాలు ప్రత్యేకంగా భూమిలోకి చొచ్చుకుపోయి, లోతైన భూగర్భ సౌకర్యాలను లక్ష్యంగా చేసుకునేలా రూపొందించిన ఆయుధాలున్నాయని చెబుతున్నారు.
ఆమెరికా దగ్గర US MOAB అనే బాంబు ఉంది. దీనిని మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అని పిలుస్తారు, ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అణ్వాయుధేతర బాంబు. దాని శక్తివంతమైన షాక్‌వేవ్ కారణంగా ఇది భూగర్భంలో ఉన్న నిర్మాణాలను నాశనం చేయగలదు. అలాగే.. US వైమానిక దళం ఉపయోగించే GBU-28 వంటి బంకర్ బస్టర్లు, వందల మీటర్ల భూగర్భంలో ఉన్న నిర్మాణాలు సహా లోతైన బంకర్లలోకి చొచ్చుకుపోయేలా ప్రత్యేకంగా రూపొందించారు.
ఈ నెల ప్రారంభంలో ఇరాన్ రెండు నెలల పాటు కొనసాగే సైనిక విన్యాసాలను ప్రారంభించింది. ఇందులో రివల్యూషనరీ గార్డ్ నాటాంజ్‌లోని తన అణు సౌకర్యాలపై క్షిపణి, డ్రోన్ దాడుల నుండి రక్షించే కసరత్తులు కూడా ఉన్నాయి. ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఇజ్రాయెల్‌తో పెరుగుతున్న ఉద్రిక్తతలు, టెహ్రాన్‌పై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్న డొనాల్డ్ ట్రంప్ ప్రభావంతో తన సామర్థ్యాన్ని చూపించుకునే ప్రయత్నం చేస్తోంది.
Also Read : US Houthi War Plans Leaked: అమెరికా యుద్ధ ప్రణాళికలు మీడియాకు లీక్.. ట్రంప్ యంత్రాంగం నిర్లక్ష్యమే కారణం
ఈ భూగర్భ క్షిపణి స్థావరాలు ఇరాన్ తన రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసుకోవడానికి, ఈ ప్రాంతంలో తన ప్రయోజనాలను కాపాడుకోవడానికి తన సంసిద్ధతను ప్రదర్శించే వ్యూహంలో భాగం అంటున్నారు అంతర్జాతీయ నిపుణులు. భూగర్భ సౌకర్యాలలో క్షిపణి వ్యవస్థలు, డ్రోన్‌లను మోహరించడం ఇరాన్‌కు వ్యూహాత్మక ప్రయోజనాన్ని అందిస్తుంది. దీని వలన ఈ ఆస్తులను నాశనం చేయడం మరింత కష్టతరం అవుతుందని, సాయుధ దళాల సైతం సులువుగా ఆయుధాలను సమయానికి పొందగలుగుతాయని చెబుతున్నారు.