Canada Cuts Starlink Deal| అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అధికారంలోకి వచ్చిన తర్వాత, మిత్రులు, శత్రువులు అని తేడా లేకుండా అందరిపైనా సుంకాలు విధించడం ప్రారంభించారు. ఇప్పుడు పొరుగు దేశమైన కెనెడా (Canada) పైనా 25 శాతం టారిఫ్ విధించారు. దీనికి ప్రతిస్పందనగా కెనెడా నుంచి తీవ్రమైన ప్రతిచర్యలు వచ్చాయి. యుఎస్ పై ఒంటారియో ప్రీమియర్ డగ్ ఫోర్డ్ (Doug Ford) తీవ్ర హెచ్చరికలు చేశారు. ఎలాన్ మస్క్ (Elon Musk) నేతృత్వంలోని స్టార్లింక్ (Starlink)తో ఉన్న 100 మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
కెనెడా పై ట్రంప్ విధించిన 25 శాతం సుంకాలు మంగళవారం నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో కెనెడా ఇంధన ఎగుమతులపై 10 శాతం టారిఫ్ ఉంది. ఈ నిర్ణయాలు కెనెడా నేతలను తీవ్ర ఆగ్రహానికి గురిచేశాయి. తాము ఆర్థికంగా దెబ్బతింటున్నామని చూస్తూ కూర్చోబోమని డగ్ ఫోర్డ్ స్పష్టం చేశారు. ‘‘వారు ఒంటారియోను ధ్వంసం చేస్తుంటే.. చూస్తూ ఊరుకోను. చిరునవ్వుతోనే చేయాల్సిందంతా చేస్తాను. కరెంట్ కోతలు విధిస్తాను. ఒంటారియోతో స్టార్లింక్ కు ఉన్న 100 మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని రద్దు చేస్తున్నాను. అది పూర్తయింది. ఆయన (ట్రంప్ ను ఉద్దేశించి) కెనెడా ప్రజలను తక్కువ అంచనా వేస్తున్నారు. మా స్టోర్ల నుంచి యుఎస్ ఆల్కహాల్ ను తొలగించాలని యోచిస్తున్నాం’’ అని ఫోర్డ్ వెల్లడించారు.
అమెరికాకు అత్యధిక ఇంధన ఎగుమతులు కెనెడా నుంచే వెళ్తున్నాయి. కెనెడాకు చెందిన ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులు, హైడ్రోపవర్, సహజ వాయువు, ఎలక్ట్రిసిటీ పై యుఎస్ ఆధారపడింది. ‘‘వారు మా ఇంధనంపై ఆధారపడ్డారు. వాళ్లు కూడా నొప్పి భరించాలి’’ అని ఫోర్డ్ వ్యాఖ్యలు చేశారు. చిరకాల మిత్ర దేశంపై ట్రంప్ అసలు సుంకాలు ఎందుకు విధిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ‘‘సన్నిహిత మిత్రులు, పొరుగువారిపై ఎందుకు దాడి చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. కెనెడా పై సుంకం అంటే అమెరికన్ల పై పన్ను విధించడం కిందికే వస్తుంది’’ అన్నారు. ఇక, స్టార్లింక్ ఒప్పందం కింద తొలుత 15 వేల ఇళ్లు, వాణిజ్య సముదాయాలకు ఇంటర్నెట్ సదుపాయం అందించాల్సి ఉంది.
Also Read: అమెరికాకు సాయం చేసేందుకు పుతిన్ సిద్ధం – బలపడుతున్న రష్యా-అమెరికా బంధం
కెనెడా ఆర్థిక వ్యవస్థను కూల్చడానికే ట్రంప్ సుంకాలు : ట్రూడో
ట్రంప్ (Donald Trump) కెనెడా పై విధించిన సుంకాలు (US Tariffs) మంగళవారం నుంచి అమల్లోకి వచ్చాయి. సుంకాలపై కెనెడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) మండిపడ్డారు.. కెనెడా ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చేందుకు ఇలాంటి చర్యలు తీసుకున్నారని ట్రంప్ పై విమర్శలు చేశారు.
‘కెనెడా (Canada) పై అమెరికా (USA) వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించింది. వారి సన్నిహిత భాగస్వాములతో సానుకూలంగా వ్యవహరించేందుకే ట్రంప్ ఈ చర్యలు తీసుకున్నారు. కెనెడా ఆర్థిక వ్యవస్థ పతనాన్ని ట్రంప్ చూడాలనుకుంటున్నారు. ఎందుకంటే అమెరికాలో కెనెడాను 51వ రాష్ట్రంగా చేర్చుకోవాలని కుట్రలో భాగంగానే ఇది వచ్చింది. కానీ, అది ఎప్పటికీ జరగదు. నేను ట్రంప్ తో నేరుగా మాట్లాడాలనుకుంటున్నాను. ఆయన తెలివైన వ్యక్తి అయినప్పటికీ.. ఇది చాలా మూర్ఖమైన చర్య. ఫెంటనిల్ డ్రగ్ పై ఆయన చేసే వాదనలు అబద్ధం. ఆయన నిర్ణయం ఇరు దేశాల ప్రజలను బాధపెడుతోంది’ అని ట్రూడో పేర్కొన్నారు. అంతకు ముందు ట్రూడోను ‘కెనెడా గవర్నర్’ అంటూ ట్రంప్ వ్యంగ్యంగా పేర్కొన్నారు. ‘దయచేసి కెనెడా గవర్నర్ ట్రూడోకు వివరించండి. ఆయన అమెరికా పై ప్రతీకార సుంకాన్ని విధిస్తే.. అదే స్థాయిలో మేము విధించే సుంకాలు పెరుగుతాయి’ అని ట్రంప్ ట్విట్టర్ లో రాసుకొచ్చారు.
డొనాల్డ్ ట్రంప్ కెనెడా, మెక్సికో పై 25% సుంకాలు విధించే ఆర్డర్లపై సంతకం చేశారు. వలసలు, డ్రగ్స్ అక్రమ రవాణాను నిరోధించడంలో విఫలమైతే.. కెనెడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా చేర్చాలని ట్రంప్ హెచ్చరించారు. తదనంతరం, మెక్సికో, కెనెడా సరిహద్దు భద్రతను బలోపేతం చేస్తామని హామీ ఇవ్వడంతో, టారిఫ్‌ల అమలును ఒక నెల పాటు నిలిపివేశారు. అయితే తాజాగా విధించిన సుంకాలు మార్చి 4 నుంచి అమలులోకి వచ్చాయి. దీనికి ప్రతిస్పందనగా, కెనెడా ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా అమెరికా నుంచి దిగుమతి అయ్యే 107 బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై 25% ప్రతీకార సుంకాలు విధించారు.