Greencard JD Vance| అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance) తాజాగా గ్రీన్‌కార్డుదారులకు అమెరికాలో శాశ్వతంగా ఉండే హక్కు లేదని వ్యాఖ్యానించారు. ఈ సమయంలో ట్రంప్ ప్రభుత్వం ఇమిగ్రేషన్ విధానాలపై చర్చలు జరుపుతున్నందున.. వాన్స్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
డొనాల్డ్ ట్రంప్ రెండవ పర్యాయం అమెరికా అధ్యక్షుడిగా అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆయన అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అమెరికాలోని అక్రమ వలసదారులను బహిష్కరించారు, వేల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులను తొలగించారు. ఇప్పుడు గ్రీన్‌కార్డు (ప్రజాసత్వం) విషయంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రీన్‌కార్డు పొందిన వ్యక్తులకు అమెరికాలో శాశ్వతంగా ఉండే హక్కు లేదని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలతో గ్రీన్‌కార్డు దారులు ఆందోళన చెందుతున్నారు.
Also Read: ఫెడరల్ ఉద్యోగుల తొలగింపు ఆదేశాలు చెల్లవు.. ట్రంప్, మస్క్‌లకు కోర్టులో ఎదురుదెబ్బ
ఒక మీడియా ఛానల్ ఇంటర్‌వ్యూలో వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్ మాట్లాడుతూ.. “అమెరికాలో శాశ్వతంగా ఉండేందుకు.. గ్రీన్‌కార్డు పొందినంత మాత్రాన వారికి హక్కు లేదు. ఇది వాక్ స్వేచ్ఛకు సంబంధించిన సమస్య కాదు, జాతీయ భద్రతకు సంబంధించిన విషయం. అమెరికా పౌరులుగా ఎవరిని మన సమాజంలో కలుపుకోవాలో మనమే నిర్ణయిస్తాం” అని ఆయన పేర్కొన్నారు.
అమెరికా చట్టాల ప్రకారం.. గ్రీన్‌కార్డు దారుల నుంచి కొన్ని సందర్భాల్లో ఆ కార్డును రద్దు చేయవచ్చు. నేరాలకు పాల్పడినా, సుదీర్ఘకాలం దేశంలో నివసించకపోయినా, లేదా వలస నిబంధనలను పాటించడంలో విఫలమైనా ఈ చర్య తీసుకోవచ్చు.
ఇప్పటికే గ్రీన్‌కార్డుకు ప్రత్యామ్నాయంగా ట్రంప్ “గోల్డ్ కార్డ్” విధానాన్ని ప్రకటించారు. దీనికోసం సుదీర్ఘకాలం వేచి ఉండాల్సిన అవసరం లేదు. 5 మిలియన్ డాలర్లు చెల్లించి ఈ కార్డును కొనుగోలు చేసి, అమెరికా పౌరసత్వం పొందవచ్చని ట్రంప్ ప్రభుత్వం తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంపన్నులు, ఎగ్జిక్యూటివ్‌లను ఆకర్షించడమే ఈ ప్లాన్ యొక్క లక్ష్యం.
అమెరికా గోల్డ్ కార్డు పొందాలంటే.. విదేశీ పౌరులు 5 మిలియన్ డాలర్లు (సుమారు 43 కోట్ల 46 లక్షల రూపాయలు) చెల్లించి.. అమెరికాలో నివసించే, పని చేసే హక్కును పొందవచ్చు. అమెరికా సమాజంలోకి ఎవరిని చేర్చుకోవాలో అమెరికన్లే నిర్ణయిస్తారని గోల్డ్ కార్డ్ ప్రకటన సందర్బంగా ట్రంప్ స్పష్టం చేశారు.
“భారత్, చైనా, లేదా జపాన్ వంటి దేశాల నుండి ఒక వ్యక్తి వస్తాడు. ఇక్కడ హార్వర్డ్ లేదా వార్టన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో చదువుతాడు. ఇక్కడి కంపెనీలు అతనికి జాబ్ ఆఫర్లు ఇస్తాయి. కానీ, అతను ఇక్కడ శాశ్వతంగా ఉంటాడో లేదో అనే హామీ లేదు” అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అదే సమయంలో, ప్రతిభావంతులైన విదేశీయుల కోసం కంపెనీలు గోల్డ్ కార్డును కొనుగోలు చేసి, వారిని దేశానికి తీసుకురావచ్చని సూచించారు. ఇప్పటికే అమెరికాలో అమల్లో ఉన్న EB-5 ఇమ్మిగ్రెంట్ ఇన్వెస్టర్ వీసాను ఈ కొత్త గోల్డ్ కార్డ్ భర్తీ చేయనుంది.
అమెరికా వర్క్ వీసాలను అత్యధికంగా పొందుతున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. అక్టోబర్ 2022 నుండి సెప్టెంబర్ 2023 వరకు జారీ చేసిన వర్క్ వీసాల్లో 72.3 శాతం భారతీయులకే ఇవ్వబడ్డాయి.