Keir Starmer Zelenskyy Mexico Trump | ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఓ నియంత అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీవ్రంగా విమర్శలు చేశారు. ఆయన నియంత కాబట్టే.. దేశంలో ఎన్నికలు నిర్వహించడం లేదని ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధినాయకుడికి బాసటగా బ్రిటన్ దేశం నిలబడింది. బ్రిటన్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ (Keir Starmer) జెలెన్‌స్కీకి ఫోన్ చేసి మద్దతు తెలిపారు.
‘‘జెలెన్‌స్కీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నేత. యుద్ధ సమయంలో ఎన్నికలు నిర్వహించకపోవడం సరైన చర్యే. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్ దేశంలో కూడా ఈ విధంగానే చేసింది. అప్పుడు ఎన్నికల నిర్వహించేలేదు. అది సమంజసమే. ఉక్రెయిన్‌లో శాంతిని నెలకొల్పేందుకు అమెరికా చేసే ప్రయత్నానికి మా మద్దతు ఉంటుంది. అలాగే భవిష్యత్తులో రష్యా దురాక్రమణలను అడ్డుకునేందుకు కూడా సిద్ధంగా ఉంటాం.’’ అని బ్రిటన్ ప్రధాని కార్యాలయం అధికారికంగా ఓ ప్రకటన జారీ చేసింది.
రష్యా తమ భూభాగాన్ని ఆక్రమించిందనే ఉక్రెయిన్ వాదనను ఇటీవల ట్రంప్ తప్పుబట్టారు. కాస్త భూమితో పోయేదాన్ని యుద్ధం వరకూ తీసుకొచ్చారని ఆరోపించారు. ఇప్పుడు ఎక్కువ భూమి సహా పెద్దసంఖ్యలో ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వచ్చిందని విమర్శించారు. జెలెన్‌స్కీ ఒక నియంత అని.. దేశంలో ఎన్నికలు జరపడం లేదని తీవ్రంగా ఆరోపణలు చేశారు. యుద్ధానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీనే కారణమని.. పోరు మొదలుకావడానికి ముందే సంధి చేసుకుని ఉండాల్సిందని అన్నారు. మూడేళ్లుగా ఆ పనిని ఎందుకు చేయలేదని మీడియాతో సమావేశంలో ప్రశ్నించారు.
Also Read: ట్రంప్ క్రూరత్వం – డేరియన్ అడవులకు అక్రమ వలసదారుల తరలింపు
అయితే అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన తరువాత ట్రంప్ అమెరికా మిత్ర దేశాలకు చుక్కలు చూపిస్తున్నారు. ఇప్పటికే పొరుగుదేశాలైన కెనెడా, మెక్సికోలపై సుంకాలు విధించి.. ప్రస్తుతానికి వాటిని నిలువరించారు. అలాగే నాటో కూటమిలోని యూరోప్ దేశాలు కూడా ట్రంప్ తీరుపై అసహనంగా ఉన్నాయి. ఉక్రెయిన్ యుద్ధంలో ట్రంప్ స్పష్టంగా రష్యా వైపు మొగ్గడంతో జెలెన్‌స్కీ ఇటీవలే అమెరికా లేని ప్రత్యేక యూరోప్ కూటమి సైన్యం వెంటనే ఏర్పాటు చేయాల్సి అవసరం ఉందని పిలుపునిచ్చారు. మరోవైపు కెనెడా ఆర్థిక మంత్రి, విదేశాంగ మంత్రి కూడా అమెరికాకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో తాజాగా మెక్సికో అధ్యక్షురాలు ధిక్కార స్వరం వినిపించారు.
ట్రంప్ బెదిరింపులకు భయపడేది లేదు.. మెక్సికో అధ్యక్షురాలి ధిక్కార స్వరం
పరస్పర సుంకాలు, వలసదారుల బహిష్కరణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేస్తున్న బెదిరింపులపై మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్‌బామ్ (Claudia Sheinbaum) తీవ్రంగా స్పందించారు. ట్రంప్ హెచ్చరికలకు భయపడుతున్నారా? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు.. అలాంటి వాటికి భయపడేది లేదని స్పష్టంచేశారు.
‘‘ట్రంప్ చేసే డ్రగ్స్ ముఠాల కట్టడికి మిలిటరీ జోక్యం, వలసదారుల బహిష్కరణ, పరస్పర సుంకాల బెదిరింపులకు నేను భయపడను. నేను ప్రజల మనిషిని. మెక్సికన్ ప్రజల మద్దతు ఉంది. మెక్సికో (Mexico) సార్వభౌమత్వానికి భంగం కలిగించే ప్రయత్నాన్ని ఎలాగైనా అడ్డుకుంటా’’ అని అన్నారు.
వైట్‌హౌజ్‌లోకి అడుగుపెట్టగానే.. అగ్రరాజ్యంలోకి ఫెంటానిల్ డ్రగ్ అక్రమ రవాణా, వలసదారుల చొరబాట్లను అడ్డుకోవడంలో కెనడా, మెక్సికోలు విఫలమయ్యాయని ట్రంప్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయా దేశాలపై 25 శాతం సుంకం విధిస్తానంటూ హెచ్చరించారు కూడా. అలాగే.. అధికారం చేపట్టిన కొన్ని రోజుల్లోనే సుంకాలు విధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. అయితే..
మెక్సికోపై ట్రంప్ విధించిన 25 శాతం సుంకాలను నెలరోజుల పాటు నిలిపివేసిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై చర్చలు జరిపేందుకు ఇరుదేశాల అధికారులు ఈ వారం వాషింగ్టన్‌లో భేటీ కానున్నట్లు తెలుస్తోంది.