Gurupatwant singh Pannun India Pakistan| పహల్గామ్‌లో జరిగిన మారణహోమం తరువాత ఇండియా, పాకిస్తాన్ మధ్య పరిస్థితులు రోజు రోజుకూ ఆందోళనకరంగా మారుతున్నాయి. ఇరు దేశాల మధ్య ఎప్పుడెప్పుడు ఏమి జరుగుతుందో అనే ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. భారత్ ఇప్పటికే తన బలగాలను అప్రమత్తంగా ఉంచింది. పాకిస్తాన్ లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద చేస్తున్న ఉల్లంఘన చర్యలకు అదే రీతిలో ప్రతిస్పందిస్తోంది. పాకిస్తాన్ ఏమైనా హద్దు దాటి వస్తే, భారత సైన్యం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంది. నౌకాదళం, వైమానిక దళం, భూ సైన్యం – అన్నీ తమ తమ స్థానాల్లో అప్రమత్తంగా ఉన్నాయి.
ఇలాంటి క్లిష్ట సమయంలో సిక్కుల ఖలిస్తాన్ ఉద్యమానికి మద్దతు పలుకుతున్న వేర్పాటువాది గుర్‌పత్వాంత్ సింగ్ పన్నూ ఒక వివాదాస్పద వీడియోను విడుదల చేశాడు. అందులో భారత సైన్యంలో సేవలందిస్తున్న సిక్కు మతానికి చెందిన సైనికులను ఉద్దేశించి, పాకిస్తాన్‌తో యుద్ధం జరిగితే అందులో పాల్గొనవద్దని సూచించాడు. పాకిస్తాన్‌ను శత్రుదేశంగా కాకుండా స్నేహపూర్వక దేశంగా పేర్కొంటూ.. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధానికి సిక్కులు ‘నో’ చెప్పాలని.. ఈ విషయం సిక్కులు ఐక్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చెప్పాలని వ్యాఖ్యానించాడు.
డాన్ మీడియా సంస్థ కథనం ప్రకారం.. “ఖలిస్తాన్ ప్రత్యేక దేశం కోసం పోరాడే సిక్కులకు పాకిస్తాన్ మిత్రదేశంగా నిలుస్తుందని, ఖలిస్తాన్ ఏర్పడితే పాకిస్తాన్ ఓ మంచి పొరుగుదేశంగా ఉంటుందని పన్నూ వేర్పాటు వాదం బోధిస్తూ వ్యాఖ్యానించాడు. పాకిస్తాన్ కు విరుద్ధంగా కాకుండా స్నేహదృక్పథంతో ఉండాలని చెప్పాడు. ఒకవేళ యద్ధమే జరిగితే ఇండియాలోని సిక్కులు పాకిస్తాన్ ఆర్మీకి మద్దతు నిలుస్తారని.. పాక్ సైనికులకు భోజనం వడ్డించాలి” అని అన్నాడు.
ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆయన చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా మరియు సామాజికంగా పెద్ద దుమారం రేపుతున్నాయి.
ఇలాంటి వ్యాఖ్యలే ఒకరోజు క్రితం పాకిస్తాన్ ఎంపీ పల్వాషా ఖాన్ చేసింది. భారత్ దాడి చేస్తే సిక్కులు పాకిస్తాన్ వైపునే నిలుస్తారని.. చెప్పింది. యుద్ధం తరువాత పాకిస్తాన్ ఆర్మీ ఇండియాలో బాబ్రీ మసీదుని నిర్మిస్తుందని మతచిచ్చు పెట్టే విధంగా వ్యాఖ్యానించింది.
Also Read: ఉగ్రవాదులకు రక్షణగా పాక్ సైన్యం.. భారత్ నుంచి కాపాడడానికే
మరోవైపు ఉగ్రవాదులకు అండగా నిలిచే పాకిస్తాన్ పై చర్యలు తీసుకునేందుకు భారత సైన్యానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. పాకిస్తాన్ ప్రభుత్వం కూడా ఇండియా దాడి చేయబోతోందనే వ్యాఖ్యానిస్తోంది. ఈ భయాల కారణంగానే పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా క్షీణించింది.
కర్తార్ పూర్ కారిడార్ లో 50 శాతం తగ్గిన భక్తుల రద్దీ
పహల్గాం ఉగ్రదాడి తరువాత పాకిస్తాన్ లోని సిక్కుల తీర్థ యాత్ర స్థలం శ్రీ దర్బార్ సాహిబ్ కు వెళ్లే ఇండియా సిక్కుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. భారత ప్రభుత్వం యుద్ద వాతావరణం కారణంగా పాకిస్తాన్ కు భారత పౌరులు వెళ్లడంపై నిషేధం విధించింది. పాకిస్తాన్ లోని నరోవాల్ జిల్లాలో శ్రీ దర్బార్ సాహిబ్ గురుద్వారా ఉంది. అక్కడ సిక్కుల మత గురువు గురు నానక్ సమాధి అయ్యారు. అక్కడికి భారతీయ సిక్కులు వెళ్లాలంటే కర్తార్ పూర్ కారిడార్ మీదుగా వెళ్లాలి. ఉగ్రదాడి తరువాత భారత ప్రభుత్వం పాకిస్తాన్ కు వెళ్లే అటారి వాఘా బార్డర్ మూసివేసింది. కానీ కర్తార్ పూర్ కారిడార్ తెరిచే ఉంది. అయినప్పటికీ సిక్కులు ప్రస్తుత క్లిష్ట సమయంలో వెళ్లడం లేదు. ఈ కారణంగా కర్తార్ పూర్ కారిడార్ మీదుగా పాకిస్తాన్ వెళ్లే సిక్కు భక్తుల సంఖ్య 50 శాతానికి తగ్గిపోయిందని సమాచారం.