Los Angeles wildfires New Year : అమెరికాలోని లాస్ ఏంజెలెస్ నగరంలో రగిలిన కార్చిచ్చు ఇంకా పూర్తిగా ఆరిపోలేదు. దాని తీవ్రత కొంత వరకు తగ్గినా ఊహించని భారీ నష్టం తప్పలేదు. కొన్ని చిన్న మంటలను అదుపు చేసినా, పాలిసేడ్స్, ఏటోన్ వంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వ్యాపించిన అగ్నికీలలను అదుపు చేయడంలో అధికారులు సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఈ కార్చిచ్చుకు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా కాల్చిన బాణాసంచా కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రాణనష్టం, ఆస్తి నష్టం:
ఈ అగ్నిప్రమాదాల్లో ఇప్పటివరకు 25 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో ఏటోన్ ఫైర్‌లో 17 మంది, పాలిసేడ్స్ ఫైర్‌లో 8 మంది మరణించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 12,000 నిర్మాణాలు అగ్నికి ఆహుతయ్యాయి, 160 చదరపు కిలోమీటర్లకు పైగా భూభాగం దగ్ధమైంది. పాలిసేడ్స్‌లో 23,707 ఎకరాలు, ఏటోన్‌లో 14,117 ఎకరాలు, కెన్నెత్‌లో 1,052 ఎకరాలు, హుర్సెట్‌లో 779 ఎకరాలు నాశనం అయ్యాయి.
అగ్నికీలల వ్యాప్తిని అడ్డుకునే ఫోస్ చెక్:
అగ్నిని నియంత్రించడానికి ఫోస్ చెక్ అనే రసాయన మిశ్రమాన్ని 9 విమానాలు, 20 హెలికాఫ్టర్ల సాయంతో విసరడం ప్రారంభించారు. ఈ మిశ్రమం పింక్ రంగులో ఉండి, మొక్కల మీద పడినప్పుడు ఆక్సిజన్ ప్రవాహాన్ని అడ్డుకొని మంటలను తగ్గిస్తుంది.
న్యూఇయర్ వేడుకలే కారణమా?
పాలిసేడ్స్ కార్చిచ్చు నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా కాల్చిన బాణాసంచా వల్లే ప్రారంభమైనట్లు అనుమానిస్తున్నారు. బాణాసంచా రాకెట్ల నిప్పులు అడవిలోని మొక్కలకు అంటుకొని తద్వారా ఆ నిప్పు కార్చిచ్చు మారిందనే నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆ మంటలను అదుపు చేసినా, అక్కడ నుంచి వచ్చిన నిప్పుకు గాలులు తోడవడంతో కార్చిచ్చు నగరానికి వ్యాపించిందని నిపుణులు చెబుతున్నారు.
Also Read: నిద్రపోతూ వేయి జాబ్స్ అప్లై చేసిన యువకుడు.. ఫలితంగా ఏం జరిగిందంటే..
ప్రైవేటు డ్రోన్లతో ప్రాణాపాయం:
లాస్ ఏంజెలెస్ అగ్నిమాపక కార్యకలాపాలకు ప్రైవేటు డ్రోన్లు పెద్ద తలనొప్పిగా మారాయి. ఇటీవల సూపర్ స్కూపర్ అనే అగ్నిమాపక విమానాన్ని ఒక డ్రోన్ ఢీకొనడంతో విమానం దెబ్బతింది. డ్రోన్ ఆపరేటర్‌ను గుర్తించేందుకు ఎఫ్‌బీఐ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.
దొంగల హడావిడి:
పాలిసేడ్స్ సహా వివిధ ప్రాంతాల్లో ఇళ్లను ఖాళీ చేసిన సందర్భంగా దొంగలు తమ పని ప్రారంభించారు. ఇప్పటివరకు 29 మందిని అరెస్టు చేశారు. వీరిలో ఒకరు అగ్నిమాపక సిబ్బంది దుస్తుల్లో సంచరించినట్లు గుర్తించారు. ఖాళీ ఇళ్లను కాపాడేందుకు స్థానిక అధికారులు.. 400 మంది నేషనల్ గార్డ్స్‌ను నియమించారు.
నిర్లక్ష్యం కారణంగా భారీ నష్టం:
లాస్ ఏంజెలెస్‌లో కార్చిచ్చు కారణంగా భారీ ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరుగుతోంది. అనవసరమైన వేడుకలు, నిర్లక్ష్యపు చర్యలు ఇలాంటి ప్రమాదాలకు కారణమవుతుండటంతో ముందు జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరమని అధికారులు హెచ్చరిస్తున్నారు.