8000 Bitcoins In Garbage| అదృష్టదేవత వరించినా.. శనిదేవుడు అడ్డుపడ్డారని సామెత. ఇది నిజజీవితంలో కూడా ఒక వ్యక్తికి జరిగింది. తన వద్ద నిధిని తెలియక చెత్తలో పడేసి.. కొన్నేళ్ల తరువాత అనవసరంగా కోట్లు విలువ చేసే వస్తువు చెత్తలో పడేశానే అని బాధపడుతూ కూర్చున్నాడు. దాని గురించే ఆలోచిస్తూ.. ఎలాగైనా తిరిగి పొందాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు.
వివరాల్లోకి వెళితే.. యునైటెడ్ కింగడమ్ లోని వేల్స్ దేశం న్యూపోర్ట్ నగరానికి చెందిన జేమ్స్ హోవెల్స్ అనే 38 ఏళ్ల యువకుడు హాఫినా ఎడ్డీ ఇవాన్స్ అనే యువతిని 15 ఏళ్ల క్రితం ప్రేమించాడు. ఇద్దరూ వివాహం చేసుకోకుండానే ఇన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. జేమ్స్ ఒక స్టాక్ బ్రోకింగ్ కంపెనీలో పనిచేసేవాడు. 2009లో జేమ్స్ ఒకసారి బిట్ కాయిన్ క్రిప్టోకరెన్సీకి మంచి భవిష్యత్తు ఉంటుందని అంచనా వేసి క్రమంగా బిట్ కాయిన్లు పోగు చేశాడు. అలా అతని వద్ద 2009లోనే 8000 బిట్ కాయిన్లు ఉన్నాయి.
బిట్ కాయిన్ ఒక క్రిప్టోకరెన్సీ అంటే సాధారణ కరెన్సీలాగా అది నాణేలు, పేపర్ కరెన్సీ లాగా కాదు. ఆన్ లైన్ కరెన్సీ. దాన్ని కొనుగోలు చేశాక.. ఇంటర్నెట్ లో దాని కీ లభిస్తుంది. జేమ్స్ హోవెల్స్ వద్ద కూడా బిట్ కాయిన్ కరెన్సీ కీ ఉండేది. దాన్ని జేమ్స్ తన కంప్యూటర్ హార్డ్ డిస్క్ లో సేవ్ చేసి పెట్టాడు. కానీ అప్పుడు బిట్ కాయిన్స్ మార్కెట్ విలువ హెచ్చు తగ్గులు ఉండడంతో దాని గురించి మరిచిపోయాడు. తన వద్ద బిట్ కాయిన్స్ ఉన్న సంగతి అసలు జేమ్స్ కు గుర్తుకు కూడా లేదు.
Also Read: దేశముదుర్లు.. 5 స్టార్ హోటళ్లలో పట్టపగలు దోపిడి.. టికెట్ లేకుండా విమాన ప్రయాణం
ఈ క్రమంలో 2011లో జేమ్స్, హోవెల్స్ కు తొలి సంతానం కలిగింది. అలా కుటుంబంతో సంతోషంగా ఉంటూ జేమ్స్ తన వద్ద ఉన్న బిట్ కాయిన్స్ గురించి మరిచిపోయాడు. తన పాత కంప్యూటర్ పక్కన పెట్టేసి కొత్త లాప్ టాప్ కొనుకున్నాడు. ఇంట్లో ఓ మూలో ఉన్న ఆ పాత కంప్యూటర్ లో 8000 బిట్ కాయిన్స్ కీ ఉందనే విషయం జేమ్స్ కు గుర్తుకు లేదు.
అలా 2014లో ఓసారి ఇల్లంతా శుభ్రం చేస్తుంటే పాత కంప్యూటర్ అడ్డంగా ఉందని జేమ్స్ ప్రియురాలు హాఫీనా బయటకు తీసింది. ఆ సమయంలో జేమ్స్ ఆఫీసులో ఉన్నాడు. ఇంట్లో ఉన్న పాత సామాన్లు బయటకు తీసి ల్యాండ్ ఫిల్ (బ్రిటన్, పాశ్చాత్య దేశాల్లో పాత సామాన్లు పొందుపరిచే వ్యవస్థ) వారికి ఇవ్వాలని చూసింది. కానీ ఎందుకైనా మంచిది అని ఆలోచించి జేమ్స్ ఆఫీసుకు ఒకసారి ఫోన్ చేసి.. “ఇంట్లోని పాత సామాన్లు, పాత కంప్యూటర్ అన్నీ ల్యాండ్ ఫిల్ చెత్త వారికి ఇచ్చేస్తున్నాను” అని అడిగింది. ఆ సమయంలో పనిలో బిజీగా ఉన్న జేమ్స్ సరేనని చెప్పాడు. అంతే హాఫినా ఆ పాత కంప్యూటర్ తో సహా పాత సామాన్లన్నీ పడేసింది.
ఈ ఘటన జరిగి ఆరేళ్ల తరువాత 2020-21 సంవత్సరంలో బిట్ కాయిన్ విలువ బాగా పెరిగింది. ఇంట్లో జేమ్స్, హాఫినా కు ఇద్దరు సంతానం. జేమ్స్ ఇక జీవితంలో సొంతఇల్లు ఉండాలని, పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలని కలలు కనడం మొదలుపెట్టాడు. అప్పుడు అతనికి బిట్ కాయిన్ గురించి గుర్తకు వచ్చింది. ఇప్పుడు ఒక్కో బిట్ కాయిన్ విలువ లక్షల్లో ఉంది. దీంతో ఇంట్లో ఉండాల్సిన తన పాత కంప్యూటర్ కోసం జేమ్స్ వెతకడం మొదలుపెట్టాడు. కానీ ఎక్కడా తన పాత కంప్యూటర్ కనిపించలేదు. దీంతో హాఫినాని తన పాత కంప్యూటర్ గురించి అడిగాడు. కానీ పదేళ్ల క్రితం జరిగిన ఘటన గురించి ఆమెకు గుర్తుకు లేదు. ఈ కారణంగా హాఫినా తనకేమీ తెలియదని.. పాత కంప్యూటర్ ఇంట్లో లేదని చెప్పింది. అప్పటి నుంచి జేమ్స్ పిచ్చివాడిలా తన పాత కంప్యూటర్ కోసం వెతుకుతూనే ఉన్నాడు.
Also Read: 69 ఏళ్ల నకిలీ ఐపిఎస్ ఆఫీసర్.. అమిత్ షా సలహాదారుడిగా చలామణి.. ఎలా చేశాడంటే
2024లో ఒకసారి హాఫినాకు పాత కంప్యూటర్ తాను పాత సామాన్లు తీసుకుపోయే చెత్త వారికి ఇచ్చినట్లు గుర్తుకు వచ్చింది. ఈ విషయం జేమ్స్ కు చెప్పింది. దీంతో జేమ్స్ ఆ పాత సామాన్లు ఎక్కడ తీసుకెళ్తారో ఆరా తీశాడు. ఆ పాత సామాన్లన్నీ న్యూ పోర్ట్ నగరం ల్యాండ్ ఫిల్ ఫెసిలిటీలో పడేసి ఉంటారని తెలుసుకున్నాడు. వెంటనే న్యూ పోర్ట్ ల్యాండ్ ఫిల్ ఫెసిలిటీకి వెళ్లి జరిగిన విషయం మొత్తం చెప్పాడు. కానీ ల్యాండ్ ఫిల్ అధికారులు తాము ఈ విషయంలో ఏమీ చేయలేమని చెప్పారు. దీంతో జేమ్స్ వారితో గొడవ పడ్డాడు. ఎలాగైనా సరే తన పాత కంప్యూటర్ తనకు కావాలని.. పదేళ్ల పాత సామాన్ల చెత్త మొత్తం వెలికి తీయాలని అడిగాడు. దానికి అయ్యే ఖర్చుని కూడా తానే భరిస్తానని చెప్పాడు.
అయినా ల్యాండ్ ఫిల్ అధికారులు అందుకు ఒప్పుకోలేదు. అంత భూమి లోపల పాత పెట్టామని.. ఇప్పుడు వెలికి తీస్తే.. పర్యావరణానికి ప్రమాదమని కారణాలు చూపారు. వారితో ఎంత వాదించినా ఉపయోగం లేదని జేమ్స్ భావించి తన మిత్రులను సలహా అడిగాడు. వారంతా కోర్టు ఆదేశిస్తే.. ఆ ల్యాండ్ ఫిల్ అధికారులు ఏదైనా చేస్తారని చెప్పారు. దీంతో జేమ్స్ న్యూపోర్ట్ సివిల్ కోర్టులో కేసు వేశాడు. తన బిట్ కాయిన్స్ విలువ 569 మిలియన్ పౌండ్లు అని (భారత కరెన్సీ రూ.5900 కోట్లు) అని కోర్టు పిటీషన్ లో పేర్కొంటూ.. వాటిని వెతికి పెట్టేందుకు ల్యాండ్ ఫిల్ అధికారులను ఆదేశాలివ్వాలని కోర్టును కోరాడు. ఈ కేసు డిసెంబర్ తొలివారానికి కోర్టు వాయిదా వేసింది.
జేమ్స్ ప్రియురాలు హాఫినా మాత్రం తనకు ఆ డబ్బులేమీ అవసరం లేదని.. కానీ జేమ్స్ మాత్రం ఆ బిట్ కాయిన్స్ గురించి ప్రతిరోజు ఆలోచిస్తూ మానసిక ఆరోగ్యం కోల్పోతున్నాడని తెలిపింది. తాను ఆ రోజు చెత్తలో పడేసిన కంప్యూటర్ కోసం తనను ప్రతిరోజు నిందిస్తూ ఉంటాడని మీడియాకు తెలిపింది. మరోవైపు జేమ్స్ మాట్లాడుతూ.. తనకు ఆ మొత్తం బిట్ కాయిన్స్ లభిస్తే.. న్యూపోర్ట్ నగరాభివృద్ధి కోసం అందులో 10 శాతం విరాళంగా ఇస్తానని ప్రకటించాడు.