Myanmar Rarthquake Update: కూలిన ఆకాశ హార్మ్యాలు ..! శిథిలమైన భవనాలు..! ధ్వంసమైన రోడ్లు..! మయన్మార్, థాయ్‌లాండ్‌లో భూకంపం సృష్టించిన బీభత్సమిది. గంటల వ్యవధిలో ఏడు వరుస భూకంపాలతో ఈ రెండు దేశాలు చిగురుటాకులా వణికిపోయాయి. భారీ ఆస్తినష్టంతో పాటు ప్రాణనష్టం మిగిల్చాయి. మయన్మార్‌లో ఎక్కడ చూసినా శిథిలమైన బిల్డింగ్‌లే దర్శనమిస్తున్నాయి. ఇళ్లు, ఆఫీసులు, హోటళ్లు, ఆస్పత్రులు అన్ని ధ్వంసమయ్యాయి. వేలాది మంది నిరాశ్రయులు అయ్యారు. ఫ్యామిలీలు చిన్నా భిన్నమయ్యాయి. పుట్టకొకరు, చెట్టుకొకరుగా మిగిలిపోయారు. భూకంప బాధితులతో ఆస్పత్రులు కిక్కిరిసిపోయాయి.
1000 మందికి పైగా మృతి..
మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటి వరకు వెయ్యికిపైగా చనిపోయారు. మరో 1700 మందికి పైగా తీవ్రగాయాలయ్యాయి. వందలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. శిథిలాల కింద చిక్కుకున్నవారి కోసం సహాయక బృందాలు శ్రమిస్తున్నాయి. 16 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మయన్మార్ న్యూకాపిటల్ సిటీ నేపిడాలో ఆస్పత్రులన్నీ భూకంప బాధితులతో నిండిపోయాయి.
బస్సులు, రైలు సర్వీసులు నిలిచిపోయాయి
ముఖ్యంగా మయన్మార్‌లోని మండలే నగరం పూర్తిగా ధ్వంసమైంది. భూకంప కేంద్రానికి 17 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ సిటీపై తీవ్ర ప్రభావం పడింది. ఇందులో 14 లక్షల మంది ఉన్నారు. ఈ నగరంలోనే ఎక్కువ మంది చనిపోయినట్లు అంచనా. భారీ భూకంపంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. రోడ్లు, సబ్‌వేలు దెబ్బతిన్నాయి. బస్సులు, రైలు సర్వీసులు నిలిచిపోయాయి. స్కూళ్లు మూతపడ్డాయి. ఆఫీసులకు సెలువులు ప్రకటించారు. అత్యవసర సేవలు మినహా అన్ని సేవలు నిలిచిపోయాయి. కమ్యూనికేషన్ వ్యవస్ధ కూడా దెబ్బతిన్నది. కరెంట్ కూడా నిలిచిపోయింది.
భారత్ తక్షణసాయం కింద 15 టన్నుల రిలీఫ్ మెటేరియల్ పంపింది
మయన్మార్, థాయ్‌లాండ్‌ను ఆదుకునేందుకు ప్రపంచ దేశాలు ముందుకొస్తున్నాయి. భారత్ తక్షణసాయం కింద 15 టన్నుల రిలీఫ్ మెటేరియల్ పంపింది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన విమానం హిండన్ బేస్ క్యాంపు నుంచి బయల్దేరింది.
భూప్రళయానికి వణికిపోయిన మయన్మార్, థాయిలాండ్
ఇదిలా ఉంటే.. భూ ప్రళయానికి మయన్మార్, థాయిలాండ్ వణికిపోయాయి. ఈ రెండు దేశాల్లో సంభవించిన భూకంపం.. ఊహకందని విధ్వంసం సృష్టించింది. మయన్మార్‌లో రిక్టర్ స్కేల్‌పై 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లోనూ భూప్రకంపనలు సంభవించాయి. దాంతో.. సెంట్రల్ బిజినెస్ ఏరియాలోని భారీ భవనాలు కుప్పకూలాయి. ఇటు మయన్మార్‌లోనూ ఈ తరహా దృశ్యాలే కనిపించాయి. భూప్రకంపనలతో.. అనేక భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. భూకంపంతో వేలాది మంది ప్రజలు భవనాల నుంచి బయటకు వచ్చి.. వీధుల్లో నిల్చున్నారు. భవంతులు కూలుతున్న సమయంలో.. వీధుల్లో పరిగెత్తుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మయన్మార్‌లోని మాండలే నగరానికి సమీపంలోని బర్మా నగరం సంగైంగ్‌కి 16 కిలోమీటర్ల దూరంలో.. భూమికి 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఇక.. థాయిలాండ్ ప్రభుత్వం దేశంలో ఎమర్జెన్సీ విధించింది. టూరిస్టులంతా.. బ్యాంకాక్‌ని ఖాళీ చేసేస్తున్నారు.
మయన్మార్‌లో 12 నిమిషాల వ్యవధిలో 2 సార్లు భూకంపం
మయన్మార్‌లో.. 12 నిమిషాల వ్యవధిలో రెండు సార్లు భారీ భూకంపాలు సంభవించాయి. ఈ భూకంప విలయంతో పదుల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడ్డారు. భూకంప తీవ్రతకు మయన్మార్, థాయ్‌లాండ్‌లో భారీగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. మయన్మార్ రాజధాని నెపిడాలో.. ఇటీవలే కొత్తగా నిర్మించిన 1000 పడకల ఆస్పత్రి కుప్పకూలింది. దాంతో.. అక్కడే అత్యధికంగా క్షతగాత్రులు ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ ప్రాంతంలోనే అత్యధిక మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందనే ఆందోళన నెలకొంది. చాలా మంది తమ ఆత్మీయుల కోసం శిథిలాల్లో గాలిస్తున్న దృశ్యాలు.. అందరినీ కలచివేస్తున్నాయి. మయన్మార్ దేశవ్యాప్తంగా చాలా చోట్ల పాత భవనాలు, పాత బ్రిడ్జిలు కుప్పకూలినట్లు తెలుస్తోంది. భవన శిథిలాలతో గాయపడిన వారికి చికిత్స అందజేస్తున్నారు. మయన్మార్‌లోని మండేలాలో నివాస భవనాలు కూలిపోయాయి. ఇర్రవడ్డి నదిపై ఉన్న బ్రిటీష్ కాలం నాటి వంతెన కుప్పకూలింది.
Also Read: థాయ్‌లాండ్‌లో సునామీ! భారత్‌కు ముప్పు!
థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లోనూ భూప్రకంపనలు
థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో రెండుసార్లు తీవ్ర ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.4, 7.3గా నమోదైంది. ఈ భారీ భూకంపం.. థాయ్‌లాండ్‌లో పెను విధ్వంసం మిగిల్చింది. చాలా ప్రాంతాల్లో.. భవనాలు నేలమట్టమైపోయాయి. బ్యాంకాక్‌లో మెట్రో, విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఎయిర్‌పోర్టుని లాక్ డౌన్ చేసేశారు. బ్యాంకాక్‌లో నిర్మాణంలో ఉన్న 30 అంతస్తుల భవనం కూలిపోగా.. అందులో 40 మందికి పైగా చిక్కుకున్నారు. భూకంపం సృష్టించిన విధ్వంసం తర్వాత.. మయన్మార్, థాయ్‌లాండ్ దేశాల్లో పరిస్థితులు ఆందోళనకరంగా మారిపోయాయి. చూస్తుండగానే ఇళ్లన్నీ పేకముక్కల్లా పడిపోయాయ్. దాంతో.. అక్కడి ప్రజలు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రాణాలు కాపాడుకునేందుకు తీసిన పరుగుల్ని గుర్తు చేసుకుంటూ భయపడిపోతున్నారు. ఒక్కసారిగా భూమి కదలడంతో.. అక్కడి భవనాలు, ఇండ్లు, చెట్లు అన్నీ కూలిపోయాయి. ఫలితంగా.. పెద్ద సంఖ్యలో ప్రజలు భవనాల్ని ఖాళీ చేశారు.
రవాణా, వసతి సౌకర్యాలు దెబ్బతిన్నాయి
ఈ భూకంపాలు.. థాయ్‌లాండ్ పర్యాటక పరిశ్రమని పెద్ద దెబ్బకొట్టే అవకాశం ఉంది. ఎందుకంటే.. రవాణా, వసతి సౌకర్యాలు దెబ్బతిన్నాయి. పైగా.. వేలాది మంది నిరాశ్రయులయ్యే అవకాశాలున్నాయి. నిమిషాల వ్యవధిలో సంభవించిన ఈ భారీ భూకంపాలు.. మయన్మార్, థాయ్‌లాండ్‌లో.. ప్రాణ, ఆస్తి నష్టంతో పాటు రవాణా, ఆర్థిక వ్యవస్థ, ప్రజల సామాజిక జీవనంపై దీర్ఘకాలిక ప్రభావం చూపే అవకాశం ఉంది. కచ్చితమైన నష్టానికి సంబంధించిన అంచనాలు ఇంకా లేనప్పటికీ.. రెండు దేశాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.