Obama Slams Trump Tariffs| అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) విధిస్తున్న కొత్త టారిఫ్‌లు అమెరికాకు మేలు చేస్తాయని తాను భావించడం లేదని మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా (Barack Obama) పేర్కొన్నారు. ట్రంప్ యంత్రాంగం తీరును కొంతకాలంగా నిశితంగా గమనిస్తున్నానని, ఇప్పటివరకు బహిరంగంగా ఎక్కడా మాట్లాడలేదన్నారు. తాజా ఓ ఇంటర్వ్యూలో ఒబామా మాట్లాడుతూ.. వైట్‌హౌస్ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నట్లుగానే భావిస్తున్నానని, తాజా పరిణామాలు సర్వత్రా ఆందోళనకు గురి చేస్తున్నాయన్నారు.
‘‘ఇటీవల బహిరంగంగా మాట్లాడటం ఇదే మొదటిసారి. కొంతకాలంగా ట్రంప్ యంత్రాంగం తీరును గమనిస్తున్నా. ఒకవేళ గతంలో అటువంటి నిర్ణయాలు తీసుకుంటే.. ఇప్పుడు మౌనంగా ఉన్నవారంతా అప్పుడు ఎలా ప్రవర్తించి ఉంటారో ఊహించడం కష్టం. ఇక కొత్త టారిఫ్‌లు అమెరికాకు మేలు చేస్తాయని నేను భావించడం లేదు’’ అని బరాక్ ఒబామా పేర్కొన్నారు. స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు తెలియజేసే విద్యార్థులను తొలగించాలంటూ యూనివర్సిటీలను ట్రంప్ ప్రభుత్వం బెదిరించడం ఆందోళనకర అంశమన్నారు.
Also Read: హిందూ మహాసముద్రంలో అమెరికా యుద్ధవిమానాలు.. మరో యుద్ధం ప్రారంభమా?
అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు కమలా హారిస్‌కు మద్దతుగా, ట్రంప్‌నకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన ఒబామా.. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడైతే ఎదురయ్యే ముప్పు గురించి పలుమార్లు హెచ్చరించారు. ట్రంప్ తనదైన శైలిలో నియంతలా వ్యవహరిస్తారని.. అందరికీ ఇబ్బందులు కలిగిస్తారని చెప్పారు. ప్రస్తుతం ట్రంప్ నిర్ణయాల పట్ల మాజీ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ కూడా తీవ్రంగా స్పందించారు. ట్రంప్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయని, అవి స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు.
అమెరికాలో ఉద్యోగాలుండవు
ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించిన కొత్త సుంకాల కారణంగా.. ఈ సంవత్సరం అమెరికా ఆర్థిక వ్యవస్థలో మాంద్యం ఉంటుందని ప్రముఖ బిజినెస్ రేటింగ్ సంస్థ ‘జేపీ మోర్గాన్’ అంచనా వేసింది. ఈ మాంద్యం వల్ల అగ్రరాజ్యంలో (USA Unemployment) నిరుద్యోగం రేటు 5.3 శాతానికి చేరుతుందని.. మైఖేల్ ఫెరోలి అన్నారు.
డొనాల్డ్ ట్రంప్ సుంకాల ప్రభావం.. ఉద్యోగాల మీద మాత్రమే కాకుండా, దేశ జీడీపీ మీద కూడా ప్రభావం చూపిస్తుందని జేపీ మోర్గాన్ చీఫ్ యూఎస్ ఆర్థికవేత్త ‘మైఖేల్ ఫెరోలి’ వెల్లడించారు. ప్రపంచ దేశాల నుంచి అమెరికాకు వచ్చే దిగుమతులు కూడా 20 శాతం తగ్గుతాయని ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. దీనివల్ల అగ్రరాజ్యంలో ఉద్యోగాలు ఉండవని చెబుతున్నారు.
ట్రంప్ ప్రతీకార సుంకాల వల్ల దిగుమతులు తగ్గుతాయి. జీడీపీలో దిగుమతులు 1986 ముందు స్థాయికి చేరుకుంటుందని.. యూబీఎస్ చీఫ్ యూఎస్ ఆర్థికవేత్త జోనాథన్ పింగిల్ ఒక నోట్‌లో తెలిపారు. దీనివల్ల ఊహించిన దానికంటే ఎక్కువ ఆర్థిక నష్టాన్ని అమెరికా చూడబోతోందని స్పష్టం చేశారు.
డొనాల్డ్ ట్రంప్ భారతదేశం మీద మాత్రమే కాకుండా.. ప్రపంచంలోని చాలా దేశాల మీద సుంకాలను విధించారు. అంతే కాకుండా మనుషులు లేని ఆస్ట్రేలియన్ దీవుల మీద కూడా 10 శాతం సుంకాలను ప్రకటించడం గమనార్హం. భారత ఉత్పత్తులపై విధించిన సుంకాలలో 10 శాతం సుంకం ఈ రోజు (ఏప్రిల్ 5) నుంచి అమలులోకి వస్తుంది. మిగిలిన శాతం ఏప్రిల్ 10 నుంచి అమలులోకి రానుంది.