US War Fleet With B-2 Stealth Bomber in Indo Pacific| ప్రపంచమంతా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించే సుంకాల గురించి చర్చించుకుంటుంటే.. ట్రంప్ మాత్రం సైలెంట్ గా ఆసియా ప్రాంతంలో భారీగా సైన్యాన్ని మోహరించారు. ఇందులో భాగంగానే, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన బీ-2 స్టెల్త్ బాంబర్ విమానాలను రంగంలోకి దించడం గమనార్హం.
బీ-2 బాంబర్లతో అడ్వాన్స్‌డ్ యుద్ధ విమానాలు మోహరింపు
బీ-2 స్టెల్త్ బాంబర్లు (B-2 Stealth Bombers) ప్రపంచంలో అత్యాధునికమైన యుద్ధ విమానాలుగా గుర్తించబడ్డాయి. అమెరికా వద్ద ఇలాంటి బాంబార్ విమానాలు 20 ఉన్నాయి. అందులో 6 బాంబర్లను హిందూ మహాసముద్ర ప్రాంతంలోని అమెరికా-బ్రిటిష్ సైనిక బేస్ డియాగో గార్సియా రన్‌వేపై మోహరించారు. ఈ సమాచారం ఉపగ్రహ చిత్రాల ద్వారా వెలుగులోకి వచ్చింది. అయితే, రాడార్ సంకేతాలు కూడా కనబడకపోవడంతో, షెల్టర్ లో మరిన్ని బాంబర్లు దాగి ఉండే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇండో-పసిఫిక్‌లో అమెరికా సైనిక ఉనికిని పెంచడానికే
అమెరికా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో యుద్ధ విమానాల గస్తీని పెంచాలని చాలా కాలంగా యోచిస్తోంది. ఇంతవరకు అరేబియా సముద్రంలో USS Harry S. Truman అనే విమాన వాహక నౌకతో గస్తీ నిర్వహిస్తుండగా.. ఇప్పుడు ఆ సంఖ్యను మూడుకి పెంచాలని అమెరికా యోచిస్తున్నట్లు తెలిసింది.
హిందూ మహాసముద్రంలో రెండు విమాన వాహక నౌకలు
దక్షిణ చైనా సముద్రానికి సమీపంలో పశ్చిమ పసిఫిక్‌లో అమెరికా ఒక విమాన వాహక నౌకను మోహరించింది. ఈ మోహరింపులు భవిష్యత్తులో మరింత విస్తరించబోతున్నాయని అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ ధృవీకరించింది. విశ్లేషకులు ఈ చర్యలను అమెరికా వ్యూహాత్మకంగా తీసుకున్న ముఖ్యమైన ఎత్తుగడగా భావిస్తున్నారు.
Also Read: ట్రంప్ సుంకాల బాదుడుతో భారత్‌కు బంపర్ ఆఫర్.. ఎలాగంటే
అమెరికా ఈ మోహరింపుకు కారణాలు:
అమెరికా ప్రభుత్వం ప్రకారం.. ఈ సైనిక మోహరింపు ప్రాంతాల్లో అమెరికా రక్షణాత్మక వైఖరిని బలపరచడానికి జరిగింది. అదనంగా, భాగస్వామ్య దేశాల భద్రతను కాపాడడంలో తమ కట్టుబాటును కూడా తెలుపుతుంది. ఈ చర్యల లక్ష్యం దాడులు, అంతర్గత యుద్ధాలు, రాజకీయ సంక్షోభాలు, ప్రాంతీయ ఉద్రిక్తతలను నియంత్రించడం అని యుఎస్ అధికారులు పేర్కొన్నారు.
తమ టార్గెట్ ఏ దేశం లేదా సంస్థ అని అధికారులు స్పష్టంగా పేరుతో ప్రస్తావించకపోయినా.. విశ్లేషకులు ఈ చర్యలు మధ్యప్రాచ్యం, దక్షిణాసియా పరిస్థితుల నేపథ్యంలో తీసుకున్నవని భావిస్తున్నారు. ముఖ్యంగా ఇరాన్, యెమెన్ తో జరుగుతున్న ఉద్రిక్తతలు ఈ చర్యల వెనుక ప్రధాన కారణాలు అని తెలుస్తోంది.
ఇరాన్, యెమెన్ దేశాలకు హెచ్చరికలు
గత వారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగా యెమెన్‌లోని హౌతి తిరుగుబాటుదారులకు హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా నౌకలపై దాడులు ఆపకపోతే, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని యెమెన్‌ను, ఆ దేశాన్ని మద్దతు ఇస్తున్న ఇరాన్‌ను హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే యెమెన్ లోని హౌతీ విద్రోహుల స్థావరాలపై అమెరికా వైమానికి దాడులు చేసింది. మరోవైపు ఇరాన్ అణు ఒప్పందం విషయంలో కూడా హెచ్చరికలు ఇవ్వడం ద్వారా అమెరికా తన కఠినమైన స్థాయిని చూపుతోంది.
బీ-2 బాంబర్ల మోహరింపుపై విశ్లేషణ:
బీ-2 వంటి శక్తివంతమైన బాంబర్లను కేవలం హౌతీలు లేదా ఇరాన్ పై దృష్టి సారించి మోహరించలేదని రక్షణ నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా యెమెన్‌పై దాడికి ఈ స్థాయి శక్తి అవసరం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
చైనా, రష్యా వంటి దేశాలకు కూడా సంకేతాలు పంపేదుకే అమెరికా ఈ ప్రాంతంలో సైన్యం పెంచుకుంటోందని చర్చలు జరుగుతున్నాయి. ట్రంప్ ఈ మోహరింపుల ద్వారా ఇరాన్ మిత్రపక్షాలను హెచ్చరించాలనే ఉద్దేశంతో ఉంటారనే అభిప్రాయం ఉంది.