Pakistan Army Chief Kashmir| భారత్, పాకిస్తాన్‌ల మధ్య కశ్మీర్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. కశ్మీర్ గురించి పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ మరోసారి అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. ఇండియా, పాకిస్తాన్ దేశాలు సిద్ధాంతాల పరంగా పూర్తిగా వేర్వేరు దేశాలని వ్యాఖ్యానించిన మునీర్, కశ్మీర్‌ను పాకిస్తాన్ దేశానికి జీవనాడిగా అభివర్ణించారు. అందుకే.. కశ్మీర్ ప్రాంతాన్ని పాకిస్తాన్ ఎలాంటి పరిస్థితులలోనూ మర్చిపోదని, ఎటువంటి శక్తీ దానిని పాకిస్తాన్ నుంచి వేరు చేయలేదని స్పష్టంగా చెప్పారు. అంతేకాకుండా, దేశ విభజనకు దారితీసిన కారణాలను సమర్థిస్తూ, తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
పాకిస్తాన్‌లో అధికారికంగా ప్రసారమయ్యే మీడియా సంస్థ “డాన్” (Dawn) కథనం ప్రకారం.. తాజాగా ఒక జాతీయ కార్యక్రమంలో పాల్గొన్న జనరల్ మునీర్ ప్రసంగించారు. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాల వల్ల పాకిస్తాన్‌కు నిధులు రావడంపై భయాలు నెలకొన్నాయని, అయితే ఆ భయాలను తొలగించే దిశగా పాకిస్తాన్ సైన్యం కృషి చేస్తోందని తెలిపారు. ఉదాహరణగా బెలూచిస్తాన్, కశ్మీర్ అంశాలను ప్రస్తావించారు.
బెలూచిస్తాన్ పాక్‌కు గర్వకారణమైన ప్రాంతం. అక్కడ నెలకొన్న వేర్పాటువాద ఉద్యమాలను పాక్ సైన్యం సమర్థవంతంగా అణచివేసిందని ఆయన పేర్కొన్నారు. దేశంలో కొనసాగుతున్న ఉగ్రవాదానికి పెట్టుబడిదారులు భయపడే అవకాశం ఉందని చెప్పారు. కానీ ఉగ్రవాదులు దేశ భవిష్యత్తును మార్చగలరా అని ప్రశ్నించారు. త్వరలోనే పూర్తి విజయాన్ని సాధిస్తామని చెప్పారు. అంతేకాదు, పది జన్మలైనా ఆ ప్రాంతాన్ని ఎవరు పాకిస్తాన్‌కు దూరం చేయలేరని ధీమాగా చెప్పారు.
కశ్మీర్‌పై తమ ఆకాంక్ష ఎన్నటికీ చావదని స్పష్టం చేసిన జనరల్ మునీర్, ఆ ప్రాంతాన్ని తమ దేశానికి జీవనాడిగా వర్ణించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కశ్మీర్‌ను మరిచిపోవడం లేదని, కశ్మీరీ ప్రజల పోరాటాన్ని తాము అలాంటి సులభంగా వదిలిపెట్టబోమని పేర్కొన్నారు. కశ్మీర్‌ను పాకిస్తాన్ నుంచి వేరు చేయగల శక్తి లేదని ఆయన స్పష్టంచేశారు.
హిందువులు, ముస్లింలు వేరు.. తదుపరి తరాలక చెప్పాలి
పాకిస్తాన్ పౌరులకు సందేశంగా.. దేశం గురించి తదుపరి తరాలకి చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. మతం, సంప్రదాయాలు, ఆలోచనలు, లక్ష్యాలు – అన్ని విషయాల్లో ముస్లింలు, హిందువులు వేరని విషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే రెండు దేశాల విడిపోవడానికి ప్రధాన కారణమని, అందుకే తమ పూర్వీకులు పాకిస్తాన్ కోసం పోరాడారని గుర్తు చేశారు. ఇలాంటి దేశాన్ని ఎలా కాపాడుకోవాలో ప్రతిఒక్కరూ ఆలోచించాలి అని పిలుపునిచ్చారు.
కశ్మీర్‌పై పాక్ ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం గట్టిగా స్పందించింది. చట్టవిరుద్ధంగా ఆక్రమించబడిన భూభాగాన్ని వదిలిపెట్టడమే కశ్మీర్‌పై ఉన్న ఏకైక సంబంధమని భారత్ స్పష్టం చేసింది. ‘‘విదేశీ భూభాగం ఎవరికీ జీవనాడిగా ఎలా అవుతుంది..? కశ్మీర్ భారతదేశంలో ఒక భాగం’’ అని చెప్పింది.
భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పాక్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. జైస్వాల్ మాట్లాడుతూ.. కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌పై పాకిస్తాన్ ప్రతినిధులు మళ్లీ అసంబద్ధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. పదే పదే అనవసరంగా ఈ అంశాన్ని లేవనెత్తడం వల్ల వారి అసంబద్ధైన వాదనలు నిజమయ్యే అవకాశం లేదని స్పష్టం చేశారు. పాక్ ఈ ప్రయత్నాల ద్వారా ప్రోత్సహిస్తున్న సరిహద్దు ఉగ్రవాదాన్ని భారత్ అంగీకరించదని స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్ గతంలోనూ.. ఇప్పుడూ, భవిష్యత్తులోనూ భారతదేశంలో భాగంగానే ఉంటుందని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ అన్నారు.
Also Read: ఐపిఎల్ చూస్తూ ప్రమాదవశాత్తు తుపాకీ పేల్చిన బాలుడు.. పొరుగింటి వ్యక్తి మృతి
అంతేకాకుండా.. పాక్ ఆక్రమిత కశ్మీర్ లేకుండా జమ్మూకశ్మీర్ అసంపూర్ణమని కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. పాక్ ప్రభుత్వం ఆ ప్రాంతంలో ఉగ్రవాద శిక్షణ శిబిరాలు నడుపుతోందని ఆరోపించారు.
ఇటీవల ఐరాస వేదికపై జరిగిన చర్చల సమయంలోనూ, శాంతి పరిరక్షణ సంస్కరణలపై చర్చల్లో పాకిస్తాన్ జమ్మూకశ్మీర్‌పై అనవసర వ్యాఖ్యలు చేయగా, భారత ప్రతినిధులు గట్టిగా స్పందించారు.