Pakistan Ambassador US Entry| అమెరికా దేశీయ ఉద్యోగాలను కాపాడే నిమిత్తం, విదేశాలపై సుంకాలు విధించి దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇటీవల, అమెరికా పాకిస్తాన్ మరియు అఫ్ఘనిస్తాన్ పై ప్రయాణ నిషేధం విధించే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా వార్తలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో.. తుర్క్మెనిస్తాన్ దేశంలో పాకిస్తాన్ రాయబారిగా పనిచేస్తున్న అహ్సాన్ వాగన్ (AHSAN WAGAN) అనే వ్యక్తికి అమెరికాలో ప్రవేశానికి అనుమతి నిరాకరించబడింది. అతను సరైన డాక్యుమెంట్స్ తో లాస్ ఏంజెలెస్ కు వెళ్తుండగా, అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు అతన్ని విమానాశ్రయంలో ఆపి, తిరిగి పంపించారు.
అహ్సాన్ వాగన్ వీసాలో “వివాదాస్పద ప్రస్తావనలు” ఉన్నాయని అమెరికా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ గుర్తించింది. దీని కారణంగా అతనికి ప్రవేశం నిరాకరించబడిందని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ తెలిపారు. ఈ సంఘటనపై వివరాలు తెలుసుకోవడానికి లాస్ ఏంజెలెస్ లోని పాకిస్తాన్ కాన్సులేట్ ను దర్యాప్తు చేయమని ఆదేశించినట్లు వెల్లడించారు. అహ్సాన్ వాగన్ ను ఇస్లామాబాద్ కు తిరిగి పిలిపించే అవకాశం కూడా ఉందని తెలిపారు. అయితే ఈ విషయంలో అమెరికా మరింత స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
Also Read: పాకిస్థాన్ లో ప్రయాణికుల రైలు హైజాక్ – 100 మందికి పైగా బందీ – ఉగ్రవాదుల డిమాండ్లు ఇవే
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన రెండవ పదవీకాలంలో అనేక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు. వీటిలో భాగంగా.. అమెరికాలోకి ప్రవేశించే విదేశీయుల నుండి జాతీయ భద్రతకు ముప్పు ఉందా అనే విషయాన్ని ముందుగానే గుర్తించే కార్యనిర్వాహక ఆదేశంపై కూడా సంతకం చేశారు. ఈ ఆదేశం ప్రకారం.. పాక్షికంగా లేదా పూర్తిగా ప్రయాణ నిషేధం విధించాల్సిన దేశాల జాబితాను మార్చి 12 లోగా సమర్పించాలని కేబినెట్ సభ్యులను ఆదేశించారు. ఈ జాబితాలో అఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ కూడా ఉండే అవకాశం ఉందని సమాచారం.
మరోవైపు పాకిస్తాన్‌లో ఉగ్రవాద దాడుల ప్రమాదం ఉందని అమెరికా ప్రజలు ఆ దేశానికి వెళ్లవద్దని ట్రంప్ ప్రభుత్వం ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. పాకిస్తాన్ లో ఉగ్రవాదులు దాడులు చేసే ప్రమాదం ఎక్కువగా ఉందని హెచ్చరించారు. పాకిస్తాన్ కు వెళ్లే అమెరికా పౌరులు భారత సరిహద్దు ప్రాంతాలు, బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లకు వెళ్లకుండా ఉండాలని సూచించారు. ఈ ప్రాంతాలలో ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఎక్కువగా ఉందని తెలిపారు. పాకిస్తాన్ కు వెళ్లేవారు ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.
అలాగే, పాకిస్తాన్ నుండి భారత్ లోకి ప్రవేశించే ఏకైక అధికారిక మార్గం వాఘా బార్డర్ మాత్రమేనని, సరిహద్దు దాటి భారత్ లో ప్రవేశించాలంటే వీసా తప్పనిసరి అని తెలిపారు. వాఘా బార్డర్ వద్ద వీసా పొందే అవకాశం లేదని కూడా వివరించారు.
ఇంతలో, పాకిస్తాన్ పౌరులపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పాకిస్తాన్ నుండి అమెరికాకు వచ్చే వారిపై ప్రయాణ నిషేధం విధించేందుకు ట్రంప్ సిద్ధమయ్యారు. భద్రతా కారణాల రీత్యా పాకిస్తాన్ పౌరులపై ట్రావెల్ బ్యాన్ విధించనున్నట్టు తెలుస్తోంది. ఇది ట్రంప్ తన మొదటి పదవీకాలంలో కొన్ని ముస్లిం దేశాల పౌరులపై ప్రయాణ నిషేధం విధించిన తరువాత మరో ముఖ్యమైన నిర్ణయంగా పరిగణించబడుతోంది.