Philippines Storm Trami | ఆగ్నేయ ఆసియా దేశమైన ఫిలిప్పీన్స్ లో ప్రకృతి విధ్యంసం సృష్టిస్తోంది. ట్రాపికల్ తుపాన్ ట్రామీ ధాటికి ఆ దేశంలో భారీ వినాశనం జరిగింది. అక్టోబర్ 24 నుంచి మొదలైన తుపాను ధాటికి ఇప్పటి వరకు 100 మందికి పైగా చనిపోయారని అధికారిక సమాచారం. దాదాపు 5 లక్షల మందికి పైగా తమ ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులయ్యారు.
దీవుల సమూహ దేశమైన ఫిలిప్పీన్స్ లో తుపాను వల్ల భారీ వరదలు రావడంతో చాలా కుటుంబాలు ఇళ్లతో సహా కొట్టుకుపోయాయి. దీంతో ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. వరదల ధాటికి చాలా మంది గల్లంతయ్యారు. వారిని వెతికేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చెరువులు, సమీప గ్రామాల్లో లభిస్తున్న మృతదేహాల్లో వెతుకుతున్నారు. ఫిలిప్పీన్స్ లోని బైకాల్ ప్రాంతంలో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండడంతో దాదాపు 38 మంది చనిపోయారు.
బైకాల్ ప్రాంత సీనియర్ పోలీస్ అధికారి ఆండ్రే డిజాన్ మాట్లాడుతూ.. “చాలా మంది ఇంకా తమ ఇళ్ల పై అంతస్తులలో, పైకప్పులపైనే రెండు రోజులుగా చిక్కుకొని ఉన్నారు. వరదల్లో చిక్కుకొని ఉన్నవారిని కాపాడి సహాయక శిబిరాల్లోకి తీసుకెళుతున్నాం.” అని చెప్పారు.
రాజధాని మనీలా నగరానికి దక్షిణ దిక్కున ఉన్న బటంగాస్ రాష్ట్రంలో మృతుల సంఖ్య 55 కు చేరింది. చనిపోయిన వారిలో ఇద్దరు కరెంటు షాక్ కారణంగా ప్రాణాలు వదిలారని సమాచారం. వీరితో పాటు మరో అయిదు మృతదేహాలు కావిటే ప్రాంతంలో లభించాయని తెలిసింది. దీంతో మృతుల సంఖ్య 100 కు చేరింది. సివిల్ డిఫెన్స్ అధికారి ఏడ్గార్ పోసాడాస్ మాట్లాడుతూ.. ఇంకా చాలా మారుమూల ప్రాంతాల్లో వరద ఉధృతి ఎక్కువగా ఉండడం వల్ల సహాయక సిబ్బంది వెళ్లలేకపోతోంది.. అక్కడ కూడా మృతదేహాలు ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. దీంతో చనిపోయిన వారి సంఖ్య ఇంకా పెరుగుతుంది. తాల్ సరస్సులో ఒకే కుటుంబంలోని ఏడుగురు సభ్యలు మునిగిపోయినట్లు అనుమానాలున్నాయి. వారి ఇల్లు వరద ధాటికి కొట్టుకుపోయింది. బటంగాస్ రాష్ట్రంలో భారీ వర్షం కారణంగా కొండ చరియలు విరిగిపడడంతో చాలా మంది మరణించారు.” అని తెలిపారు.
Also Read: ప్రేమికులపై యాసిడ్ దాడి చేసిన మహిళలు.. ఇద్దరూ వివాహితులే..!
ఫిలిప్పీన్స్ జాతీయ విపత్తు ఏజెన్సీ ప్రకారం.. వందల సంఖ్యలో గ్రామాలు మునిగిపోయాయి. దాదాపు 5,60,000 మంది వరదల వల్ల ఇళ్లు కోల్పోయారు. సహాయక చర్యలు చేపట్టడానికి పోలీసులు, కోస్ట్ గార్డ్స్, మరైన డైవింగ్ యూనిట్లు పనిచేస్తున్నాయి. ఫిలిప్పీన్స్ దేశంలో ప్రతీ సంవత్సరం దాదాపు 20 భారీ తుపాన్లు సంభవిస్తూ ఉంటాయి. ఈ తుపాన్ల కారణంగా రోడ్లు, వంతెనలు, ఇల్లు కూలిపోవడంతో మరణాలు సంభవిస్తుంటాయి.
ఏసియా పసిఫిక్ ప్రాంతంలో వాతావారణ మార్పుల వల్ల గత కొన్ని సంవత్సరాల్లో భారీ తుపాన్లు సంభవిస్తున్నాయి. ఈ తుపార్లు మునుపటి కంటే ఎక్కువ రోజులు ప్రభావం చూపడం ఆందోళన కలిగించే విషయం.