Presidents fiery debate History | ఇద్దరు దేశాధినేతలు ముఖాముఖి కలిసినప్పుడు మాటకు మాట తిరగడం, ఆగ్రహించడం లేదా నిరసనగా సమావేశాన్ని వదిలి వెళ్లడం వంటి సంఘటనలు చాలా అరుదు. అయితే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య వాషింగ్టన్‌లో శుక్రవారం జరిగిన వాగ్వాదం ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. దేశాధినేతల మధ్య వివిధ అంశాలపై భిన్నాభిప్రాయాలు విభేదాలు సహజమే. వాటిని పరిష్కరించడానికి దౌత్య స్థాయిలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చర్చలు, సంప్రదింపులు జరుగుతుంటాయి. కానీ వాగ్వాదం జరగితే చర్చలు విఫలమైపోతాయి. అందుకే ఇటువంటి సంఘటనల పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఆధునిక ప్రపంచ చరిత్రలో వివిధ దేశాధినేతల మధ్య జరిగిన అటువంటి ప్రముఖ ఘటనలు ఇవి:
జాన్ ఎఫ్. కెనడీ-కృష్ఛేవ్ (1961)
సోవియట్ యూనియన్ మరియు అమెరికా మధ్య శీతల యుద్ధం (Cold war) తీవ్ర స్థాయిలో ఉన్న రోజులలో, వియన్నా సదస్సు సందర్భంగా సోవియట్ యూనియన్ కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ నికితా కృష్ఛేవ్ (nikita khrushchev), అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెనడీ మధ్య అణు నిరాయుధీకరణ మరియు బెర్లిన్ అంశాలు చర్చకు వచ్చాయి. కృష్ఛేవ్ పశ్చిమ బెర్లిన్‌ను వదిలివేయాలని గట్టిగా హెచ్చరించడం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతను మరింత పెంచింది. ఈ ఘర్షణ బెర్లిన్ గోడ నిర్మాణానికి దారితీసింది, ఇది 1961 ఆగస్టులో ప్రారంభమైంది.
రిచర్డ్ నిక్సన్ (అమెరికా) – ఇందిరా గాంధీ (భారత్) 1971
బంగ్లాదేశ్ స్వాతంత్య్ర యుద్ధం సమయంలో భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. 1971 నవంబరులో భారత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ అమెరికా పర్యటనకు వెళ్లారు. అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ తన స్వాగత ప్రసంగంలో బీహార్ వరదలను ప్రస్తావిస్తూ బాధితులకు సానుభూతి తెలిపారు. అయితే, తూర్పు పాకిస్థాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్) నుంచి భారత్‌కు వచ్చే శరణార్థుల గురించి ఒక్క మాట కూడా ప్రస్తావించకపోవడంతో ఇందిరా గాంధీ ఆగ్రహించారు. తన ప్రతిస్పందన ప్రసంగంలో, మనిషి సృష్టించిన విపత్తు మారణహోమం సృష్టిస్తున్నా పట్టించుకోకపోవడం తగదని ఆమె నిక్సన్‌ను విమర్శించారు. తర్వాత శ్వేత భవనానికి వచ్చిన ఇందిరా గాంధీ 45 నిమిషాలు వేచి ఉండేలా చేసి, నిక్సన్ తన ప్రతీకారాన్ని తీర్చుకున్నారు.
Also Read: జెలెన్‌స్కీ యుద్ధాన్నే కోరుకుంటున్నారు.. వైట్ హౌస్ వాగ్వాదం వైరల్ వీడియో
రోనాల్డ్ రీగన్-గోర్బచేవ్ (1986)
ఆయుధ నియంత్రణపై చర్చల కోసం అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ మరియు సోవియట్ యూనియన్ అధినేత మిఖాయిల్ గోర్బచేవ్ ఐస్లాండ్ రాజధాని రేక్యావిక్‌లో కలిశారు. చర్చలు ఒక ఒప్పందానికి దగ్గరపడుతున్నప్పుడు, క్షిపణి రక్షణ వ్యవస్థలపై తలెత్తిన విభేదాలు వాగ్వాదానికి దారితీసి, చర్చలను విఫలం చేశాయి. అయితే, ఈ విఫలత భవిష్యత్తులో అణు నిరాయుధీకరణ ఒప్పందాలకు మార్గం సుగమం చేసింది.
జార్జ్ డబ్ల్యు. బుష్-పుతిన్ (2001)
స్లోవేనియాలో జరిగిన ఒక సమావేశంలో అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యు. బుష్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ప్రశంసించారు. అయితే, వారిద్దరి మధ్య కనిపించిన స్నేహం, నాటో విస్తరణ మరియు క్షిపణి రక్షణ వ్యవస్థల వంటి అంశాలు చర్చకు వచ్చినప్పుడు బెడిసికొట్టింది. తూర్పు ఐరోపాలో అమెరికా క్షిపణి వ్యవస్థలను అమర్చడం రష్యాకు ముప్పుగా కనిపించింది, ఇది వారి సంబంధాలను కలుషితం చేసింది.
బరాక్ ఒబామా-నెతన్యాహు (2010)
ఇజ్రాయెల్ జనావాసాల (సెటిల్‌మెంట్స్) అంశంపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మరియు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయి. 2010 మార్చిలో శ్వేత భవనంలో జరిగిన సమావేశంలో, ఒబామా ప్రతిపాదనలను నెతన్యాహు అంగీకరించకపోవడంతో ఒబామా ఆగ్రహించారు. ఆయన చర్చల బాధ్యతను అధికారులకు వదిలేసి, తన కుటుంబ సభ్యులతో కలిసి భోజనానికి వెళ్లిపోయారు. ఈ సంఘటనను దౌత్యపరమైన మందలింపుగా నిపుణులు వర్ణించారు.
జస్టిన్ ట్రూడో (కెనెడా) – జిన్‌పింగ్ (చైనా) (2022 నవంబర్)
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మరియు కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో మధ్య జీ-20 సదస్సు సందర్భంగా బహిరంగంగా వాగ్వాదం జరిగింది. సదస్సు కోసం ఇండోనేషియా వచ్చిన వారిద్దరూ అంతకుముందు బాలీలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కెనడా అంతర్గత వ్యవహారాల్లో చైనా జోక్యం చేసుకుంటుందని ట్రూడో నిరసన వ్యక్తం చేశారు. ఈ చర్చ మీడియాకు లీక్ అయ్యేసరికి జిన్‌పింగ్ ఆగ్రహించారు మరియు ట్రూడోను బహిరంగంగా మందలించారు.
ఈ సంఘటనలు దేశాధినేతల మధ్య సంబంధాలు ఎంత సున్నితంగా ఉంటాయో, వాటి పర్యవసానాలు ఎంత తీవ్రంగా ఉంటాయో తెలియజేస్తాయి.