Trump Putin Peace Talks| రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధాన్ని శాంతియుతంగా ముగించేందుకు అంగీకరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సుమారు రెండు గంటల పాటు జరిగిన ఫోన్ సంభాషణ తర్వాత, యుద్ధాన్ని ఆపేందుకు పుతిన్ అంగీకరించినట్లు అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ అధికారికంగా వెల్లడించింది. యుద్ధం ముగించేందుకు ట్రంప్, పుతిన్ మధ్య మంగళవారం రాత్రి దాదాపు రెండు గంటలపాటు సుదీర్ఘంగా ఫోన్ ద్వారా చర్చలు సాగాయి. ఈ మేరకు ట్రంప్-పుతిన్ మధ్య జరిగిన సంభాషణపై అమెరికా అధ్యక్ష కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. శాశ్వత శాంతితో యుద్ధానికి ముగింపు పలకాలని ఇద్దరు నేతలు నిర్ణయించారు. ట్రంప్ పాలనలో అమెరికా, రష్యా దేశాలు మరింత దగ్గరగా రావచ్చని ఇద్దరు నేతలు అభిప్రాయపడ్డారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచాల్సిన అవసరాన్ని కూడా వారు నొక్కి చెప్పారు.
“రష్యా, ఉక్రెయిన్ మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధంలో ఇరు దేశాలు తీవ్రంగా నష్టపోయాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. పెద్ద మొత్తంలో నిధులు ఖర్చవుతున్నాయి. ఈ మొత్తాన్ని ఆయా దేశ ప్రజల అవసరాల కోసం వినియోగిస్తే ఎంతో మేలు జరిగేది. ఈ వివాదం భవిష్యత్తులో మళ్లీ చెలరేగకూడదు. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుని, ఇప్పటికే యుద్ధానికి ముగింపు పలకాల్సింది” అని వైట్ హౌస్ పేర్కొంది.
Also Read: బైడెన్ క్షమాభిక్షలు రద్దు చేసిన ట్రంప్.. అమెరికాలో ఆటోపెన్ వివాదం
యుద్ధం ముగింపు దశకు తీసుకురావడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఇద్దరు నేతలు చర్చించారు. ముఖ్యంగా ఇంధన వనరులు, మౌలిక సదుపాయాలపై కాల్పుల విరమణ, నల్ల సముద్రంలో కాల్పులకు తావులేకుండా తక్షణమే చర్యలు చేపట్టడం ద్వారా ఇరు దేశాల మధ్య శాశ్వత శాంతికి అడుగులు పడనున్నట్లు వైట్ హౌస్ పేర్కొంది. వివిధ సాంకేతిక సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ట్రంప్ సూచించినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ అంశం కూడా చర్చల్లో ప్రస్తావనకు వచ్చింది. ఇజ్రాయెల్‌ను నాశనం చేసే స్థితిలో ఇరాన్ ఉండకూడదని ఇద్దరు నేతలు అభిప్రాయపడ్డారు. వ్యూహాత్మక ఆయుధాల విస్తరణను నియంత్రించాల్సిన అవసరంపై కూడా వారు చర్చించారు.
రష్యా షరతులు ఇవే..
ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు పుతిన్ చేస్తున్న కృషిని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ అభినందించింది. అయితే, యుద్ధాన్ని శాంతియుతంగా ముగించాలంటే ఉక్రెయిన్‌కు విదేశీ సైనిక సాయాన్ని నిలిపివేయాలని, కీలకమైన నిఘా సమాచారాన్ని ఉక్రెయిన్‌తో పంచుకోవడం ఆపివేయాలని షరతు విధించింది. “వివాదం తీవ్రతరం కాకుండా రాజకీయ, దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించుకునేందుకు కృషి చేయడం మంచిదే. అయితే, ఇక్కడ ఒక షరతు ఉంది. విదేశీ సైనిక సాయాన్ని పూర్తిగా నిలిపివేయాలి. ఉక్రెయిన్‌కు నిఘా సమాచారాన్ని అందించడం మానివేయాలి” అని క్రెమ్లిన్ ఒక ప్రకటన విడుదల చేసింది.