
Putin Health : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారంటూ.. ఒక రష్యన్ టెలిగ్రామ్ ఛానెల్ లో ఎలాంటి ఆధారాలు లేని వార్తొకటి వైరల్ అవుతోంది. ఈ ఊహాగాలను క్రెమ్లిన్ వార్తాసంస్థ తోసిపుచ్చింది. ఆ సంస్థ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ సైతం.. పుతిన్ బాడీ డబుల్స్ ను ఉపయోగిస్తున్నారన్న వార్తలను ఖండిస్తూ.. ఇదంతా అసత్యమని పేర్కొన్నారు. ఆదివారం (అక్టోబర్ 22) సాయంత్రం వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర అనారోగ్యంతో బాధపడ్డారని .. కొన్ని మీడియా సంస్థల్లో వచ్చిన వార్తల ఆధారంగా.. టెలిగ్రామ్ ఛానల్ ఈ విషయాన్ని ప్రచారం చేసింది. వ్లాదిమిర్ పుతిన్ అక్టోబర్ 7న 71వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు.
ఇటీవలే చైనాను సందర్శించిన పుతిన్.. తిరుగుపయనంలో రష్యన్ నగరాల్లో తిరిగారు. కాగా.. పుతిన్ భద్రతా అధికారులు.. ఆయన రాత్రి 9 గంటల సమయంలో బెడ్రూమ్ లో నేలపై పడి ఉన్నట్లు గుర్తించారని జనరల్ ఎస్ వీఆర్ ను ఉటంకిస్తూ టెలిగ్రామ్ ఛానల్ పేర్కొంది. “మాస్కోలో రాత్రి సుమారు 9.05 గంటల సమయంలో అధ్యక్షుడు పుతిన్ ఇంటిలోని పడకగదిలో నుంచి శబ్దాలు, వస్తువులు పడిపోతున్న శబ్దాలు వినిపించాయని చెబుతున్నారు. ఆ శబ్దాలు విన్న వెంటనే ఇద్దరు భద్రతా అధికారులు బెడ్రూమ్ లోకి వెళ్లి చూడగా.. పుతిన్ నేలపై పడి కనిపించారు.” అని సదరు టెలిగ్రామ్ ఛానల్ పేర్కొంది.
2020లో పుతిన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో.. తాను బాడీ డబుల్స్ ను ఉపయోగిస్తున్నట్లు వచ్చిన పుకార్లను ఖండించారు. అయినా భద్రతా కారణాల దృష్ట్యా గతంలో ఒక ఒక బాడీడబుల్ ను ఉపయోగించుకునే అవకాశం తనకు లభించింనట్లు కూడ తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ లోనూ ఇవే రూమర్స్ వినిపించగా.. క్రెమ్లిన్ వాటిని ఖండించి.. పుతిన్ మంచి ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపింది.