Putin India Visit Zelenskyy| రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) త్వరలోనే భారత్‌లో పర్యటించనున్నారు. భారత్ పర్యటనకు రావాల్సిందిగా ప్రధాని మోదీ చేసిన ఆహ్వానాన్ని తమ దేశాధినేత పుతిన్ అంగీకరించినట్లు రష్యా విదేశాంగశాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ వెల్లడించారు. ‘‘రష్యా అండ్ ఇండియా: టువర్డ్ ఏ బైలాటరల్ అజెండా’’ పేరుతో రష్యన్ ఇంటర్నేషనల్ అఫైర్స్ కౌన్సిల్ (RIAC) నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో లావ్రోవ్ మాట్లాడుతూ.. ఈ పర్యటన కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు.
భారత ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ (Narendra Modi) మూడోసారి బాధ్యతలు చేపట్టిన తరువాత .. తన తొలి అంతర్జాతీయ పర్యటనకు ఆయన రష్యా వెళ్లిన విషయాన్ని లావ్రోవ్ గుర్తుచేశారు. ఇప్పుడు తమవంతు వచ్చిందన్నారు. అయితే, పర్యటన తేదీలను మాత్రం ఆయన వెల్లడించలేదు.
Also Read: ఇండియాలో మైనారిటీలపై దాడులు.. అమెరికా నివేదిక.. గట్టిగా బదులిచ్చిన భారత్
ఇదిలాఉంటే, ప్రధాని మోదీ గతేడాది జులైలో రష్యాలో పర్యటించారు. ఐదేళ్ల వ్యవధి తర్వాత అక్కడ పర్యటించడం అదే తొలిసారి. అంతకుముందు 2019లో రష్యాలోని వ్లాదివోస్టోక్ నగరంలో నిర్వహించిన ఆర్థిక సదస్సులో మోదీ పాల్గొన్న సంగతి తెలిసింది. రష్యా పర్యటన సందర్భంగా పుతిన్‌ను భారత్‌కు రావాలని మోదీ ఆహ్వానించారు. అమెరికా నుంచి టారిఫ్‌ల ముప్పు, ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగింపునకు సంప్రదింపులు జరుగుతోన్న సమయంలో పుతిన్ భారత్‌లో పర్యటించనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.
త్వరలోనే పుతిన్ చనిపోతాడు.. జెలెన్‌స్కీ వివాదాస్పద వ్యాఖ్యలు
రష్యా (Russia) అధ్యక్షుడు పుతిన్ (Vladimir Putin)ను ఉద్దేశిస్తూ.. ఉక్రెయిన్ (Ukraine) అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పుతిన్ త్వరలో చనిపోతాడని ఆయన పేర్కొన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌తో సమావేశం అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జెలెన్‌స్కీ (Volodymyr Zelenskyy) ఈ వ్యాఖ్యలు చేశారు.
‘పుతిన్ త్వరలో చనిపోతాడు. అది వాస్తవం. దీంతో ఇరుదేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ముగిసిపోతోంది. ఈ యుద్ధం కొనసాగాలని రష్యా కోరుకుంటోంది. ఇది ముగిసేలా ఆ దేశంపై ఒత్తిడి తీసుకురావాలి’ అని జెలెన్‌స్కీ పేర్కొన్నారు. ఇటీవల పుతిన్ ఆరోగ్యంపై వచ్చిన ఊహాగానాల నేపథ్యంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. పుతిన్ దగ్గుతున్నట్లు, అతని కాళ్లు, చేతులు వణుకుతున్నట్లు ఉన్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. దీంతో ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, ఆ వీడియోలో ఉన్న దృశ్యాలు 2022 నాటివని తెలుస్తోంది.
గతంలోనూ పుతిన్ ఆరోగ్య పరిస్థితులపై మీడియాల్లో అనేక కథనాలు వెలువడ్డాయి. ఆయన డూప్‌ని సైతం ఉపయోగిస్తున్నారంటూ ఆరోపణలు వినిపించాయి. పుతిన్ అప్పుడే వీటిని ఖండించారు. రష్యా అధ్యక్షుడి అనారోగ్య పరిస్థితులపై మీడియాలో వస్తున్న కథనాలను క్రెమ్లిన్ ఎప్పటికప్పుడూ ఖండిస్తూ వచ్చింది. అయితే, తాజాగా పుతిన్ చనిపోతారని జెలెన్‌స్కీ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటివరకు ఎవరూ స్పందించలేదు.
మరోవైపు.. రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధాన్ని ఆపేందుకు 30 రోజుల తాత్కాలిక కాల్పుల విరమణ పాటించాలంటూ అమెరికా చేసిన ప్రతిపాదనకు ఇప్పటికే ఉక్రెయిన్ అంగీకరించిన సంగతి తెలిసిందే. దీనిపై రష్యాను ఒప్పించేందుకు అగ్రరాజ్యం చర్చలు ప్రారంభించింది. సౌదీ వేదికగా రష్యాతో అమెరికా అధికారులు మంతనాలు జరుపుతున్నారు.
ఇందులోభాగంగానే నల్ల సముద్రంలో దాడులను నిలిపివేసేందుకు ఇరుదేశాల మధ్య అంగీకారం కుదిరినట్లు అమెరికా అధ్యక్షభవనం మంగళవారం ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటలకే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్.. పుతిన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణ ఒప్పందంపై తాము మధ్యవర్తిత్వం చేస్తున్నప్పటికీ ఆయన ఉద్దేశపూర్వకంగా దాన్ని అడ్డుకుంటున్నట్లు కన్పిస్తోందన్నారు.