Saudi Execute Foreigners| గల్ఫ్ దేశాల్లో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. ముఖ్యంగా హత్య, డ్రగ్స్ సరఫరా, అత్యాచారం లాంటి నేరాలకు మరణ శిక్ష విధించబడుతుంది. దొంగతనం చేస్తే.. చేతి వేళ్లు, చేతులు, నరికివేయబడతాయి. ఈ శిక్షలు ముఖ్యంగా సౌదీ అరేబియా, ఖతర్ లాంటి దేశాల్లో తీవ్రంగా అమలు పరుస్తున్నారు. అక్కడి ప్రభుత్వాలు తమ దేశంలో నేరం జరగడాన్ని సహించవు. అయితే కొన్ని నేరాలకు మరణ శిక్ష విధించడంపై మానవ హక్కుల సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా సౌదీ అరేబియాలో ఈ సంవత్సరం మరణ శిక్ష ద్వారా వధించబడిన విదేశీయుల సంఖ్య 100 దాటేసింది.
ఈ గణాంకాలు చాలా భయంకరగా ఉన్నాయని బెర్లెన్ లోని యూరోపియన్ – సౌదీ ఆర్గనైజేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ (ఇఎస్ఒహెచ్ఆర్ – ESOHR) సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది. శనివారం నవంబర్ 16 2024న సౌదీ అరేబియా దేశంలోని దక్షిణ నజ్రాన్ ప్రాంతంలో ఒక యెమెన్ దేశస్తడిని శిరచ్ఛేదన ద్వారా మరణ శిక్ష అమలు పరిచారు. ఆ వ్యక్తి తమ దేశంలో అక్రమంగా డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడ్డాడని.. అతడు దోషిగా తేలినందుకు మరణ శిక్ష విధించామని సౌదీ ప్రభుత్వం ప్రకటించింది. నజ్రాన్ మరణించిన యెమెనీ వ్యక్తితో కలిపి 2024లో మరణ శిక్ష ద్వారా చనిపోయిన విదేశియుల సంఖ్య 101 కి చేరిందని స్థానిక మీడియా రిపోర్ట్.
2023, 2022 సంవత్సరాలలో మరణ శిక్ష ద్వారా వధింపబడిన నేరస్తుల కంటే 2024 లో వధింపబడిన విదేశీ నేరస్తుల సంఖ్య మూడింతలకు చేరింది. గత రెండు సంవత్సరాలలో 34 మంది విదేశీ నేరస్తులు వధించబడ్డారు అని ఫ్రెంచ్ మీడియా ఎఎఫ్‌పి తెలిపింది. విదేశీ నేరస్తులను ఇంత పెద్ద సంఖ్యలో శిరచ్ఛేదన లాంటి క్రూర శిక్షలు వేయడం చాలా సీరియస్ అంశం అని ESOHR మానవ హక్కుల డైరెక్టర్ తాహ అల్ హజ్జీ అభిప్రాయపడ్డారు.
Also Read: విమాన ప్రయాణంలో ప్రైవేట్ పార్ట్స్ కాలిపోయాయి.. ఎయిర్‌లైన్స్‌పై కేసు పెట్టిన ప్రయాణికుడు!
అమ్నెస్టి ఇంట్నేషన్నల్ రిపోర్ట్ ప్రకారం.. 2023లో విదేశీయులకు మరణ శిక్ష విధించిన దేశాల జాబితాలో చైనా, ఇరాన్ తరువాత మూడో స్థానంలో సౌదీ అరేబియా ఉండగా.. ఈ సంవత్సరం ఈ జాబితా సౌదీ అరేబియా ప్రథమ స్థానానికి చేరింది. ఇప్పటివరకు ఈ సంవత్సరంలో వధింపబడిన స్థానికులు, విదేశి నేరస్తుల సంఖ్య 274కు చేరింది. 2024 సంవత్సరం ముగిసేలోగా ఈ సంఖ్య 300 దాటుతుందని మిడిల్ ఈస్ట్ దేశాల్లో మరణ శిక్షలకు వ్యతరేకంగా పోరాడుతున్న జీద్ బస్‌యూనీ అనే మహిళా లాయర్ అభిప్రాయపడ్డారు. మరణ శిక్ష విధించబడిన విదేశీయుల కుటుంబ సభ్యులు అనుక్షణం భయం గుప్పిట్లో బతుకుతున్నారని ఆమె అన్నారు.
అంతర్జాతీయ చట్టాల ప్రకారం.. మానవ హక్కులు పాటించడం లేదని సౌదీ అరేబియా ప్రభుత్వం చాలా కాలంగా విమర్శలు ఎదుర్కొంటూనే ఉంది. దీనివల్ల సౌదీలో విదేశీ పర్యాటకులు, పెట్టుబడిదారులు రావడం చాలా తక్కువ.
అయితే ఈ సంవత్సరం మరణ శిక్ష ద్వారా చనిపోయిన విదేశీయుల జాబితాలో ఎక్కువ శాతం పాకిస్తానీలున్నారు. ఈ జాబితాలో అత్యధికంగా 21 మంది పాకిస్తానీలు, 20 మంది యెమెనీలు, 14 మంది సిరియా పౌరులు, 9 మంది ఈజిప్ట్ దేశస్తులు, 8 మంది జోర్డాన్, 7 మంది ఇథియోపియా దేశానికి చెందినవారున్నారు. ఆ తరువాత సుడాన్, ఇండియా, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, ఎరిత్రియా, ఫిలిప్పీన్స్ పౌరుల సంఖ్య చూస్తే.. ప్రతి దేశం నుంచి ముగ్గురు చనిపోయారు.
వీరిలో వధించబడిన 101 మందిలో 69 మంది డ్రగ్స్ అక్రమ రవాణా చేసిన నేరస్తులు. విదేశి నేరస్తుల కేసుల్లో న్యాయ విచారణ పారదర్శకంగా జరగడం లేదని మానవ హక్కుల కార్యకర్తలు ఆరోపణలు చేస్తున్నారు. వారికి తమ కేసు గురించిన కీలక సమాచారం కూడా చెప్పకుండా ఏకపక్షంగా మరణ శిక్ష విధించడం జరుగుతోందని చెబుతున్నారు.
2022 సంవత్సరంలో సౌదీ యువరాజు ఈ అంశంపై ఒక మీడియా ఇంటర్‌వ్యూలో మాట్లాడుతూ.. మరణ శిక్ష చాలా వరకు తగ్గించేశామని.. కేవలం హత్య, లేదా ప్రజల ప్రాణాలకు ప్రమాదకరమైన నేరస్తులను మాత్రమే మరణ శిక్ష విధించడం జరుగుతోందని చెప్పారు. కానీ గణాంకాలు చూస్తే.. డ్రగ్స్ సరఫరా చేసినవారే ఎక్కువ శాతం ఉన్నారు.