Payroll Mistake| ఒక చిన్నస్థాయి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న మహిళ బ్యాంక్ అకౌంట్‌లో ఒక్కసారిగా రూ.13 కోట్లు వచ్చిపడ్డాయి. అది కూడా ఆమె నెల జీతం అని తెలియడంతో ఆమె షాకైపోయింది. తనకు అంత వేతనం ఎలా వచ్చిందని ఆశ్చర్యపోయింది. అయితే ఆమె దీని గురించి తన పై అధికారికి నిజాయితీగా వెళ్లి చెప్పింది. అది ఆ విభాగంలో పనిచేస్తున్న వారందరూ తెలిసుకొని ఆశ్చర్యపోయారు. ఉన్నతాధికారుల వరకు ఈ విషయం వెళ్లడంతో.. ఇది ఎలా సాధ్యమైందో విచారణ చేశారు. నిర్లక్ష్యంతో ప్రభుత్వానికి నష్టం చేకూర్చిన ముగ్గురు అధికారులను సస్పెండ్ చేశారు.
వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రం వేన్ కౌంటీలో జరిగిన ఒక అనుకోని లోపం వల్ల ఒక మహిళా ఉద్యోగి ఒక్క రోజులో కోటీశ్వరురాలిగా మారింది. మే నెలలో ఈ ఉద్యోగి బ్యాంకు ఖాతాలో ఏకంగా 1.6 మిలియన్ డాలర్లు (సుమారు 13 కోట్ల రూపాయలు) జమ అయ్యాయి. ఈ లోపం మానవ తప్పిదం వల్ల జరిగిందని, కౌంటీలోని రక్షణ వ్యవస్థలు దీన్ని గుర్తించలేకపోయాయని స్థానిక మీడియా నివేదించింది.
సదరు మహిళా ఉద్యోగి 20 సంవత్సరాలకు పైగా వేన్ కౌంటీ ప్రభుత్వ విభాగంలో పనిచేస్తోంది. తన ఖాతాలో భారీ మొత్తం జమ అయిన విషయాన్ని గమనించిన ఆమె.. వెంటనే మరుసటి రోజు తన సూపర్‌వైజర్‌కు తెలియజేసింది. ఆమె నిజాయితీకి అందరూ మెచ్చుకున్నారు.
మీడియా రిపోర్ట్ ప్రకారం.. ఈ తప్పిదం ఉద్యోగికి జీతం పెంచిన తర్వాత సూపర్‌వైజర్ పే వివరాలను అప్‌డేట్ చేస్తున్నప్పుడు జరిగింది. అక్కడ వేతనం ప్రతి గంటకు చేసిన పని ప్రకారం లెక్కించబడుతుంది. అలా ఆమె సూపర్ వైజర్ ఆమె వేతనం ప్రతి గంటకు రేటు కలిపి కంప్యూటర్‌లో ఎంట్రీ చేసే సమయంలో గంట రేటకు బదులు ఆమె ఉద్యోగ ఐడిని ఎంట్రీ చేశాడు. దీంతో ఆమె వేతనం తప్పుగా రికార్డ్ అయింది. కానీ ఆ తరువాత చెక్ చేయాల్సి ఇద్దరు అధికారులు కూడా నిర్లక్ష్యంగా ఆమోదించేయడంతో ఆ మహిళా ఉద్యోగి నెల జీతం 1.6 మిలియన్ డాలర్లుగా బ్యాంకులో జయ చేయబడింది.
ఈ ఉద్యోగి నిజాయితీగా వ్యవహరించినప్పటికీ, ఈ సంఘటన తీవ్ర పరిణామాలకు దారితీసింది. ఈ లోపానికి కారణమైన ఇద్దరు ఉద్యోగులను తొలగించారు, మరొకరిని సస్పెండ్ చేశారు. ప్రారంభ దశలో తప్పు జరిగినా ఆ తరువాత పే రోల్ సిస్టంలో ఆ తరువాత కూడా పలు దశల్లో ఈ తప్పుని గుర్తించ వలసి ఉండాల్సింది అని.. కానీ గుర్తించకుండా నిర్లక్ష్యంగా ఆమోదించిన ఇద్దరు అధికారులను ఉద్యోగం నుంచి తొలగించారు.
తప్పు జరగడానికి ఇదే కారణం
కౌంటీ ఎగ్జిక్యూటివ్ వారెన్ ఎవాన్స్ మాట్లాడుతూ.. “ఇలాంటి తప్పులకు ఎటువంటి సమర్థన లేదు. ఇలాంటివి జరగకూడదు, కానీ దాదాపు జరిగిపోయాయి,” అన్నారు. ఈ సమస్య వేన్ కౌంటీలో కొత్తగా ప్రవేశపెట్టిన ఒరాకిల్ సాఫ్ట్‌వేర్ ఆధారిత పేరోల్ సిస్టంలో జరగడం ఇదే తొలిసారి కాదు. గత ఏడాది ఆగస్టులో.. షెరీఫ్ శాఖలోని (పోలీస్ శాఖ) వందలాది ఉద్యోగులకు జీతాలు తక్కువగా చెల్లించారు. కొందరికి దాదాపు పూర్తి జీతం కూడా రాలేదు.
ఉద్యోగుల కథనం ప్రకారం.. చాలా మంది సిబ్బందికి కొత్త వ్యవస్థపై సరైన శిక్షణ లేదు. ఇదే ఇలాంటి లోపాలకు ప్రధాన కారణంగా ఉంది. కౌంటీ కమిషన్ చైర్‌పర్సన్ అలీషా బెల్, గత చెల్లింపులన్నింటినీ పూర్తిగా సమీక్షించాలని కోరారు. “ఒకవేళ 100 లేదా 200 డాలర్ల తప్పు జరిగితే ఎవరూ గమనించకపోవచ్చు. కానీ మిలియన్ డాలర్లు? అది స్పష్టంగా కనిపిస్తుంది,” అని ఆమె అన్నారు.
Also Read: ఆస్తి మొత్తం నాకు పుట్టిన 100 మంది పిల్లలకే.. టెలిగ్రామ్ సిఈఓ ప్రకటన
తప్పు మళ్లీ జరగకుండా ఉండేందుకు.. ఏం చేయాలి?
వేన్ కౌంటీ ఇప్పుడు తమ పేరోల్ వ్యవస్థను మెరుగుపరచడానికి, సిబ్బందికి సరైన శిక్షణ ఇవ్వడం చాలా అవసరం. ఇలాంటి ఖరీదైన తప్పులు మళ్లీ జరగకుండా చూడడానికి అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ శిక్షణ ఇవ్వడానికి కౌంటీ అధికారులు ఒత్తిడి ఎదుర్కొంటున్నారు.