South Korea Impeachment| దక్షిణ కొరియా రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. ఆపద్ధర్మ అధ్యక్షుడిగా కొనసాగుతున్న హాన్ డక్ సూపై (Han Duck-soo) ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానానికి జాతీయ అసెంబ్లీ శుక్రవారం ఆమోదం తెలిపింది. ఈ సమావేశాలను అధికార పీపుల్ పవర్ పార్టీ(పిపిపి) బాయ్ కాట్ చేయడంతో తీర్మానానికి 192-0 ఓట్లతో సభ ఆమోదం లభించింది. ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ అభిశంసనకు మద్దతు పలకగా అధికార పీపుల్స్ పవర్ పార్టీ సభ్యులు స్పీకర్ పోడియం ముందు నిరసనకు దిగారు. చివరకు సభను బాయ్ కాట్ చేశారు. అభిశంసన తీర్మానానికి ఆమోదం లభించడంతో అధ్యక్ష అధికారాలు, బాధ్యతలకు హాన్ తాత్కాలికంగా దూరమయ్యారు.
ప్రస్తుతం బంతి ఆ దేశ రాజ్యాంగ న్యాయస్థానంలో ఉంది. పదవీచ్ఛితుడైన యూన్‌ను తిరిగి పదవిలో పునఃప్రతిష్ఠించాలా లేదా డిస్మిస్ చేయాలా అనేది రాజ్యాంగ న్యాయస్థానమే తేలుస్తుంది. తన అభిశంసన తీర్మానం ఆమోదం పొందడంపై హాన్ విచారం వ్యక్తం చేశారు. అయితే, సభ నిర్ణయాన్ని తాను గౌరవిస్తున్నట్ట ప్రకటించారు.
Also Read: 2025 ప్రపంచంలో మృత్యు తాండవం.. సిరియా పతనమే పునాది.. బాబా వంగా జోస్యం
అధికార పీపీపీ పార్టీకి చెందిన అధ్యక్షడు యూన్ సుక్ యోల్ (Yoon Suk Yeol) దేశంలో మార్షియల్ లా (మిలిటరీ పాలన) విధించడంతో దేశంలో రాజకీయం రసకందాయంలో పడిన విషయం తెలిసింది. మార్షియల్ లా విధించడాన్ని వ్యతిరేకించిన ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ జాతీయ అసెంబ్లీలో ఆయనకు వ్యతిరేకంగా అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దీనికి సభ ఆమోదం లభించడంతో డిసెంబర్ 14న యూన్ అభిశంసనకు గురయ్యారు. ఆయన స్థానంలో ప్రధాన మంత్రి హాన్ తాత్కాలిక అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించారు. మరోవైపు, యూన్ అభిశంసన తీర్మానం ప్రస్తుతం రాజ్యాంగ న్యాయస్థానం పరిశీలనలో ఉంది. న్యాయస్థానం ఆమోదం పొందేందుకు ఆరుగురు న్యాయమూర్తుల మద్దతు కావాలి. రాజ్యాంగ కోర్టులో మొత్తం సభ్యుల సంఖ్య 9 కాగా ప్రస్తుతం ఆరుగురే ఉన్నారు. మరో ముగ్గురిని నామినేట్ చేసేందుకు ప్రతిపక్ష పార్టీ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త న్యాయమూర్తుల నియామకం రాజకీయంగా కాకరేపుతోంది.
జాతీయ అసెంబ్లీ ప్రతిపాదించిన ముగ్గురు న్యాయమూర్తుల నియామకాన్ని పూర్తి చేయాలంటూ అపద్ధర్మ అధ్యక్షుడు హాన్‌ను ప్రతిపక్షం పట్టుబడుతోంది. యూన్ మద్దతుదారులు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆపద్ధర్మ అధ్యక్షుడిగా ఉన్నందున హాన్‌కు ఈ అధికారం లేదని వాదిస్తున్నారు. న్యాయమూర్తులను నియమించేందుకు తాను సిద్ధంగా లేనని హాన్ కూడా స్పష్టం చేశారు. సభ్యులందరి ఏకాభిప్రాయంతోనే న్యాయమూర్తుల నియామకం చేపట్టాలని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ హాన్‌పై కూడా అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదింప చేసుకుంది.
దక్షిణ కొరియా (South Korea) నిబంధనల ప్రకారం, అధ్యక్షుడి అభిశంసనకు జాతీయ అసెంబ్లీ సభ్యుల్లో మూడింట రెండు వంతుల మంది ఆమోదం తెలపాలి. ఇక సభలో సభ్యుల సంఖ్య 300. అయితే, ఆపద్ధర్మ అధ్యక్షుడి అభిశంసనకు (Impeachment) సంబంధించి స్పష్టమైన నిబంధనలేమీ లేవు. ఈ క్రమంలో తీర్మానానికి సాధారణ మెజారిటీ లభించినా ఆపద్ధర్మ అధ్యక్షుడి అభిశంసనకు గురవుతారని స్పీకర్ ప్రకటించారు. చివరకు 190 మంధి సభ్యుల మద్దతు పలకడంతో ఈ తీర్మానానికి జాతీయ అసెంబ్లీ ఆమోదం లభించినట్టైంది. ప్రస్తుతం రాజ్యాంగ ధర్మాసనం ఈ రెండు అభిశంసనలపై తీర్పు వెలువరించాల్సి ఉంది. దీంతో, తదుపరి ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం దక్షిణ కొరియా అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది. ఆ స్థానంలో ఆర్థిక మంత్రి చోయి సాంగ్ మోక్ రెండో తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.