Tibet Mining: టిబెట్‌లో మంచు కొండల మధ్య భారీగా మైనింగ్ కార్యకలాపాలు జరుగుతున్నాయి. చైనా విడుదల చేసిన పర్యావరణ నివేదిక ప్రకారం.. టిబెట్‌లో ఉన్న 694 మైనింగ్ ప్రాంతాల్లో 156 ప్రాంతాలు… గ్లేసియర్లకు అంటే మంచు కొండలకు కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. ఈ మైనింగ్ ప్రాంతాల చుట్టూ… దాదాపు 1,811 చదరపు కిలోమీటర్ల మేర మంచు ప్రాంతం ఉన్నట్లు ఆ నివేదికలో వెల్లడైంది.
లోఝాగ్ ప్రాంతంలోనూ మైనింగ్ కార్యకలాపాలు..
ఈ ప్రాంతాల నుంచి పుట్టే కొన్ని నదులు.. భారత్, నేపాల్, భూటాన్ వైపు ప్రవహిస్తాయి. గ్లేసియర్లకు దగ్గరగా ఉన్న టాప్ టెన్ మైనింగ్ ప్రాంతాల్లో.. ఆరు యార్లుంగ్ సాంగ్పో నదీ పరివాహక ప్రాంతంలోనే ఉన్నట్లు చైనా నివేదిక చెబుతోంది. వాటిలో ఒకటి.. టషిఖాంగ్ లెడ్-జింక్ గని. ఈ గని చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిలోనే దాదాపు 159 చదరపు కిలోమీటర్ల మంచు ప్రాంతం ఉన్నట్లు అంచనా. ఈ ప్రాంతం నుంచి వచ్చే నీరు.. భారత్‌లోని సుబన్‌సిరి నదీలోకి చేరుతుంది. అలాగే కొన్ని గనులు.. న్యామ్‌జాంగ్ చూ నదికి దగ్గరగా ఉన్నాయి. ఈ నది భారత్‌లోని అరుణాచల్ ప్రదేశ్ వైపు ప్రవహించి.. ఆ తర్వాత భూటాన్‌లోని మానస్ నదీతో కలుస్తుంది. భూటాన్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న లోఝాగ్ ప్రాంతంలోనూ మైనింగ్ కార్యకలాపాలు.. అంతర్జాతీయంగా ప్రవహించే నదులకు సమీపంలోనే ఉన్నాయి.
గనుల కోసం కొండలను తవ్వడం..
గనుల కోసం కొండలను తవ్వడం.. పేలుళ్లు జరపడం.. వ్యర్థాలను పేరుకుపోయేలా చేయడం.. నీటి ప్రవాహాన్ని మార్చడం.. ఇవన్నీ ఇప్పటికే వాతావరణ మార్పులతో బలహీనంగా మారిన మంచు కొండలు, కొండచరియలపై అదనపు ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణుల పరిశోధనలు చెబుతున్నాయి. దీంతో మంచు వేగంగా కరగడం.. నేల గట్టితనం తగ్గడం.. కొండచరియలు జారిపడటం.. మంచు సరస్సులు పెరగడం వంటి సమస్యలు రావచ్చు. అదే జరిగితే.. మంచు సరస్సులు ఒక్కసారిగా బద్దలై భారీగా నీరు దిగువకు రావచ్చు. దీన్నే గ్లేసియల్ లేక్ ఔట్‌బర్స్ట్ ఫ్లడ్.. అంటారు.
ప్రమాదకరమైన మంచు సరస్సులు..
చైనా-నేపాల్ సరిహద్దు నదీ ప్రాంతాల్లోనే కనీసం 47 ప్రమాదకరమైన మంచు సరస్సులు ఉన్నాయి. అంటే.. సమస్య ఒక్క గని గురించో, ఒక్క మంచు కొండ గురించో కాదు. టిబెట్‌లో ఎగువ ప్రాంతాల్లో జరిగే కార్యకలాపాల ప్రభావం.. దిగువన ఉన్న భారత్, నేపాల్, భూటాన్ ప్రజలపై కూడా పడే అవకాశం ఉంది. అయితే.. ప్రస్తుత వరదలకు మైనింగ్ ఒక్కటే కారణమని చెప్పలేం. వాతావరణ మార్పులు కూడా హిమాలయాల్లో వరదలు, మంచు సరస్సుల ప్రమాదాన్ని పెంచుతున్నాయి. కానీ.. గ్లేసియర్లకు ఇంత దగ్గరగా మైనింగ్ జరుగుతున్న నేపథ్యంలో.. దిగువ దేశాలకు సరైన సమాచారం ఇవ్వడం.. నదులపై డేటాను పంచుకోవడం.. ప్రమాదాలను ముందుగానే గుర్తించడం చాలా కీలకం. ఎగువ ప్రాంతాల్లో జరిగే తవ్వకాల ప్రభావం.. దిగువ ప్రాంతాల్లో విపత్తుగా మారకుండా ఉండాలంటే.. పరస్పర సహకారం, నిరంతర పర్యవేక్షణ, పారదర్శక సమాచారమే కీలకం.
Also Read: మియాపూర్ అపార్ట్‌మెంట్‌లో యువ డాక్టర్ అనుమానాస్పద మృతి!