Horror Movie: ఓ కుటుంబంలోకి కొత్తగా కోడలు వస్తుంది. సాధారణంగా పెళ్లి తర్వాత కొత్త జీవితం మొదలవ్వాలి. కానీ ఇక్కడ మాత్రం కోడలు అడుగు పెట్టిన తర్వాతే ఆ ఇంట్లో భయంకరమైన పరిణామాలు మొదలవుతాయి. ఒక్కొక్కరిగా కుటుంబ సభ్యులు చనిపోవడం… ఇంట్లో కనిపించే వింత సంఘటనలతో చివరికి మొత్తం కుటుంబమే భయంతో వణికిపోయే పరిస్థితి నెలకొంటుంది. ఇదే కథతో రూపొందిన ‘ఈవిల్ డెడ్ బర్న్’ (Evil Dead Burn) మూవీలో ఓ కుటుంబ వేడుక ఎలా భయంకరమైన డెడ్‌లైట్ దాడిగా మారుతుందో చూస్తే గుండె జారిపోద్ది. మరి ఆ ఇంట్లోకి అసలు ఏ శక్తి వచ్చింది? కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా ఎందుకు మారిపోతున్నారు ? అంటే…
భర్తను కోల్పోయిన ఆలిస్ తన అత్తమామల ఇంటికి వెళ్తుంది. భర్త మరణంతో ఇప్పటికే మానసికంగా కుంగిపోయిన ఆమెకు అక్కడి కుటుంబ సభ్యులతోనూ సరిగ్గా అనుబంధం ఉండదు. ముఖ్యంగా తన భర్త విల్ తో ఉన్న గత అనుభవాల కారణంగా ఆమె ఆ కుటుంబానికి దూరంగా ఉండాలని చూస్తుంది. ఇదే సమయంలో జోసెఫ్ తన తాత బెంజమిన్‌కు సంబంధించిన కొన్ని పాత వస్తువులు, రహస్య పరిశోధనలను తెలుసుకుంటాడు. అక్కడే నెక్రోనామికాన్ కు సంబంధించిన విషయాలు, డెడ్లైట్స్ గురించి అతడికి కొన్ని ఆధారాలు కనిపిస్తాయి. అలాగే కాండేరియన్ డాగర్ కు సంబంధించిన రహస్యం కూడా బయటపడుతుంది.
ఈ పురాతన వస్తువుతో సంబంధం ఉన్న శక్తిని అనుకోకుండా మేల్కొలిపే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ తర్వాత విల్ ఓ ప్రమాదానికి గురవుతాడు. ఆ సంఘటనతో మొదలైన దుష్టశక్తి ప్రభావం అతడి కుటుంబం వరకు చేరుతుంది. కుటుంబ సభ్యులంతా ఓ చోట చేరిన సమయంలో అసలు కథ మొదలవుతుంది. ఒకరిని ఒకరు నమ్మలేని పరిస్థితి వస్తుంది. ఎవరు మనిషి ? ఎవరు డెడ్లైట్ ప్రభావంలో ఉన్నారు ? అనే సందేహం ప్రతి క్షణం వెంటాడుతుంది.
ఆలిస్ మాత్రం పరిస్థితిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. తన భర్త కుటుంబం తనను అంగీకరించకపోయినా, ఇప్పుడు వాళ్లందరూ ఒకే ప్రమాదంలో ఉన్నారని తెలుసుకుంటుంది. మరోవైపు కుటుంబంలో గతం నుంచి ఉన్న గొడవలు, విల్ కు సంబంధించిన నిజాలు కూడా బయటపడతాయి. డెడ్లైట్స్ కేవలం శరీరాలను ఆక్రమించడం మాత్రమే కాదు, కుటుంబ సభ్యుల మధ్య ఉన్న బలహీనతలను కూడా తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటాయి.
ఇక ఇంట్లో ప్రతి తలుపు వెనుక ఓ ప్రమాదం… ప్రతి వ్యక్తిపై అనుమానం… ఎప్పుడు ఎవరు మారిపోతారో తెలియని పరిస్థితి. దాంతో సినిమా పూర్తిగా సర్వైవల్ హారర్ మోడ్‌లోకి వెళ్తుంది. ఆలిస్ తనను తాను కాపాడుకోవడమే కాకుండా ఈ భయంకరమైన శక్తి నుంచి బయటపడేందుకు మార్గాన్ని వెతకాల్సి వస్తుంది. కాండేరియన్ డాగర్‌కు ఉన్న అసలు శక్తి ఏంటి ? డెడ్లైట్స్‌ను ఆపడానికి కుటుంబ సభ్యులకు ఉన్న ఏకైక మార్గం ఏమిటి ? ఆలిస్ ఎవరిని నమ్మాలి ? కుటుంబంలో చివరికి ఎవరు మిగులుతారు ? విల్ మరణం వెనుక అసలు మలుపు ఏంటి ? ఈ దుష్టశక్తి నుంచి ఆలిస్ బయటపడుతుందా ? ఆ ఇంట్లో మొదలైన ఈ చావుల పరంపర ఇంకా ఎవరెవరిని బలితీసుకుంటుంది ? అనేది తెలియాలంటే సినిమాను డోంట్ మిస్.
సెబాస్టియన్ వానిచెక్ (Sébastien Vaniček) దర్శకత్వం వహించిన ఈ హారర్ మూవీలో సౌహెయిలా యాకూబ్, టాండీ రైట్, హంటర్ డూహాన్, లూసియానె బుకానన్ తదితరులు నటించారు. ఇది ‘ఈవిల్ డెడ్’ ఫ్రాంచైజీలో 2026లో వచ్చిన కొత్త అధ్యాయం. ప్రస్తుతం HBO Maxలో ఉంది.