Trump 3rd Term President| అమెరికా రాజకీయాల్లో వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ డొనాల్డ్ ట్రంప్. ఆయన ఇంతకుముందు కూడా చాలా సార్లు దురుసుగా మాట్లాడి వివాదాల్లో నిలిచారు. తాజాగా మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే రెండోసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన రిపబ్లికన్ పార్టీ నాయకుడు డొనాల్డ్ ట్రంప్ తాను మూడోసారి కూడా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉన్నట్లు పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.
రాజధాని వాషింగ్టన్ డిసిలో బుధవారం రాత్రి ట్రంప్ రిపబ్లికన్ హౌస్ లో మాట్లాడుతూ.. తాను మరోసారి ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఉందని. అయితే దానికోసం ప్రజాభిప్రాయం అవసరమని చెప్పారు. ఇది వినగానే ఆయన అభిమానులు ఉత్సహంతో ఆయనకు మద్దతు తెలిపారు. దీంతో అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పుడు ట్రంప్ మరో చర్చకు దారి తీశారు. ఎందుకంటే ఇప్పటివరకు అమెరికా రాజ్యాంగం ప్రకారం ఏ అధ్యక్షుడు కూడా మూడు సార్లు పదవి చేపట్ట కూడదు. అలా చేయడానికి ఆ దేశ రాజ్యాంగంలోని 22వ సవరణ (22 అమెండ్‌మెంట్)లో ఆంక్షలు విధించారు. అయితే ట్రంప్ తాను మూడో సారి ప్రెసిడెంట్ కావడానికి రాజ్యాంగంలో సవరణలు చేస్తారా? అలా చేయడం సాధ్యమవుతుందా? అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం.
Also Read: కరిగిపోయిన ట్రంప్ ఆస్తి.. ఒక్కరోజులో 300 మిలియన్ డాలర్లు నష్టం!
అమెరికాలో ఒక వ్యక్తి రెండు సార్లు మాత్రమే అధ్యక్ష పదవి చేపట్టాలి. అమెరికా రాజ్యాంగంలోని 22వ సవరణ ప్రకారం ఒక వ్యక్తి మూడోసారి దేశ అధ్యక్షునిగా పోటీ చేయకుండా ఆంక్షలు నియమాల రూపొందించారు. ఒకవేళ అమెరికా ప్రెసిడెంట్ పదవి మూడోసారి చేపట్టాలంటే రాజ్యాంగంలోని 22 సవరణలో మార్పులు చేయాలి. దీని కసం కాంగ్రెస్, రాష్ట్ర సెనేట్ ల నుంచి ఒక బిల్లు ప్రతిపాదించాలి. ఆ బిల్లుని అమెరికాలోని 75 శాతం రాష్ట్రాలు అమోదం పొందాలి. ఇది జరగడం అసాధ్యం కాకపోయినా చాలా కష్టతరం.
ట్రంప్ ఒకవేళ మూడో సారి దేశ అధ్యక్షుడిగా పోటీ చేసే ఆలోచనలో ఉంటే ఆయన 22 సవరణలోని ఆంక్షలను తొలగించేందుకు ప్రయత్నించాల్సి ఉంటుంది. కానీ ఈ ఆంక్షలను తొలగించడం ట్రంప్ నకు అంత సులభం కాదని రాజకీయ విశ్లేషకుల అంచనా.
22వ అమెండ్ మెంట్ ఏంటి? దాన్ని ఎందుకు రూపొందించారు?
అమెరికా అధ్యక్షుడిగా ఫ్రాంక్లిన్ డి రూజ్ వెల్ట్ 1933 నుంచి 1945 వరకు నాలుగు సార్లు ప్రెసిడెంట్ పదవి చేపట్టారు. ఆ పదవికాలంలోనే ఒక వ్యక్తి గరిష్టంగా రెండు సార్లు మాత్రమే దేశ అధ్యక్షుని పని చేయాలని ఆంక్షలు విధించాలని డెమోక్రాట్స్, రిపబ్లికన్లు రెండు రాజకీయ పార్టీలకు చెందిన నాయకుల మధ్య చర్చలు జరిగాయి. ఈ విషయం అమెరికా మొదటి అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్ కూడా తాను పదవికాలంలో ఉండగా చెప్పారు. అందుకే ఇరు పార్టీలు చర్చించుకున్నాక 1951వ సంవత్సరంలో రాజ్యాంగంలో 22వ అమెండ్ మెంట్ చేశారు.
ఈ అమెండ్‌మెంట్ ని తొలగించాలంటే ముందుగా సెనేట్, కాంగ్రెస్ (హౌస్ ఆఫ్ రెప్రెంజెంటేట్వివ్స్) రెండు సభల్లో కూడా బిల్లు ప్రతిపాదించాలి. ఆ బిల్లు 2/3 మెజారిటీతో ఆమోదం పొందాలి. ఆ తరువాత అమెరికాలోని 75 శాతం రాష్ట్రాలు కూడా దీన్ని ఆమోదించాలి. ఈ ప్రక్రియ మొత్తం చాలా క్లిష్టంగా సాగుతుంది. ఇదంతా జరగాలంటే అన్ని రాజకీయ పార్టీలు కలిసి పనిచేయాలి. అందుకే 22 వ అమెండ్ మెంట్ తొలగించడం దాదాపు అసాధ్యమని నిపుణలు అభిప్రాయపడుతున్నారు.
అయితే ట్రంప్ తాజాగా చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే.. ఆయన కేవలం తన పార్టీలో ఉత్సాహం నింపడానికే అలా మాట్లాడి ఉంటారని అంతే తప్ప ట్రంప్ మూడో సారి ప్రెసిడెంట్ కావడం ఆచరణలో సాధ్యం కాదని చెబుతున్నారు.