EB-5 Visa Indians| అమెరికాలో నివసించే భారతీయులను టార్గెట్ చేసే విధంగా ట్రంప్ ప్రభుత్వం ప్రత్యేక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇండియన్స్‌కు మాత్రమే ఇబ్బందులు కలిగించేలా వరుసగా కొత్త నిబంధనలను అమలు చేస్తోంది. హెచ్–1బీ వీసాలు, గ్రీన్‌కార్డులపై ఆశలు పెట్టుకున్నవారి కలలకు విఘాతం కలిగిస్తూ.. తాజాగా ప్రెసిడెంట్ ట్రంప్ మరో నిర్ణయం తీసుకున్నారు. ఎంప్లాయ్‌మెంట్ బేస్డ్ ఫిఫ్త్ ప్రిఫరెన్స్ (ఈబీ–5) అన్ రిజర్వ్డ్ కేటగిరీ కింద వీసాల కోసం దరఖాస్తు చేసే వారికి సంబంధించి కటాఫ్ తేదీని ఆరు నెలలు ముందుకు చిప్పింది. 2019 నవంబర్ 1ని కటాఫ్‌గా ఉన్న తేదీని 2019 మే 1కు మార్చింది. ఈబీ–5 కేటగిరీలో భారతీయుల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉందని చెబుతూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.
మే నెలకు సంబంధించి విడుదల చేసిన వీసా బులెటిన్‌లో అమెరికా విదేశాంగ శాఖ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. దీని ఫలితంగా ఎంతోమంది భారతీయులు ఈబీ–5 కేటగిరీ కింద దరఖాస్తు చేసుకునే అర్హత కోల్పోతున్నారు. ప్రతినెల విడుదలయ్యే వీసా బులెటిన్‌లో విదేశాంగ శాఖ ప్రకటించే ‘ఫైనల్ యాక్షన్ డేట్స్’ చాలా కీలకంగా ఉంటాయి. వీసా లేదా గ్రీన్‌కార్డు దరఖాస్తును ప్రాసెస్ చేయాలంటే యూఎస్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ అధికారులు (యూఎస్‌సీఐఎస్) ఆ తేదీలను ఆధారంగా తీసుకుంటారు. దరఖాస్తుదారుడి ప్రాధాన్యం తేదీ, బులెటిన్‌లో పేర్కొన్న తేదీ కంటే ముందుండాలి.
మరోవైపు చైనా పౌరులకు మాత్రం ఈబీ–5 కోటాలో కటాఫ్ చేయకపోవడం విశేషం. ఎందుకంటే ఒకవైపు చైనాతో సుంకాల యుద్ధం తీవ్రం చేస్తున్న ట్రంప్ ప్రభుత్వం వీసాల విషయంలో మాత్రం భారతీయులనే టార్గెట్ చేసే విధంగా నిర్ణయాలు తీసుకుంటోంది.
Also Read: అంతరిక్షంలో మానవ వ్యర్థాలను ఎలా ఉపయోగించాలి?.. మంచి ఐడియా ఇస్తే రూ.25 కోట్లు
ఈబీ–5 వీసా కేటగిరీ
అర్హత కలిగిన విదేశీ పెట్టుబడిదారులకు అమెరికాలోని గ్రామీణ ప్రాంతాలు లేదా అధిక నిరుద్యోగం ఉన్న ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం కల్పించే వీసా కేటగిరీ ఇది. ఈబీ–5 కేటగిరీలో ప్రత్యేకంగా అన్ రిజర్వ్డ్ విభాగం కింద భారతీయుల నుంచి దరఖాస్తుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అందువల్ల అందుబాటులో ఉన్న వీసాల సంఖ్య తగ్గుతోంది. ఇప్పుడు తీసుకున్న ఈబీ–5 కటాఫ్ తగ్గింపు నిర్ణయం కారణంగా భారతీయులలో చాలామంది అర్హుల జాబితా నుంచి తొలగిపోతారు.
భారతీయ విద్యార్థుల్లో అనుక్షణం టెన్షన్ టెన్షన్
అమెరికాలో వలస విధానాలు కఠినతరం కావడంతో భారతీయ విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ట్రంప్ ప్రభుత్వం ఓపీటీ (Optional Practical Training) రద్దు చేసే బిల్లును తీసుకురావాలని యోచిస్తోంది. ఈ బిల్లు ఆమోదం పొందితే.. చదువు పూర్తయిన తరువాత అమెరికాలో ఉంటూ ఉద్యోగాలు వెతకడానికి ఇంతకుముందు ఉన్న మూడేళ్ల గడువు ఇకపై ఉండదు. దీంతో చదువు ముగియగానే విద్యార్థులు భారత్‌కు తిరిగి రావాల్సి ఉంటుంది. ప్రధానంగా స్టెమ్ కోర్సులు చేసిన భారతీయులే ఎక్కువగా ప్రభావితమవుతారు.
ఇక హెచ్1బీ వీసా కలిగిన వారు కూడా దేశం విడిచి వెళ్లాల్సి వస్తుందేమోనని భయపడుతున్నారు, తిరిగి అనుమతి లభించకపోవచ్చన్న ఆందోళనలో ఉన్నారు. ప్రముఖ ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు విదేశాలకు వెళ్లొద్దని సూచిస్తున్నాయి. గ్రీన్‌కార్డు ఉన్నవారిపైనా విమానాశ్రయాల్లో విచారణలు జరుగుతుండగా.. కొత్త నిబంధనలతో అందరూ ఇక ముందు ఏం జరుగుతుందోనని భయపోడిపోతున్నారు.
పెళ్లి తర్వాత గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసే వ్యక్తులు తమ ఆర్థిక స్థితిగతులు, వ్యక్తిగత సమాచారం, బంధువులకు సంబంధించి ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది. ఈ మార్పుల వల్ల కూడా వలసదారుల్లో భయం, అనిశ్చితి పెరిగింది.