Trump Govt: అమెరికాలో చదువుకోవాలని భావించిన విద్యార్థులకు ట్రంప్ సర్కార్ ఝలక్ ఇచ్చింది. అక్కడ చదువుకోవడం, ఉద్యోగం చేసేవారి ఫీజులను అమాంతంగా పెంచేసింది. విద్యార్థుల నుంచి రుసుములు కళాశాలలు, విశ్వవిద్యాలయాలు వసూలు చేయనున్నాయి. దీంతో విదేశీ విద్య మరింత ఖరీదుగా మారనుంది.
అమెరికాలో చదువుల కోసం ప్రతీ ఏటా ఇండియా, చైనా నుంచి లక్షల్లో విద్యార్థులు వెళ్తుంటారు. వారిని ట్రంప్ ప్రభుత్వం ఊహించని విధంగా షాక్ ఇచ్చింది. అమెరికాలో చదువు విద్యార్థులకు మరింత భారం కానుంది. ఇదే కాదు అదనపు ఉద్యోగం చేయడం ఖరీదైనదిగా మారవచ్చు. ఈ నిర్ణయం వల్ల భారత్-చైనా విద్యార్థులు అత్యధికంగా ప్రభావితమవుతారు. 2024-25 గణాంకాల ప్రకారం.. అమెరికాలో భారత్ నుండి సుమారు 3.63 లక్షల మంది విద్యార్థులు, చైనా నుండి సుమారు 2.66 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. రెండు దేశాల నుండి సుమారు 6.3 లక్షల మంది విద్యార్థులు అమెరికాలో ఉన్నారు.
ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్- OPT కార్యక్రమంలో పాల్గొనే అంతర్జాతీయ విద్యార్థులపై భారీ రుసుములను విధించాలని ప్లాన్ చేసింది ట్రంప్ ప్రభుత్వం. ఈ రుసుమును విద్యార్థుల నుండి సంబంధిత కళాశాల లేకుంటే యూనివర్సిటీలు వసూలు చేయనున్నాయి. వాస్తవానికి విదేశీ విద్యార్థుల కోసం ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్- OPT ప్రోగ్రామ్‌కు చేసే దరఖాస్తులపై భారీగా 70 వేల డాలర్లు వసూలు చేయాలని భావిస్తోంది. భారత కరెన్సీలో అక్షరాలా 67.72 లక్షలన్న మాట. విద్యార్థులపై రుసుము విధించాలని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రతిపాదన చేసింది. ఆ లెక్కన OPT ప్రోగ్రామ్‌కు కింద దరఖాస్తు కోసం ప్రతీ కొత్త విద్యార్థి 70 వేల డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ప్రోగ్రామ్‌ను పొడిగించడానికి లేకుంటే పునరుద్ధరించడానికి మళ్లీ 30 వేల రుసుము ప్రతిపాదించింది. అంటే భారత కరెన్సీలో 29 లక్షల రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
OPT స్కీమ్ కింద అంతర్జాతీయ విద్యార్థులు తమ చదువుల కోసం అమెరికాకు వచ్చేవారు పని చేసే అవకాశం ఉంటుంది. సాధారణంగా విద్యార్థులు గ్రాడ్యుయేషన్ పూర్తి అయిన తర్వాత ఏడాది పాటు పని చేయవచ్చు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ ప్రధాన సబ్జెక్టులుగా చదివే విద్యార్థులు అదనంగా రెండేళ్లు పని చేయవచ్చు. తాజాగా కొత్త ప్రతిపాదన నేపథ్యంలో అధిక సంఖ్యలో విదేశీ విద్యార్థులను చేర్చుకునే అమెరికా కళాశాలలు, విశ్వవిద్యాలయాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. అక్కడి ఎడ్యుకేషన్ సంస్థలకు విదేశీ విద్యార్థులు నిధుల సమీకరణకు ఒక ముఖ్యమైన వనరు. అధిక సంఖ్యలో విదేశీ విద్యార్థులను చేర్చుకునే టెక్ కంపెనీలు, ఇతర పరిశ్రమలపై ప్రభావం చూపుతుంది.
దీని గురించి కొత్త నిర్వచనం చెప్పింది హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం. వీసా వ్యవహారంలో మోసం, దుర్వినియోగాన్ని నివారించే ప్రయత్నంగా రుసుము ప్రతిపాదన తీసుకొచ్చినట్టు చెబుతోంది. OPT స్కీమ్ చౌక.. విదేశీ శ్రమకు ఒక మార్గమని పేర్కొంది. అంతర్జాతీయ విద్యా రంగానికి ప్రాతినిధ్యం వహిస్తున్న NAFSA సంస్థ ట్రంప్ సర్కార్ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించింది. అంతర్జాతీయ విద్యార్థులను అమెరికా నుండి దూరం చేయడమేనని అంటోంది. అమెరికా ఆవిష్కరణలు, ఆర్థిక వృద్ధి, ఉపాధి వంటిపై ప్రభావం చూపుతుందని ఆ సంస్థ సీఈఓ అన్నారు.
ALSO READ: చేప వలలతో పాకీ సైన్యం సరికొత్త ప్రయోగం.. నవ్వుతున్న జనం
ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, ఈ ప్రతిపాదనపై తమ వ్యాఖ్యలు, అభ్యంతరాలను తెలియజేయడానికి ప్రజలకు రెండు నెలలు గడువు ఇచ్చింది. ఆ తర్వాత డిహెచ్‌ఎస్ దీన్ని ఖరారు చేయనుంది. ఉన్నత విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు ఈ ప్రతిపాదనను న్యాయస్థానంలో సవాలు చేసే అవకాశం ఉంది. ట్రంప్ ప్రభుత్వం గతంలో విదేశీ విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంది. గతేడాది వేలాది మంది విదేశీ విద్యార్థుల చట్టపరమైన హోదాను ఆకస్మికంగా రద్దు చేసింది చాలామందిని నిర్బంధించి అమెరికా నుండి బహిష్కరించింది. అంతర్జాతీయ విద్యార్థులు నాలుగేళ్లు కంటే ఎక్కువ కాలం అమెరికాలో ఉండటానికి ప్రభుత్వ ఆమోదం తప్పనిసరి చేసే ఓ నిబంధనను ఖరారు చేసింది. సెప్టెంబరులో ఈ నిబంధన అమలులోకి రాకుండా ఫెడరల్ కోర్టు నిరోధించిన విషయం తెల్సిందే.